డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

మనిషికి తెలియనితనం వల్ల మాత్రమే ప్రశ్న పుట్టదు. దానికి వచ్చే జవాబుతో ఎందరికో జ్ఞానోదయం కలుగుతుందనే ఉద్దేశంతోనూ ప్రశ్న పుడుతుంది. పుట్టిన ప్రతి ప్రశ్న వెనకా కచ్చితంగా ఒక నిజం ఉండి తీరుతుంది. ఆ నిజం వల్ల జీవనగమనం దిశ ఎటువైపు సాగాలనే నిర్ణయం తీసుకునే అవకాశం ఏర్పడుతుంది. ప్రశ్న చిన్నదే కావచ్చు దానికి వచ్చే సమాధానం మాత్రం విస్తృత జ్ఞాన సంపదకు ఆలవాలమైనదై ఉండవచ్చు. అలాంటి ప్రశ్న ఉంటే ఆ క్షణానికి జవాబు లేకపోయినా దానికోసం తప్పకుండా వెతుకులాట మొదలవుతుంది. వేదాలు, శాస్త్రాలు, ఇతిహాస - పురాణాల్లో ఆ ప్రశ్నలకు సరైన జవాబులు దొరుకుతాయి.

స్వయంభువులైన దేవతలు, జ్ఞానసంపద కలిగిన మహానుభావులు, తపశ్శక్తి సంపన్నులైన ఋషులు, మునులు, సర్వసంగ పరిత్యాగులు, సకల విషయాలూ తెలిసిన పండితులు వంటివారి ముఖతః లేఖినుల నుంచి వెలువడినవి అవి. కాబట్టి తిరుగులేనివి, నమ్మదగినవి అయి ఉంటాయి. ‘మరణం ఆసన్నమైనప్పుడు పురుషులు వినదగింది ఏది?’ అనేది భాగవతంలో శుక మహర్షిని పరీక్షిత్తు అడిగిన ప్రశ్న. పరీక్షిత్తుకు మరణం వచ్చే సమయం నిర్ణయమైపోయింది. దానికిగాను తీసుకోవలసిన చర్యగా ఏడురోజుల్లో భాగవతం వినాలనే విషయం తెలుసు. ఆ పనిమీదే ఉన్నాడు కూడా. అలాంటప్పుడు ఆయన ఆ ప్రశ్న అడగడంలో ఆంతర్యం ఏమిటి? ఈ ప్రశ్న వెనక ఉద్దేశం- ‘ప్రతివారికీ మరణం తప్పదు’ అని లోకానికి చెప్పడమే.

పరీక్షిత్తుకు తెలిసినట్లు ఇతరులకు మరణం వచ్చేది ఎప్పుడో తెలిసేది ఎలా? ఒకవేళ తెలిసినా అప్పటికప్పుడు పైనచెప్పిన విధంగా జాగ్రత్తలు తీసుకోవడం ఎలా సాధ్యమవుతుంది? వీటికి జవాబు లోకులకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే పరీక్షిత్తు ఆ ప్రశ్న అడిగాడు. అందులోనూ అంత కష్టకాలంలో. ఆ ప్రశ్నలకు శుక మహర్షి కచ్చితంగా నిర్మొహమాటంగా సమాధానం చెప్పాడు. దేహం విడిచే కాలం సమీపించినప్పుడు - భయాన్ని, అన్ని విషయాల పట్ల మమకారాన్ని తెంచుకోవాలి. ఎలాంటి ఆలోచన వచ్చినా చెదరని మనసు కలిగి ఉండాలి. ఏకాంత ప్రదేశంలో నిశ్చింతగా ఉండాలి. బ్రహ్మ ప్రతిపాదితమైన ఓంకారాన్ని మననం చేసుకోవాలి. ప్రాణాయామంతో మనసును నిగ్రహించుకుని భగవన్నామ స్మరణ చేసుకోవాలి అంటూ అనేక సూచనలు చేశాడు శుకమహర్షి.

వాటితోపాటు మరికొన్ని జాగ్రత్తలూ చెప్పాడు. ‘ఇంద్రియాలు, బుద్ధి, ఆలోచనలు, మనోమయ వ్యవహారాలు, జీవన గమన రీతులు లాంటివన్నీ ఒక పూర్ణ రూపంపై నిలిపి సదా దాన్నే మననం ( జపించడం ) చేయాలి. ఆ పూర్ణరూపును ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. చింతన చేస్తున్నప్పుడు అన్యవిషయ భాషణం, ఆలోచన, ప్రస్తావన వంటివేవీ దరి చేరనీయరాదు. అలా జరగాలంటే సాధన కావాలి. ఆ సాధన ఏ ఒక్క క్షణమో, ఒక్కసారో లేదా ఒక కోణంలోనో చేస్తే చాలదు. అది నిరంతరాయమైన ప్రక్రియ కావాలి. అప్పుడు పొందేది బ్రహ్మానంద స్థితి. ఆ స్థితి పొందినవారికి ఇతర విషయాలపట్ల ధ్యానం, ధ్యాస, ఆసక్తి లాంటివి ఉండవు’ అని వివరించాడు. వీటన్నింటి ఆంతర్యం సదా భగవధ్యానం చేస్తూండమని.

భాగవతం రాసింది విష్ణ్వంశ సంభూతుడైన వ్యాసుడు. అందులో ఎన్నో ప్రశ్నలు కనిపిస్తాయి. వాటికి సూటిగా కొన్ని, మార్మికంగా కొన్ని, అంతర్గత రూపంలో కొన్ని, లౌక్యంతో కూడినవి కొన్ని జవాబులూ దొరుకుతాయి. ప్రథమ స్కంధం నుంచి ద్వాదశ స్కంధం వరకు అనేక సందర్భాల్లో, అనేక రూపాలు కోణాల్లో, ఈ ప్రశ్నలు సంఘటనలు, కథలు, బోధనల రూపంలో అడుగడుగునా తారసపడతాయి. అందుకే భాగవతం ఒక కావ్యం కాదు, జ్ఞాన భాండాగారం. జ్ఞానోపార్జన కొరకు పురాణాలు, ఇతిహాసాలు చదవాలి, చదివించాలి.