వాషింగ్టన్: ఎలాన్ మస్క్ అంటే ఎలక్ట్రిక్ కార్లకు బ్రాండ్ అంబాసిడార్. అందునా టెస్లా కార్ల కంపెనీ సీఈఓగా వ్యవహరిస్తున్నారు. కానీ ఏమరిపాటుగా ఆయన చేసిన ట్వీట్ వల్ల టెస్లా కార్ల సంస్థ రూ.లక్ష కోట్ల (14 బిలియన్ల డాలర్లు) మేరకు నష్టపోయింది. దీనివల్ల ఆయన తన సీఈఓ పదవిని కోల్పోతారని వార్తలు వస్తున్నాయి.

అమెరికా స్టాక్ మార్కెట్ లో టెస్లా మార్కెట్ విలువ అమాంతం పెరిగింది. దీనికి అనుసంధానంగా ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. టెస్లా కంపెనీ షేర్ల విలువ కాస్తంత ఎక్కువగానే ఉందని ఆయన ట్వీట్ చేయడంతో మార్కెట్లు ఒక్కసారిగా క్రాష్ అయ్యాయి. టెస్లా కార్ల షేర్ విలువ ఒక్కసారిగా పది శాతం పడిపోయింది. 

దీంతో టెస్లా కంపెనీ 14 బిలియన్ డాలర్లు నష్టపోయింది. అందులో ఎలాన్ మస్క్ మూడు బిలియన్ డాలర్లను నష్టాల్ని మూటగట్టుకున్నారు. ఈ ఏడాది ప్రథమార్థం నుంచి కంపెనీ మార్కెట్ విలువ క్రమంగా పెరుగుతుండటంతో ఆనందించాల్సిన మస్క్ ఈ విధంగా అనూహ్య ట్విట్ చేశారు.

ఇలా ట్వీట్ చేయడం ఎలాన్ మస్క్‌కు అలవాటే. అనవసర వ్యాఖ్యలు చేసే వ్యక్తిగా కూడా ఆయన నెటిజన్లకు సుపరిచితులే. అయితే ఓక్కోసారి ఈ వైఖరి కారణంగా ఆయన విమర్శల పాలవుతారు. 2018లో టెస్లా చైర్మన్‌గా ఉన్న ఎలాన్ ఒక్క ట్వీట్‌తో ఆ పదవిని కోల్పోయి సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. పబ్లిక్ లిమిటెడ్‌ సంస్థగా ఉన్న టెస్లాను పూర్తిగా సొంతం చేసుకునే ఆలోచనలో ఉన్నానని, అందుకు అవసరమైన నిధులు కూడా సమకూర్చుకున్నట్టు ఎలాన్ మస్క్ 2018 ఆగస్టు నెలలో  ట్వీట్ చేశారు.

దీంతో ఆయనపై టెస్లా షేర్ విలువ ఒక్కొక్కటి 420 డాలర్లు అవుతుందని చెప్పారు. ఆ ట్వీట్ల అనంతరం కంపెనీ షేర్ల విలువ అమాంతంగా పెరిగింది. కానీ ఆ తర్వాత మళ్లీ పడిపోయింది. ఆయన చేసిన ఆ ట్వీట్లు ఎస్‌ఈసీ తప్పుపట్టింది. ‘నిజానికి మస్క్ ఎటువంటి నిధులు సమకూర్చే సంస్థతోనూ.. ఒప్పందం ఖరారు చేసుకోవటం .. కంపెనీ ధర, విధివిధానాల వంటి కీలక అంశాలపై అసలు చర్చించనేలేదు’ అని పేర్కొంది.

విద్యుత్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ ట్రెండ్‌ నుంచి టెస్లా లాభపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి మార్కెట్ నిపుణులు ఎప్పటి నుంచో భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగానే టెస్లా షేర్ ధరలు ఇటీవల క్రమంగా పెరిగాయి. అయితే ఎలాన్ మస్క్ చేసిన అనూహ్య ట్వీట్‌తో ఈ పురోగమనానికి తాత్కాలిక బ్రేక్ పడింది.