Asianet News TeluguAsianet News Telugu

హ్యుండాయ్‌ నుంచి తొలిరోజే 200 కార్లు.. ఇవీ ఫైనాన్స్ స్కీమ్‌లు

కరోనా ‘లాక్‌డౌన్‌’ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం కొంతమేరకు సడలించడంతో దేశంలో వివిధ రకాల పరిశ్రమలు, వ్యాపార కార్యాలయాలు దశలవారీగా మళ్లీ తెరుచుకొంటున్నాయి. 

Back to basics: Hyundai rolls out 200 cars on Day 1 of production amid lockdown
Author
New Delhi, First Published May 10, 2020, 12:34 PM IST


న్యూఢిల్లీ: కరోనా ‘లాక్‌డౌన్‌’ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం కొంతమేరకు సడలించడంతో దేశంలో వివిధ రకాల పరిశ్రమలు, వ్యాపార కార్యాలయాలు దశలవారీగా మళ్లీ తెరుచుకొంటున్నాయి. చెన్నై సమీపంలోని తమ మాన్యుఫ్యాక్చరింగ్‌ ప్లాంట్‌లో ఉత్పత్తిని పునఃప్రారంభించిన తొలిరోజే 200 కార్లు బయటకు వచ్చాయని ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ హ్యుండాయ్‌ ఇండియా శనివారం వెల్లడించింది.

శ్రీపెరంబుదూర్‌ గల హ్యుండాయ్ మోటార్స్ ప్రొడక్షన్ ప్లాంట్‌లో ఈ నెల 8 నుంచి కార్ల తయారీ మొదలైంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 255 షోరూములను, వర్క్ షాపులను హ్యుండాయ్ తెరిచింది. మున్ముందు పలు టచ్ పాయింట్లను తిరిగి తెరవనున్నది. 

ఇదిలా ఉంటే, అన్ని రంగాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడిన ప్రస్తుత పరిస్థితుల్లో హ్యుండాయ్ మోటార్స్ తన కార్ల విక్రయం పెంచుకోవడానికి, కస్టమర్లను ఆకర్షించడానికి ఐదు ఆర్థిక పథకాలు అమలులోకి తీసుకొచ్చింది. 

ఇంతకుముందే ‘క్లిక్ టు డ్రైవ్’ పేరిట ఆన్ లైన్‌లో బుక్ చేసుకుంటే, ఇంటి వద్దకే డెలివరీ స్కీమ్ హ్యుండాయ్ అందుబాటులోకి తెచ్చింది. తాజాగా ఈఎంఐ అస్యూరెన్స్ స్కీమ్, షోరూములు, సర్వీసు కేంద్రాల వద్ద నూతన మార్గదర్శకాలను అమలులోకి తీసుకు వచ్చింది హ్యుండాయ్. వాటితోపాటు ఐదు నూతన ఆర్థిక పథకాలతో వినియోగదారులకు వెసులుబాటుకు కల్పించేందుకు పూనుకున్నది. 

తొలి మూడు నెలల పాటు తక్కువ ఈఎంఐ చెల్లింపుల విధానం తీసుకొచ్చింది. మిగతా మొత్తం చెల్లింపులు మూడు నుంచి ఐదేళ్లలో పూర్తి చేసేందుకు అందుబాటులోకి తెచ్చింది. ఇది హ్యుండాయ్ అన్ని మోడల్ కార్లకు వర్తిస్తుంది. 

స్టెప్ అప్ స్కీం పేరిట ప్రతిపాదించిన ఈ పథకంలో తొలి ఏడాది లక్షపై రూ.1234 వాయిదా మొత్తం ఏడేళ్లలో చెల్లించే ఏర్పాటు చేసింది. రెండో ఏడాది నుంచి ప్రతిఏటా 11 శాతం ఈఎంఐ చెల్లింపులు పెరుగుతాయి. ఈ స్కీం అన్ని హ్యుండాయ్ కార్లకు అమలు చేస్తారు. 

ప్రస్తుత పరిస్థితుల్లో తక్కువ ఖర్చు చేయాలని భావించే కస్టమర్లు తర్వాత ఎక్కువ మొత్తం చెల్లించడం కోసం డిజైన్ చేసిన స్కీం ‘బెలూన్ స్కీం’. దీని ప్రకారం సాధారణ ఈఎంఐ కంటే 14 శాతం తక్కువ ఈఎంఐని కస్టమర్ చెల్లిస్తే సరిపోతుంది. ఈ స్కీం 59 నెలల వరకు అమలులో ఉంటుంది. చివరి నెలలో మొత్తం రుణంలో 25 శాతం చెల్లించాలి.

లోన్ టెన్యూర్ ఎనిమిదేళ్ల వరకు పొడిగిస్తూ హ్యుండాయ్ నిర్ణయం తీసుకున్నది. ఈఎంఐ తక్కువ చేయడానికే ఈ పథకం అమలు చేస్తున్నది. తద్వారా వినియోగదారుడిపై రుణ చెల్లింపు భారం పడకుండా చూసేందుకు అమలులోకి తెచ్చిన ఈ స్కీం ఎంపిక చేసిన కార్లకు మాత్రమే వర్తిస్తుంది. 

కస్టమర్లు 100 శాతం ఆన్ రోడ్ ఫండింగ్ స్కీం ఎంచుకోోవచ్చు. దీనికి ఫైనాన్సర్లు రుణ పరపతి కల్పిస్తారు. ఈ పథకం కూడా ఎంపిక చేసిన హ్యుండాయ్ కార్లకు మాత్రమే వర్తిస్తుంది. అంటే జీరో డౌన్ పేమెంట్ కింద వినియోగదారుల ఇంటికి కారు వచ్చేస్తుందన్న మాట. 

ఇదేవిధంగా నోయిడాలోని తమ తయారీ కేంద్రంలో 20 శాతం సామర్థ్యంతో శనివారం నుంచి ఉత్పత్తిని పునఃప్రారంభించినట్టు దేశీయ మొబైల్‌ఫోన్ల తయారీ సంస్థ లావా వెల్లడించింది. మరోవైపు టాటా గ్రూపునకు చెందిన ఆభరణాల తయారీ సంస్థ తనిష్క్‌ ఆదివారం 50 స్టోర్లను తెరువనున్నట్టు ప్రకటించింది.

Follow Us:
Download App:
  • android
  • ios