న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉండటంతో ఆటోమొబైల్ విడి భాగాల పరిశ్రమ రోజురోజుకు రూ.1000-1200 కోట్ల మేరకు నష్ట పోతున్నది. ఇది 21 రోజులు లాక్ డౌన్ అమలులో ఉండటం వల్ల ఆటో విడి భాగాల పరిశ్రమకు రమారమీ రూ.25,200 కోట్ల నష్టం వాటిల్లుతుందని తెలుస్తున్నది. 

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని ఆటకట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్ అమలులోకి తెచ్చింది. మూడు వారాల లాక్ డౌన్ అమలులోకి తేవడం వల్ల ఆటో విడి భాగాల పరిశ్రమలు ఉత్పత్తిని నిలిపివేశాయని ఆటోమోటివ్ కాంపొనెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఏసీఎంఏ) ఆందోళన వ్యక్తం చేసింది. 

ద్వితీయ శ్రేణి, త్రుతీయ శ్రేణి ఆటో కాంపొనెంట్స్ తయారీ సంస్థలు ఉత్పత్తి లేక తీవ్ర నగదు కొరత సమస్యనెదుర్కొంటున్నాయి. ఈ సమస్యలను ఇప్పటికిప్పుడు పరిష్కరించకపోతే పలు సంస్థలు దివాళా ప్రకటించే పరిస్థితి నెలకొంటుందని ఏసీఎంఏ పేర్కొన్నది. ప్రత్యేకించి ద్వితీయ శ్రేణి, త్రుతీయ శ్రేణి పరిశ్రమలు దివాళా తీస్తాయని తెలిపింది. 

ప్రభుత్వం వర్కింగ్ క్యాపిటల్ మద్దతు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఏసీఏంఎ కోరింది. అందుకు ఆర్థిక సంస్థల నుంచి రుణ పరపతి నిబంధనలను, చెల్లింపుల నిబంధనలను సరళతరం చేయాలని, తద్వారా పరిశ్రమను సంక్షోభం నుంచి బయటపడేసేందుకు చేయూతనివ్వాలని అభ్యర్థించింది. 

కనీసం మొండి బాకీ నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలని, ప్రిన్సిపల్ పేమెంట్స్, వడ్డీ చెల్లింపులపై కనీసం ఏడాది మారటోరియం విధించాలని ప్రభుత్వాన్ని ఏసీఎంఏ అభ్యర్థించింది. ఇంపోర్ట్ కార్గో క్లియరెన్స్‌పై లెవీ ఆఫ్ డీమరేజీ చార్జీలతోపాటు విద్యుత్ చార్జీల నిబంధనలను సరళతరం చేయాలని కోరింది. 

ప్రస్తుత అసాధారణ పరిస్థితుల్లో లాక్ డౌన్ వల్ల వాహనాల పరిశ్రమ పూర్తిగా ఉత్పత్తి నిలిచిపోయిందని, వర్కింగ్ కేపిటల్ కొరతకు దారి తీస్తుందని ఏసీఎంఏ అధ్యక్షుడు దీపక్ జైన్ ఆందోళన వ్యక్తం చేశారు. మున్ముందు వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని వ్యాఖ్యానించారు. 

సప్లయ్ చెయిన్‌లో అంతరాయం కలుగకుండా మద్దతు ఇవ్వాలని సియామ్ మద్దతు కోరామని ఏసీఎంఏ అధ్యక్షుడు దీపక్ జైన్ తెలిపారు. కరోనా మహమ్మారిపై పోరాటానికి ప్రభుత్వానికి ఆటో విడి భాగాల పరిశ్రమ అండగా నిలుస్తుందని చెప్పారు. 

also read:జుకర్ బర్గ్ పెద్ద మనస్సు: బిల్​ గేట్స్​ ట్రస్ట్​కు ఫేస్​బుక్​ 25 మిలియన్ల డాలర్ల విరాళం

ప్రస్తుతం ఆటో కాంపోనెంట్స్ స్థానంలో ఫేస్ మాస్కులు, హ్యాండ్ శానిటైజర్ల తయారీకి గల అవకాశాలపై టాస్క్ ఫోర్స్ ఏర్పాటుచేశామని దీపక్ జైన్ వెల్లడించారు. సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా  వెంటిలేటర్లు దిగుమతి చేయడానికి గల అవకాశాలను పరిశీలిస్తున్నామన్నారు.

వీటి నాణ్యత విషయంలో ప్రభుత్వం గైడెన్స్‌తో ముందుకు వెళుతుందని దీపక్ జైన్ వెల్లడించారు. ఇప్పటికే ఆటో కాంపొనెంట్స్ సంస్థలు లక్ష మందికి పైగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు మార్చి నెల వేతనం చెల్లించేశాయన్నారు.