న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ ఇండియా 22,690 యూనిట్ల ఎస్‌యూవీ ఎండీవర్ కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రమాదం జరిగినప్పుడు ఎయిర్‌బ్యాగ్ ఇన్‌ఫ్లేటర్ సమస్య తలెత్తుతోంది. దీంతో అన్ని కార్లలో బ్యాటరీ మానిటరింగ్ సిస్టం (బీఎంఎస్)లో వైరింగ్ అమర్చడంలో తలెత్తిన సమస్యలను తనిఖీ చేయాలని నిర్ణయించింది. 

 

ఈ సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో ఫోర్డ్ ఇండియా వినియోగదారుల నుంచి కార్లను వెనక్కి పిలిపిస్తున్నది. వీటిలో ఫిబ్రవరి 2004 నుంచి సెప్టెంబర్ 2014 వరకు చెన్నై ప్లాంట్లో తయారైన కార్లు ఉన్నాయి. 

 

వీటితోపాటు 2017 సెప్టెంబర్ నుంచి 2019 ఏప్రిల్ వరకు గుజరాత్‌లోని సనంద్ ప్లాంట్‌లో తయారైన 30 వేల యూనిట్ల న్యూఫిగో, న్యూ అస్పైర్ రకాల కార్లలో బ్యాటరీ మానెటరింగ్ సిస్టమ్ (బీఎంఎస్) వైరింగ్‌లో పలు సమస్యలు ఉన్నట్లు గుర్తించినట్లు, వీటిని కూడా పరిశీలించనున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. 


వినియోగదారులు తమకు దగ్గర్లో ఉన్న షోరూంలో వీటిని ఉచితంగా సరి చేసుకోవచ్చునని సూచించింది. వినియోగదారులకు పూర్తిస్థాయి సేవలందించేందుకు వాహనాలు దీర్ఘకాలికంగా మన్నిక కలిగి ఉండేలా స్వచ్ఛందంగా తనిఖీలు చేపట్టినట్లు పేర్కొన్నది.