Asianet News TeluguAsianet News Telugu

నో డౌట్: ఆటో రంగంలో 10 లక్షల కొలువులు గోవిందే!!

  • ఆటోమొబైల్ రంగాన్ని వెంటాడుతున్న మాంద్యం.. వాటితోపాటు ఆటో కాంపొనెంట్స్ సెక్టార్‌ను వెంటాడుతుందని ఆయా రంగాల పరిశ్రమలు ఆందోళన చెందుతున్నాయి. 
  • ఈ నేపథ్యంలో జీఎస్టీని 18 శాతానికి తగ్గించి విద్యుత్ వాహనాలపై స్పష్టతతో కూడిన పాలసీని ప్రకటించాలని కేంద్రాన్ని కోరుతున్నాయి.  
Auto component industry fears loss of 10 lakh jobs due to prolonged slowdown
Author
New Delhi, First Published Jul 25, 2019, 10:33 AM IST

న్యూఢిల్లీ: ఆటోమొబైల్ పరిశ్రమలో మందగమనం ఇలాగే కొనసాగితే భారీ స్థాయిలో సిబ్బంది తమ ఉద్యోగాలు పోయే ప్రమాదం కనిపిస్తోంది. మాంద్యం కొనసాగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో జీఎస్టీ తగ్గించాలని, తక్షణం ప్రభుత్వం జోక్యం చేసుకుని గిరాకీకి ఊతమివ్వాలని గట్టిగా కోరుతోంది.

ఆటో కాంపొనెంట్స్ ఇండస్ట్రీలో 50 లక్షల కొలువులు
కేవలం ఆటోమొబైల్ కాంపొనెంట్స్ పరిశ్రమ ఒక్కటే 50 లక్షల మంది వరకు ఉపాధి కల్పిస్తోంది. ప్రస్తుత పరిస్థితులిలాగే ఉంటే 10 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని భారత వాహన విడిభాగాల తయారీదార్ల సంఘం (ఏసీఎమ్‌ఏ) ఆందోళన చెందుతోంది. 

నెలల తరబడి తగ్గుతున్న సేల్స్  
ఆటోమొబైల్ పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులే ఉద్యోగాల కోతకు దారితీస్తున్నాయి. చాలా నెలలుగా వాహన విక్రయాలు తగ్గుతూ వస్తున్నాయి. ప్యాసింజర్ వెహికల్స్ నుంచి వాణిజ్య విభాగం వరకు అన్నింటిలోనూ గిరాకీలో మందగమనం కనిపిస్తోంది. బీఎస్‌-4 నుంచి బీఎస్‌-6 ఉద్గార ప్రమాణాలకు మారడానికి ఇటీవల భారీ పెట్టుబడులు సైతం పెట్టిన సంస్థలు  ధరలు పెంచాయి. అది కూడా గిరాకీ తగ్గడానికి కారణమైంది.

విద్యుత్ వాహనాలపై కొరవడిన స్పష్టత
ఇక విద్యుత్‌ వాహనాల(ఈవీ) విధానంపై స్పష్టత లేకపోవడంతో కంపెనీలు భవిష్యత్‌ పెట్టుబడులన్నిటినీ నిలిపివేస్తున్నాయి. ఇక విక్రయాలు తగ్గడంతో కంపెనీలు ఉత్పత్తి కోత దిశగా అడుగులు వేస్తున్నాయి. ప్రస్తుతం 15-20 శాతం వరకు వాహనాల ఉత్పత్తిని తగ్గించడంతో సంక్షోభం వంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇదే ధోరణి కొనసాగితే మాత్రం ఉద్యోగుల తొలగింపు తప్పదని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

10 లక్షల కుటుంబాలు రోడ్డు పాలు.
సాధారణంగా విడిభాగాల పరిశ్రమలో 70 శాతం వరకు సిబ్బంది కాంట్రాక్టు కింద పనిచేసేవారే. గిరాకీ భారీగా తగ్గితే ముందుగా ఆ సిబ్బందిపైనే ప్రభావం పడుతుంది. అదే జరిగితే 10 లక్షల కుటుంబాలు రోడ్డుమీదకు వస్తాయి.

మొత్తం 18 శాతం జీఎస్టీ శ్లాబ్ పరిధిలోకి తేవాలి. 
సమస్య మరింత జఠిలం కాకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని.. ఆటోమొబైల్, ఆటోమొబైల్ కాంపొనెంట్స్ రంగం మొత్తాన్ని 18% జీఎస్‌టీ శ్లాబ్‌లోకి తీసుకురావాలని పరిశ్రమ కోరుతోంది. ఇప్పటికే 70 శాతం వాహన విడిభాగాలు 18 శాతం శ్లాబు కింద ఉన్నాయి. మిగతా 30 శాతం మాత్రం 28 శాతం జీఎస్‌టీ శ్లాబులో ఉన్నాయి. ఇక వాహన రంగంలో 28 శాతం జీఎస్‌టీకి తోడు అదనపు సెస్సు(1-15%)కూడా తోడవడంతో తయారీదార్లపై భారం పడుతోంది. 

స్థిరమైన విద్యుత్ వాహనాల పాలసీ కావాలి
విద్యుత్‌ వాహనాలను తీసుకువచ్చే గడువు లక్ష్యంలో ఏవైనా మార్పులు తెస్తే అది కాస్తా దేశ దిగుమతి బిల్లు పెరిగేలా చేస్తుంది. ప్రస్తుత విడిభాగాల తయారీ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. అది కూడా ఉద్యోగాల కోత దిశగా ప్రభావం చూపుతుంది. కాబట్టి ఒక స్థిరమైన సాంకేతిక ఇ-మొబిలిటీ విధానాన్ని తేవాల్సిన అవసరం అయితే ఉందని పరిశ్రమ వాదిస్తోంది. 2023 కల్లా ద్విచక్ర వాహనాలు, 2025 కల్లా ద్విచక్ర వాహనాలను పూర్తిగా విద్యుత్‌ వాహనాలుగా మార్చాలని నీతి ఆయోగ్‌ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.

విద్యుత్ వెహికల్స్ పై స్పష్టతతో కూడిన పాలసీ కావాలి
పొడవు, ఇంజిన్ పరిమాణం, మోడల్ ఆధారంగా అదనంగా ఒక శాతం నుంచి 15 శాతం వరకు సెస్సు వేస్తున్నారని భారతీయ ఆటో కంపొనెంట్ తయారీదారుల సంఘం (ఏసీఎంఏ) అధ్యక్షుడు రామ్ వెంకట రమణి వివరించారు. ఈ క్రమంలో అన్నింటిపైనా పన్నును 18 శాతానికే పరిమితం చేయాలని కేంద్రానికి ఆయన విజ్ఞప్తి చేశారు. ఇక విద్యుత్ ఆధారిత వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఆ విధానంపై స్పష్టత ఇవ్వాలని కూడా రామ్ డిమాండ్ చేశారు.

పడిపోయిన వాహనాల ఉత్పత్తి
మార్కెట్‌లో అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో వాహన తయారీ సంస్థలు తమ ఉత్పత్తిని గణనీయంగా తగ్గించేస్తున్నాయి. మారుతి సుజుకీ, టాటా మోటార్స్, మహీంద్రా వంటి దేశీయ సంస్థలతోపాటు పలు విదేశీ సంస్థలూ వాహనాల తయారీకి విరామం ఇస్తున్నాయి. 15-20 శాతం వాహన ఉత్పత్తి దిగజారింది. ఇది ఆటో కంపోనెంట్స్ పరిశ్రమను పెద్ద ఎత్తునే ప్రభావితం చేస్తున్నది. వాహనాల్లో బిగించే ఆయా విడి భాగాలకు ఒక్కసారిగా డిమాండ్ తగ్గిపోయింది. 

కాంపొనెంట్స్ లోనూ ఉత్పత్తి తగ్గింపు
కార్లు, మోటారు సైకిళ్లతోపాటు విడి భాగాల ఉత్పత్తిని తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా ఆదాయం క్షీణించి, ఖర్చులను పెంచుతున్నదని, చివరకు ఉద్యోగుల తొలగింపునకు దారి తీస్తున్నదని భారతీయ ఆటో కంపొనెంట్ తయారీదారుల సంఘం (ఏసీఎంఏ) అధ్యక్షుడు రామ్ వెంకట రమణి చెప్పారు. ఈ సంక్షోభ పరిస్థితులు ఇలాగే కొనసాగితే పరిశ్రమలో దాదాపు 10 లక్షల ఉద్యోగాలకు దెబ్బేనన్నారు. కొన్ని సంస్థల్లో ఉద్యోగుల తొలగింపులు మొదలైయ్యాయని కూడా చెప్పారు.

కొత్త కొలువులతో బ్యాంకింగ్, ఐటీ రంగాలకు ‘కళ’
ఓ వైపు వాహన రంగంలో ఉద్యోగాల కోతలు కనిపిస్తుంటే.. ఐటీ, బ్యాంకింగ్‌, బీమా, బీపీఓ వంటి రంగాలు మాత్రం కొత్త ఉద్యోగాలతో కళకళలాడనున్నాయి. వచ్చే ఆరు నెలల్లో నియామకాలపై కంపెనీలు ఆశావహంగా ఉన్నట్లు నౌకరీ.కామ్‌ పేర్కొంటోంది. అయితే నిపుణుల కొరత మాత్రం కొనసాగుతుండడం ఆందోళనకరమని అంటోంది. ఈ సంస్థ నిర్వహించి సర్వే ప్రకారం.. వచ్చే ఆరు నెలల్లో నియమకాలు బాగుంటాయని 78 శాతం సంస్థలు అంచనా వేస్తున్నారు. గతేడాది ఇదే సమయంలో 70 శాతం మాత్రమే ఇలా భావించారు. 

ఐటీ నిపుణుల కొరతపై ఆందోళన
ఇక 16% మంది కేవలం సంస్థను వీడిన వారి స్థానాలను భర్తీ చేయడానికి మాత్రమే నియమాకాలు చేపడతామని అంటున్నారు. 5% మంది నియామకాలు ఉండవని.. 1 శాతం కోతలు ఉంటాయని అంచనా వేశారు. మొత్తం మీద ఉద్యోగ సృష్టి విషయంలో సానుకూలతలు కనిపిస్తున్నా.. సరైన నైపుణ్యాలున్నవారి లభ్యత విషయంలో ఆందోళనలు ఉంటున్నాయి. నైపుణ్యం ఉన్న వారి కొరత కొనసాగుతుందని 41 శాతం కంపెనీలు భావిస్తున్నాయి. 

ఐదేళ్లలోపు అనుభవం గల వారికి అవకాశాలు పుష్కలం
ఐటీ, బీపీఓ, బ్యాంకింగ్‌, ఆర్థిక, బీమా(బీఎఫ్‌ఎస్‌ఐ) రంగాల్లో కొత్త ఉద్యోగాలుంటాయని 80-85 శాతం మంది భావిస్తున్నారు. మూడు-అయిదేళ్ల అనుభవం ఉన్న వారికి ఎక్కువ అవకాశాలుంటాయని.. ఆ తర్వాత ఏడాది-మూడేళ్ల అనుభవం ఉన్న వారి వైపు కంపెనీలు చూడొచ్చని భావిస్తున్నారు. మొత్తం నియామకాల్లో 18% వృత్తినిపుణుల(ఎనిమిదేళ్లపైబడి అనుభవం)కే వాటా ఉంటుందని అంచనా.
 

Follow Us:
Download App:
  • android
  • ios