న్యూఢిల్లీ: విద్యుత్ వాహనాల కొనుగోలుదారులకు త్వరలో శుభవార్త అందనున్నట్లు సమాచారం. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఈ నెల 25వ తేదీన జరుగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో విద్యుత్‌తో నడిచే వాహనాలపై పన్ను తగ్గింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నదని ప్రభుత్వవర్గాలు తెలిపాయి. 

గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ) అమలులోకి వచ్చిన తర్వాత జరుగుతున్న 36వ సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఈ సమావేశంలో సౌర విద్యుత్ జనరేటింగ్ పరికరాలు, పవన విద్యుత్ టర్బైన్ ప్రాజెక్టులపై విధించే జీఎస్టీని ఎత్తివేసే అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తున్నది. 
గత జీఎస్టీ సమావేశంలో విద్యుత్ వాహనాలు, ఎలక్ట్రిక్ చార్జర్లు, అద్దెకు తీసుకునే విద్యుత్ వెహికల్స్‍పై జీఎస్టీ పన్ను విధించే దానిపై వచ్చే సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దేశీయంగా ఈవీల తయారీని ప్రోత్సహించడానికి ఈ వాహనాలపై విధించే జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని కౌన్సిల్‌కు కేంద్ర ప్రభుత్వం గతంలో సూచించింది. 

కానీ, దీనిపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సారథ్యంలోని జీఎస్టీ కౌన్సిల్ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అలాగే పెట్రోల్, డీజిల్ కార్లు, హైబ్రీడ్ వాహనాలపై మాత్రం 28 శాతం జీఎస్టీతోపాటు అదనంగా సెస్‌ను విధిస్తున్నది. కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహించనున్న జీఎస్టీ కౌన్సిల్ రెండో సమావేశం ఇది.

ఈ నెల 25వ తేదీన జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ప్రాథమికంగా విద్యుత్ వాహనాల కొనుగోలుపై జీఎస్టీని 12 నుంచి ఐదు శాతం, చార్జీలు 18 శాతం నుంచి ఐదు శాతానికి, అద్దె వాహనాలపై జీఎస్టీ 18 శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించాలని ప్రతిపాదించే అవకాశాలు ఉన్నాయి.

విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసిన వారికి రూ.1.5 లక్షల రుణం వడ్డీపై మినహాయింపునిస్తామని ఈ నెల ఐదో తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రతిపాదనల్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనివల్ల హ్యుండాయ్, మహీంద్రా, టాటా, బీఎండబ్ల్యూ, మారుతి సుజుకి తదితర మేటి కార్ల తయారీ సంస్థలు.. హీరో ఎలక్ట్రిక్, రివోల్ట్ ఇంటెలి కార్ప్, ఆథర్ ఎనర్జీ, కైనెటిక్ గ్రీన్, టార్క్ మోటార్స్, 22 కిమ్ కో, లాగ్ 9 మెటీరియల్స్ సంస్థలకు ప్రభుత్వం నుంచి ప్రయోజనం చేకూరుతుంది.