కరోనా ఎఫెక్ట్: బీఎండబ్ల్యూలో 6000 మందికి ఉద్వాసన!
కరోనా మహమ్మారి తెచ్చిన ఆర్థిక సంక్షోభం ధాటికి దిగ్గజ సంస్థలూ కుదేలు అవుతున్నాయి. ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ వార్షిక టర్నోవర్ తగ్గిన నేపథ్యంలో ఉద్యోగులను తగ్గించనున్నట్లు ప్రకటించింది. మొత్తంగా ఆరు వేల మంది ఉద్యోగులకు ముందస్తు పదవీ విరమణ ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది.
ఫ్రాంక్‌ఫర్ట్: కరోనా మహమ్మారి తెచ్చిన ఆర్థిక సంక్షోభం ధాటికి దిగ్గజ సంస్థలూ కుదేలు అవుతున్నాయి. ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ వార్షిక టర్నోవర్ తగ్గిన నేపథ్యంలో ఉద్యోగులను తగ్గించనున్నట్లు ప్రకటించింది. మొత్తంగా ఆరు వేల మంది ఉద్యోగులకు ముందస్తు పదవీ విరమణ ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది.
ఈ మేరకు బీఎండబ్ల్యూ ఓ ప్రకటన చేసింది. ‘ముందస్తు పదవీ విరమణ అంశమై ఇప్పటికే ఉద్యోగుల ప్రతినిధులతో చర్చలు ముగిశాయి. పదవీ విరమణకు దగ్గరలో ఉన్న వారికి ఇది వర్తింపజేసేందుకు ఒప్పందం కుదిరింది. యువ ఉద్యోగులు ఉన్నత విద్య అభ్యసించేందుకు అవసరమైన ఆర్థిక సాయం అందించి.. అనంతర కాలంలో ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇవ్వనున్నాం’ అని తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ మొత్తం ఉద్యోగుల్లో ముందస్తు పదవీ విరమణ చేయించాలనుకునేవారు 5 శాతంగా ఉన్నట్లు తెలిపింది సంస్థ. కరోనా మహమ్మారి కల్పించిన సంక్షోభం కారణంగా ఐరోపా, ఇతర దేశాల్లో కొత్త కార్లకు డిమాండ్ తగ్గటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీఎండబ్ల్యూ ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా బీఎండబ్ల్యూ సంస్థలో 1.26 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.
బీఎండబ్ల్యూ ఇండియా అధ్యక్షుడిగా విక్రం పవాహ్
బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా అధ్యక్షుడిగా విక్రం పవాహ్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన సంస్థ ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ సీఈఓగా సేవలు అందిస్తున్నారు. ఇంతకుముందు బీఎండబ్ల్యూ ఇండియా సీఈఓ కం అధ్యక్షుడిగా ఉన్న రుద్రతేజ్ సింగ్ అకస్మికంగా మరణించడంతో ఆయన స్థానంలో విక్రం పవాహ్ నియమితులయ్యారు. గత నెలలో రుద్రతేజ్ సింహ్ మరణించారు. అప్పటి నుంచి సంస్థ భారత విభాగం అధ్యక్షుడిగా బీఎండబ్ల్యూ సీఎఫ్ఓ అర్లిండో టైక్సైరియా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వచ్చే ఆగస్టు ఒకటో తేదీ నుంచి విక్రం పవాహ్ నియామకం అమలులోకి వస్తుంది.