ఇండియన్ మార్కెట్లోకి కొత్తగా ఓ ఎలక్ట్రికల్ సైకిల్ విడుదలైంది. ట్రాంక్స్ మోటార్స్  సంస్థ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన సరికొత్త ట్రాంక్స్ వన్ ఎలక్ట్రికల్ సైకిల్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే సైకిల్ అనగానే సామాన్య మద్యతరగతి ప్రజలకు ఉపయోగపడేలా ఉందనుకుంటే పొరబడినట్లే. దీని ధరను చూస్తే మాత్రం కళ్లు బైర్లుకమ్మడం ఖాయం. ఇది రూ.49,999 (ఎక్స్ షోరూం) కు మార్కెట్లో అందుబాటులో ఉంది.

అయితే ఇంత ధర  వెచ్చించినా వెంటనే ఈ సైకిల్ మన చేతిలోకి రాదు.  పరిమిత సంఖ్యలో మరియు ముందస్తు బుకింగ్ చేసుకున్న వారికి మాత్రమే ఈ  ట్రాంక్స్ వన్ ఎలక్ట్రిక్  సైకిల్ లభించనుంది. దీన్ని ప్రయోగాత్మకంగా తొమ్మిది పెద్ద నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంచారు. అవి హైదరాబాద్ తో పాటు ముంబై,పూణె, అహ్మదాబాద్, గోవా, చంఢీగర్, ఢిల్లీ, చెన్నై మరియు బెంగళూరు. 

ఈ ఎలక్ట్రికల్ సైకిల్ అత్యంత తక్కువ బరువుతో దృడమైన మెటీరియల్ తో రూపొందించారు. ఇందులో తేలికపాటి ఎలక్ట్రిక్ మోటార్ ను అమర్చారు. దీంతో దీన్ని ఒక్కసారి ఫుల్ గా చార్జ్ చేస్తే గరిస్టంగా 50 కిలోమీటర్లు నడుస్తుంది.  ఇందులోని ఎలక్ట్రికానిక్ గేర్ అసిస్ట్ మోడ్ ద్వారా ఈ పరిధిని 70 నుండి 85కిలోమీటర్లకు పెంచుకోవచ్చు. అలాగే గంటకు 25 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. 

సాంకేతికంగా కూడా ఈ ఎలక్ట్రికల్ సైకిల్ లో అద్బుతమైన ఫీచర్లు అందించారు. దీన్ని "టిబైక్"  అప్లికేషన్ ద్వారా స్మార్ట్ ఫోన్ కు అనుసంధానం చేసుకోవచ్చు. దీని ద్వారా ప్రయాణ దూరాన్ని, రైడింగ్ వల్ల కరిగిన కెలరీలను మన స్మార్ట్ ఫోన్ లో చూసుకోవచ్చు.