న్యూఢిల్లీ: ప్రభుత్వ విధానాలు రవాణా రంగాన్ని తీవ్రంగా  దెబ్బ తీస్తున్నాయని, వ్యాపారం చేయడం కష్టతరంగా మారిందని ఆలిండియా ట్రాన్స్‌పోర్టర్స్‌ వెల్‌ఫేర్‌ అసోసియేషన్‌ (ఏఐటీడబ్ల్యూఏ), ఆలిండియా మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కాంగ్రెస్‌ (ఏఐఎంటీసీ) పేర్కొన్నాయి. 

 

అధిక వస్తు సేవల పన్ను (జీఎస్టీ) రేటు, డీజిల్‌పై రూ.2 సెస్, బీమా రుసుం మొత్తం పెరగడం, లాభాలు వస్తాయని అంచనా వేసి విధించే (ప్రిసప్టివ్‌) పన్ను పెంచడం వల్ల రవాణా సంస్థలపై పెనుభారం పడిందని స్పష్టం చేశాయి.

 

వ్యాపారం అసలేమీ బాగోనందున, ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త ట్రక్కుల కొనుగోళ్లకు దూరంగా ఉండాలని సభ్యులకు ఈ రెండు సంఘాలు సూచించాయి. ఇప్పటికే పలువురు ట్రక్కుల యజమానులు రుణ వాయిదాలు చెల్లించడంలో విఫలమయ్యాయని వివరించాయి. 

 

వాహన రవాణా లాభదాయక వ్యాపారం కాని పరిస్థితులు నెలకొన్నాయని ఏఐటీడబ్ల్యూఏ జాతీయ అధ్యక్షుడు మహేంద్ర ఆర్య అన్నారు. ఆగస్టు నుంచి ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు సహా పలు నగరాల్లో ప్రధాన రవాణా సంఘాలు కొత్త వాహనాలు కొనుగోలు చేయకూడదని నిర్ణయించినట్లు తెలిపారు. 

 

గత ఆరు నెలలుగా కొత్త వాహనాలు ఎవరూ కొనడం లేదని ఏఐఎంటీసీ కోర్‌ కమిటీ ఛైర్మన్‌ మల్కిత్‌ సింగ్‌ తెలిపారు. జీఎస్టీ రేటును 28 శాతం నుంచి వెంటనే 18 శాతానికి తగ్గించాలని డిమాండ్‌ చేశారు.

 

పలు పరిశ్రమలు తిరోగమనం వైపు మొగ్గుతున్నాయనీ, కొత్త వాహనాల కొనుగోళ్లు భారీగా తగ్గిపోయాయని ఏఐఎమ్టీసీ మాజీ అధ్యక్షుడు, కోర్‌కమిటీ చైర్మెన్‌ బాల్‌ మల్కిత్‌ సింగ్‌ తెలిపారు. తొలిసారి బడ్జెట్‌ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌.. పెట్రోల్‌పై రూ.2 సెస్‌, ఏడాదికి రూ. కోటికి పైగా నగదు విత్‌డ్రాయల్స్‌పై రెండు శాతం టీడీఎస్‌ విధించడం వంటి భారమైన నిర్ణయాలు తీసుకున్నారని మల్కిత్‌ సింగ్‌ మండిపడ్డారు.