అడిషనల్ సేఫ్టీ ఫీచర్లతో డాట్సన్ ‘రెడీ గో’ 
న్యూఢిల్లీ: జపాన్ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ అనుబంధ డాట్సన్‌ బ్రాండ్ తన హ్యాచ్‌బ్యాక్‌ రెడీ గో మోడల్‌కు మరిన్ని భద్రతా ఫీచర్లను జోడించి విపణిలోకి విడుదల చేసింది. దీని ధర రూ.2.79 లక్షల నుంచి రూ.4.37 లక్షలు. 

ఎయిర్‌ బ్యాగ్‌, రియర్‌ పార్కింగ్‌ అసిస్ట్ సెన్సార్‌, హైస్పీడ్‌ వార్నింగ్‌, సీట్‌ బెల్ట్‌ రిమైండర్‌ తదితర ఫీచర్లను ఇందులో అదనంగా చేర్చారు. ఇటీవలే ఈ మోడల్‌లో ఎలక్ర్టానిక్‌ బ్రేక్‌ డిస్ర్టిబ్యూషన్‌తో కూడిన యాంటీలాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ (ఏబీఎస్)ను అందుబాటులోకి తెచ్చింది. 

కొత్త డాట్సన్‌ రెడీ గోలో అదనపు భద్రతా ఫీచర్లు, టెక్నాలజీ, స్టైల్‌, ఆధునిక సౌకర్యాలను జోడించామని, కస్టమర్లకు తామెంత ప్రాధాన్యం ఇస్తున్నామో దీని ద్వారా తెలుస్తుందని నిస్సాన్‌ ఇండియా సేల్స్‌, కమర్షియల్‌ డైరెక్టర్‌ హర్‌దీప్‌ బ్రార్‌ తెలిపారు. కొత్త రెడీ గో శ్రేణి 0.8 లీటర్‌, 1.0 లీటర్‌ త్రీ సిలిండర్‌ ఇంజన్‌తో అందుబాటులో ఉంటుంది. 

రూబీ రెడ్, లైమ్ గ్రీన్, వైట్, గ్రే, సిల్వర్ రంగుల్లో డాట్సన్ రెడీ గో లభిస్తుంది. అంతే కాదు ఫూర్తిగా ఫ్యూయల్ ఎఫిసియెంట్ ఇంజిన్‌గా 22.7 కిలోమీటర్ల నుంచి 22.5 కిలోమీటర్ల మైలైజీని అందిస్తుంది.