న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా బైక్స్ విక్రయాలు లేక ఆటోమొబైల్ షోరూమ్‌లు కళ తప్పాయి. మరోవైపు బీఎస్-4 వాహనాల విక్రయాలకు గడువు దగ్గర పడుతోంది. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో బైక్స్ కొనుగోళ్లపై భారీగా డీలర్‌షిప్‌లు డిస్కౌంట్లు అందిస్తున్నాయి.

ఆయా సంస్థల డీలర్లు ఇచ్చే డిస్కౌంట్లు ఆషామాషీగా లేవు. 11 నుంచి 15 శాతం రాయితీలపై బైక్స్, స్కూటర్లను డీలర్‌షిప్‌ల యజమానులు అమ్ముతున్నారు. గతేడాది అంటే 2019 ఫెస్టివల్ సీజన్‌లో డిస్కౌంట్లు, రాయితీల కంటే 4-8 శాతం ఎక్కువ అంటే అతిశయోక్తి కాదు. 

ద్విచక్ర వాహనాల మార్కెట్లో లీడర్‌గా ఉన్న హీరో మోటో కార్ప్స్ తన బెస్ట్ సెల్లింగ్ మోడల్ బైక్స్, స్కూటర్లపై రూ.5000 రాయితీని అందిస్తున్నది. అందునా హీరో స్ప్లెండర్, హెచ్ఎఫ్ డీలక్స్ మోడల్ బైకులపై ఈ రాయితీలు లభిస్తాయి. 

ఇక స్కూటర్లపై రూ.10 వేలు, ప్రీమియం బైకులపై అత్యధికంగా రూ.12,500 డిస్కౌంట్లు అందిస్తోంది. పుణె కేంద్రంగా బైక్స్, స్కూటర్లు ఉత్పత్తి చేస్తున్న బజాజ్ ఆటోమొబైల్ తన బీఎస్-4 మోడల్ వాహనాలపై రూ.5000 వరకు డిస్కౌంట్లు ఇస్తోంది. 

హోండా మోటారు సైకిల్స్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) కూడా తన కస్టమర్లకు రూ.23 వేల వరకు డిస్కౌంట్లు అందిస్తోంది. వీటిలో కొందరు డీలర్లు ఇచ్చే రూ.10 వేల రాయితీలు ఉన్నాయి. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులపై వాహనాలు కొనుగోలు చేస్తే క్యాష్ బ్యాక్ ఆఫర్ రూ.8000 అందిస్తోంది హోండా మోటార్స్ సైకిల్స్ అండ్ స్కూటర్స్. 

కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు 144 సెక్షన్ విధించాయి. భారీగా ప్రజలు గుమిగూడవద్దని హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో రిటైల్ విక్రయాలు పడిపోతాయని బైక్స్ డీలర్లు ఆందోళన చెందుతున్నారు. ఏప్రిల్ ఒకటో తేదీ లోగా బీఎస్-4 వాహన నిల్వలు క్లియర్ చేసుకోవడం కష్టమేనని వ్యాఖ్యానిస్తున్నారు. 

ఫెడరేషన్ ఆఫ్ ఆటోమోటివ్ డీలర్స్ అసోసియేషన్ (ఫాడా) అధ్యక్షుడు ఆశీష్ కాలే స్పందిస్తూ ‘ఇటువంటి అసాధారణ పరిస్థితుల్లో మంచి స్కీములు అందుబాటులో ఉంటే కస్టమర్లు కొనుగోలు చేస్తారు. కానీ ఇప్పుడు ప్రాధాన్యాలు డిఫరెంట్, అధిక విలువ గల వస్తువులను కొనుగోలు చేయడానికి వినియోగదారులు ముందుకు రావడం లేదు’ అని తెలిపారు. 

ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో బీఎస్-4 వాహనాల విక్రయానికి గడువు పెంచాలని ఫాడా ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై అత్యున్నత న్యాయస్థానం వచ్చేవారం విచారణ చేపట్టవచ్చునని భావిస్తున్నారు. 

also read:కరోనా ముప్పు: ఔషధ భద్రతే ప్రధానం.. రూ.14 వేల కోట్ల ప్యాకేజీ

ఇదిలా ఉంటే రెండు వారాలుగా హీరో మోటో కార్ప్ విక్రయాలు డబుల్ డిజిట్స్‌కు చేరాయి. నిర్దేశిత గడువు లోగా నిల్వ ఉన్న బైక్స్ అమ్ముడవుతాయని హీరో మోటో కార్ప్స్ ధీమాతో ఉంది.  

ఆటోమోటివ్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ (ఎఎస్డీసీ) చైర్మన్ నికుంజ్ సంఘీ ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘డీలర్ల వద్ద టూ వీలర్ల నిల్వలు గణనీయంగానే ఉన్నాయి. గతంతో పోలిస్తే డిస్కౌంట్లు భారీగా ఉన్నాయి. గతేడాది కంటే ఎక్కువ డిస్కౌంట్లను డీలర్లు అందజేస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావం పరిస్థితి విపత్కరంగా మార్చేసింది. ప్రభుత్వాల ఆంక్షలతో వినియోగదారులు బయటకు రావడం లేదు’ అని తెలిపారు.