న్యూఢిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌ బీఎస్‌-6 ప్రమాణాలతో కూడిన సూపర్‌ స్ప్లెండర్‌ను దేశీయ మార్కెట్‌లోకి విడుదల చేసింది. మరోవైపు బీఎస్-4 మోడల్ స్ప్లెండర్ మోటారు సైకిళ్ల ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసినట్లు ప్రకటించింది.

బీఎస్-6 ప్రమాణాలతో రూపొందించిన సూపర్ స్ప్లెండర్ బైక్ ప్రారంభ ధరను రూ.67,300గా నిర్ణయించింది. 125సీసీ ఫ్యూయల్‌ ఇంజక్షన్‌ ఇంజిన్‌ 10.73 బీహెచ్‌పీని ఉత్పత్తి చేస్తుంది. ఈ సూపర్‌ స్ప్లెండర్‌ రెండు వేరియంట్లలో లభిస్తుంది.

Also read:విపణిలోకి బీఎస్‌-6 హోండా యూనికార్న్‌.. ధరెంతంటే?!

సెల్ఫ్‌ స్టార్ట్‌, డ్రమ్‌ బ్రేక్‌, అల్లాయ్‌ వీల్‌ కల వేరియంట్‌ ధర రూ.67,300 కాగా.. డిస్క్‌ బ్రేక్‌, అల్లాయ్‌ వీల్‌ వేరియంట్‌ ధరను రూ.70,800గా కంపెనీ నిర్ణయించింది. దేశీయ అత్యుత్తమ ద్విచక్ర వాహనాల్లో సూపర్‌ స్ప్లెండర్‌ ఒకటి అని పేర్కొంది. ఈ ట్రెండ్‌ భవిష్యత్‌లోనూ కొనసాగుతుందని కంపెనీ గ్లోబల్‌ ప్రొడక్ట్‌ ప్లానింగ్‌ హెడ్‌ మాలో లీ మాస్సన్‌ పేర్కొన్నారు.

ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి బీఎస్‌-6 వాహనాలే విక్రయించాలన్న ఆదేశాల నేపథ్యంలో బీఎస్‌-4 వాహనాల ఉత్పత్తిని నిలిపివేసినట్లు కంపెనీ తెలిపింది. ఇప్పటికే ఆ కంపెనీ నుంచి బీఎస్‌-6 ప్రమాణాలు కల స్ప్లెండర్‌ ఐస్మార్ట్‌, స్ప్లెండర్‌+, హెచ్‌ఎఫ్‌ డీలక్స్‌, ప్లెజర్‌+ 110, డెస్టినీ 125, మేస్ట్రో ఎడ్జ్‌125, ఎక్స్‌ట్రీమ్‌ 160R, ప్యాషన్‌ ప్రో, గ్లామర్‌ మోడళ్లు విడుదలయ్యాయి.