బెంగళూరు: చైనాకు చెందిన ప్రముఖ మోటార్‌ సైకిల్స్‌ తయారీ సంస్థ సీఎఫ్‌ మోటో భారత్‌లో తన వాణిజ్య కార్యకలాపాలను శుక్రవారం అధికారికంగా ప్రారంభించింది. అంతే కాదు టీవీఎస్, హోండా బైక్స్‌కు కూడా సవాల్ విసురుతోంది. 

సీఎఫ్ మోటో సంస్థ తయారు చేసిన సీఎఫ్ మోటో 300ఎన్‌కే, 650ఎన్‌కే, 650ఎంటీ, 650జీటీ మోడల్స్‌ని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. వీటి ధర రూ.2.29 లక్షల నుంచి రూ.5.49 లక్షలుగా  ఉన్నట్లు సంస్థ ప్రకటించింది.

300ఎన్ కే మోటారు సైకిళ్లు ఇప్పటికే మార్కెట్‌లో కేటీఎం 390 డ్యూక్, హోండా సీబీ 300 ఆర్ బైక్‌లకు గట్టి పోటీ ఇవ్వనున్నాయి. ప్రత్యేకించి టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 మోడల్ మోటారు సైకిల్‌నూ సవాల్ చేయనున్నాయి. అయితే వాహనాల కొనుగోలుదారుల అభిరుచులు, ఆకాంక్షలు, ఆలోచనలు విభిన్నంగా ఉంటాయన్నది వేరే సంగతి. 

సీఎఫ్ మోటో బైకులన్నీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ కలిగి ఉంటాయి. అన్నింటికి 6-స్పీడ్ గేర్ బాక్స్ అమర్చారు. హోండా సీబీ 300 ఆర్ బైకులో 286 సీసీ ఇంజిన్ ఉంటే 300 ఎన్ కే బైక్ లో 373 సీసీ ఇంజిన్ అమర్చారు. అలాగే ఆయా మోటారు సైకిళ్ల ధరలు కూడా మార్కెట్‌ను నిర్దేశిస్తాయి. 

సీఎఫ్ మోటో బైక్స్ మోనో చోక్ కలిగి ఉంటాయి. 300 ఎన్ కే బైక్‌లో ట్యూబులర్ స్వింగ్రామ్ అందుబాటులో ఉంటే 390 డ్యూక్ అల్యూమినియం స్వింగ్రామ్ ఉంది. హోండా సీబీ 300ఆర్ బైక్ లో బాక్స్ సెలక్షన్ స్వింగ్రామ్ ఏర్పాటు చేశారు. అన్ని మోటారు సైకిళ్లు డిస్క్ బ్రేకులు, డ్యూయల్ చానెల్ ఏబీఎస్ కలిగి ఉంటాయి. 

సీఎఫ్ మోటో బైక్స్ సంస్థ భారత్‌లో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించేందుకు గానూ బెంగళూరుకు చెందిన ఏఎండబ్ల్యూ మోటార్‌సైకిల్స్‌లో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. సీఎఫ్‌మోటో చైనాలో తయారు చేసిన విడిభాగాలను ఏఎండబ్ల్యూ మోటార్‌సైకిల్స్‌ హైదరాబాద్‌లోని తన యూనిట్‌లో అసెంబుల్‌ చేసి విక్రయిస్తుంది. 
ఈ మేరకు భారత్‌లో సీఎఫ్‌మోటోకు చెందిన అమ్మకాలు, సేవలు పూర్తిగా ఏఎండబ్ల్యూ మోటార్‌సైకిల్స్‌ పర్యవేక్షించనుంది. త్వరలో హైదరాబాద్‌, బెంగళూరు, ముంబయి, పుణె, చెన్నై నగరాల్లో ప్రారంభించనున్న ఏఎండబ్ల్యూ మోటార్‌సైకిల్స్‌ డీలర్‌షిప్‌ స్టోర్స్‌ వద్ద ఈ నాలుగు మోడల్స్‌ అందుబాటులో ఉంటాయని సంస్థ వెల్లడించింది.

ఎంట్రీ లెవెల్‌ సీఎఫ్‌మోటో 300 ఎన్‌కే స్మార్ట్‌ ఫీచర్లతోపాటు కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చారు. 6-స్పీడ్‌ గేర్ బాక్స్‌, 292 సీసీ ఇంజిన్‌, 20.5 ఎన్‌ఎం టార్చ్‌, 33 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. మిగతా మూడు మోడల్స్‌ 650 ఎన్‌కే స్ట్రీట్‌ ఫైటర్‌, 650 ఎంటీ అడ్వెంచర్‌ టౌరర్, 650 జీటీ టౌరర్‌ వాహనాలు 649 సీసీ ట్విన్‌ సిలిండర్‌ ఇంజిన్‌, 6-స్పీడ్‌ గేర్‌ బాక్స్‌తో రూపొందించారు. 

650 ఎన్‌కే స్ట్రీట్‌ ఫైటర్ 56 ఎన్‌ఎం టార్క్‌ వద్ద 60 బీహెచ్‌పీ శక్తిని, 650 ఎంటీ అడ్వెంచర్‌ టౌరర్ 62 ఎన్‌ఎం టార్క్‌ వద్ద 69 బీహెచ్‌పీ శక్తిని,  650 జీటీ టౌరర్‌ వచ్చి 58.5 ఎన్‌ఎం టార్క్‌ వద్ద 60 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తాయి.