Asianet News TeluguAsianet News Telugu

ఒత్తిడిలో హీరో మోటో కార్ప్: హోండా పోటీని ఎదుర్కొనేందుకు స్టార్టప్

దేశీయ ద్విచక్ర వాహనాల మార్కెట్‌లో రారాజుగా వెలుగొందిన హీరోమోటో కార్ప్.

Hero MotoCorp creates startup for innovation

న్యూఢిల్లీ: దేశీయ ద్విచక్ర వాహనాల మార్కెట్‌లో రారాజుగా వెలుగొందిన హీరోమోటో కార్ప్. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో ఇతర సంస్థల నుంచి తీవ్ర ఒత్తిళ్లకు గురవుతోంది. ఈ నేపథ్యంలో సంస్థలో ఇన్నోవేషన్‌ను ప్రోత్సహించేందుకు ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేసింది. దీనికి కొనసాగింపుగా సంస్థలో పని చేసే సిబ్బందిలో వినూత్న ఆలోచనలను ప్రోత్సహించడానికి అంతర్గతంగా స్టార్టప్ విడుదల చేశామని హీరో మోటో కార్ప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పవన్ ముంజాల్ సంస్థ వాటాదారుల వార్షిక సమావేశంలో ప్రకటించారు. 

‘ఇన్నోవేషన్‌, నూతన టెక్నాలజీ మా విజన్‌కు రెండు మూల స్తంభాలు. ఇటీవలే ఇంక్యూబేషన్ సెంటర్ ప్రారంభించాం. ఇది మా సంస్థ పరిధిలో అమలులో ఉన్న పర్యావరణ అనుకూల వ్యవస్థలో సంస్థలోనూ, సంస్థ బయట పని చేసే మెంటర్ల నుంచి స్టార్టప్ మాదిరిగా పని చేస్తుంది. ‘హీరో హ్యాచ్’ అనే పేరుతో ఇంక్యుబేషన్ కేంద్రానికి పేరు పెట్టాం. సంస్థలో అంతర్గతంగా ఇన్నోవేషన్‍ను ప్రోత్సహించడానికి లక్ష్యంగా ఇంక్యుబేషన్ కేంద్రం పని చేస్తుంది’ అని ముంజాల్ చెప్పారు. 

హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకే హీరో మోటో కార్ప్ సంస్థ ఇన్నోవేటివ్ ఆలోచనల కోసం ఇంక్యుబేషన్ కేంద్రం ఏర్పాటు చేసింది. దేశంలోకెల్లా రెండో స్థానంలో ఉన్న హీరోమోటో కార్ప్ సంస్థకు ఒకనాడు హోండా జాయింట్ వెంచర్ పార్టనర్. ద్విచక్ర వాహనాల విభాగంలో దేశీయ మార్కెట్‌లో 36 శాతం వాటా కలిగి ఉన్న హీరో మోటార్స్ 2016 - 17తో పోలిస్తే 14 శాతం పెరిగి గత ఆర్థిక సంవత్సరం 2017 - 18లో 7.36 మిలియన్ల యూనిట్ల విక్రయాలు జరిగాయి. 

2016 - 17తో పోలిస్తే హీరో మోటార్స్ విక్రయాల కంటే హోండా విక్రయాలు 18 శాతం పెరిగి 5.77 మిలియన్ల యూనిట్లను విక్రయించింది. దేశీయ మార్కెట్‌లో 29 శాతం వాటా కలిగి ఉన్న హోండా మోటార్స్ సమీప భవిష్యత్‌లో భారత దేశ ద్విచక్ర వాహనాల విభాగంలో మొదటి స్థానంలో నిలువడమే లక్ష్యమని బహిరంగంగా ప్రకటించింది. 

వివిధ కార్పొరేట్ సంస్థలు తమ బిజినెస్‌ల పురోభివ్రుద్ధి కోసం స్టార్టప్‌లు ఏర్పాటు చేయడం కొత్తేమీ కాదు. నూతన బిజినెస్ ఐడియాల కోసం, ఇన్నోవేషన్ ఆలోచనల కోసం స్టార్టప్‌లను తొలుత ఆటోమొబైల్ రంగంలో టాటా మోటార్స్ ‘టామో’ పేరుతో స్టార్టప్‌ను ప్రారంభించింది. నూతన ఆలోచనలను ఆవిష్కరించడంతోపాటు టెక్నాలజీని స్వీకరించి టాటా సన్స్ గ్రూప్ సంస్థలకు అందజేయనున్నది. 

ప్రీమియం మోటార్ సైకిళ్ల విభాగంలో హోండా మోటార్స్ నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు.. స్కూటర్లకు గల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకున్నది హీరో మోటో కార్ప్. మోటార్ సైకిల్ విభాగంలో శరవేగంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నది హీరో మోటో కార్ప్. 

ఈ నేపథ్యంలోనే హీరో మోటో కార్ప్ రాజస్థాన్ రాజధాని జైపూర్ నగరంలో ఇంజినీర్ల కోసం ఆర్ అండ్ డీ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఈ ఆర్ అండ్ డీ సెంటర్‌లో మొబిలిటీ సొల్యూషన్స్, స్కూటర్లు, ఎలక్ట్రిక్ వాహనాల హయ్యర్ ఇంజిన్ సామర్థ్యాలపై ద్రుష్టి సారిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరులో పర్యావరణ హితమైన మోటార్ బైక్‌లు ఉత్పత్తి కానున్నాయని పవన్ ముంజాల్ చెప్పారు. వచ్చే డిసెంబర్ నాటికి చిత్తూరు యూనిట్‌లో ఉత్పత్తి ప్రారంభం అవుతుందని అన్నారు. అంతర్జాతీయంగా కొలంబియా, బంగ్లాదేశ్ ల్లో యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు పవన్ ముంజాల్ తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios