రూపీ ఎఫెక్ట్: మూడో తేదీ నుంచి ‘హీరో’బైక్‌లు, స్కూటర్ల ధరల పెంపు
హీరో మోటో కార్ప్ బైక్‌ల కొనుగోలు దారులకు కష్టాలు వచ్చి పడ్డాయి. డాలర్ పై రూపాయి పతనం దరిమిలా హీరో మోటో కార్ప్ తన మోటార్ సైకిళ్లు, స్కూటర్ల ధరలను స్వల్పంగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. వచ్చే నెల మూడో తేదీ నుంచి అమలులోకి ఈ నిర్ణయం అమలులోకి రానున్నది.
దేశీయ మోటార్ సైకిళ్లు, స్కూటర్ల తయారీలో అగ్రశ్రేణి సంస్థల్లో ఒకటిగా ఉన్న హీరో మోటో కార్ప్.. అన్ని రకాల తన ఉత్పత్తుల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. వచ్చే నెల మూడో తేదీ నుంచి ధరల పెరుగుదల అమలులోకి వస్తుందని తేల్చేసింది.
హీరో మోటార్ సైకిళ్లు, స్కూటర్ల ధర రూ.900 వరకు పెరుగుతుందని పేర్కొంది. అయితే ఆయా మోడల్ బైక్ లు, స్కూటర్ల ధరలు ఎంత మేర పెరుగుతాయన్న సంగతి మాత్రం బయటపెట్టలేదు. ఆయా మోడల్ బైక్‌లు, స్కూటర్లను బట్టి ధరలు ఖరారవుతాయని సమాచారం.
అమెరికా డాలర్‌పై రూపాయి పతనం, కమొడిటీ వ్యయం పెరిగిపోవడంతో హీరో మోటో కార్ప్ తన మోడల్ బైక్‌లు, స్కూటర్ల ధరలు తప్పనిసరిగా పెంచాల్సి వస్తోందని తెలిపింది. హీరో మోటో కార్ప్ తన బైక్‌లు, స్కూటర్ల ధరలను పెంచడం ఈ ఏడాదిలో ఇదే మొదటి సారి కాదు. ఇంతకుముందు ఏప్రిల్ నెలలో పెంచేసింది.
ఒక్కో మోడల్ బైక్, స్కూటర్‌ను బట్టి రూ.625 ధర పెంచినట్లు ప్రకటించింది. ఇన్ ఫుట్ వ్యయం, కమొడిటీ ధరలు పెరగడం వల్లే బైక్‌లు, స్కూటర్ల ధరలు పెంచక తప్పడం లేదని తెలిపింది. హీరో మోటో కార్ప్ ఉత్పత్తి చేస్తున్న మోటార్ బైక్‌లు, స్కూటర్ల ధరలు రూ.37,625 నుంచి రూ.1,10,500 వరకు పలుకుతున్నాయి.
గత ఆగస్టు నెలలో హీరో మోటో కార్ప్ 6,85,047 బైక్ లు, స్కూటర్లను విక్రయించినట్లు తెలిపింది. ధర పెంచినా గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది విక్రయాలు ఒకశాతం పెరిగినట్లు పేర్కొన్నది. గతేడాది ఆగస్టులో 6,78,797 ద్విచక్ర వాహనాలు విక్రయించినట్లు తెలిపింది. వచ్చే నెలలోనే నూతన స్ట్రీట్ బైక్ ‘హీరో ఎక్స్‌ట్రీమ్ 200 ఆర్’ మార్కెట్‌లోకి ఎప్పుడు అడుగు పెడుతుందో ప్రకటించనున్నది.