వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ

నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

విఘ్నేశ్వరుడు, వినాయకుడు, గణపతి, లంబోదరుడు, అంటూ వేరు వేరు పేర్లతో ప్రత్యేకంగా పిలువబడుతున్న  గణాధిపతి మూర్తి అనేక కార్యక్రమాల ప్రారంభ సమయంలో ఆరాధించడం భారతీయ సంప్రదాయం. గణపతికి సంబంధించిన ప్రతిమలు భారతదేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా తూర్పు దేశాలలో అధికంగా కనిపిస్తున్నాయి. అసలు ఈ గణపతి లేదా వినాయకుడు శుభదైవమా? అశుభ దైవమా? అనేది కూడా ఆలోచనాత్మకమే.

మానవుడు తనకు ఆనందాన్ని కల్గించిన దేవతకు సంతోషంగాను, భయం కలిగించిన దైవాన్ని దానిని నుండి తనకు అభయాన్ని ప్రసాదించమనే కోరితో ప్రార్థించాడు. గణపతి విఘ్నకరుడు. విఘ్నాలను తొలగించడానికి తొలిపూజలు అందిచాల్సి ఉంటుంది. లేకుంటే విఘ్నాలు కలిగిస్తాడు. అందువల్ల ఇతను కొంత ఇబ్బందిని కలిగించే దైవంగానే భావించాలేమో?

గణపతి అధర్వశీర్షంలో అన్నియందు గణపతిని ఆరోపణ చేయడమంటే గణపతిలో అన్ని గుణాలున్నాయనే. ఇన్ని ఉంటేనే ఆకర్షించే శక్తి ఏర్పడుతుంది. శరీరానికి మూలంగా పీఠస్థానంలో, వెన్నుముక క్రింది భాగంలోని ప్రదేశంలో మూలాధారచక్రం ఉంటుంది. ఏది మౌలికమో ఏది లేకపోతే మిగిలినవాటి కి అస్తిత్త్వం  ఉండదో అదే మూలాధారం. దానిపై ఆధారపడి మాత్రమే మిగిలినవి ఉండాల్సి ఉంటుంది. ఈ మూలాధారానికి కూడా అధిపతి గణపతే. భూమికి ఉండే గురుత్వాకర్షణ శక్తికి కూడా ఆధారం గణపతే. అందుకే ఈ గణపతి లేకుంటే ఏమీ లేదు. అటువిం శక్తి మన శరీరంలోను భూమిలోను ఏర్పడి మనని రక్షించాలని, మనకు ప్రదేశాన్నిచ్చి కాపాడుతున్న గణపతిని దైవంగా, తొలిపూజలు గ్రహించే వానిగానూ పూజించాలని ధర్మశాస్త్రం నిర్దేశించింది.

జ్యోతిశ్శాస్త్రప్రకారం ఏ పండుగ అయినా జరుపుకోవాలన్నా ఆకాశంలోని నక్షత్రాల ఉదయాస్తమయాలు ఆధారం అవుతాయి. అంటే సూర్యోదయానికి ముందే సూర్యుడు ఉదయించే ప్రదేశంలో ఉదయించే నక్షత్రానికి ఆరోజు పూజచేయాలని నిర్ణయం ఉంది. దాని ప్రకారం భాద్రపద శుద్ధ చవితినాడు సూర్యోదయం కన్నా ముందు తూర్పు ఆకాశంలో వినాయక నక్షత్రాలు ఉదయిస్తాయి. అందువల్ల ఆరోజున వినాయక చతుర్థి జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. ఇది వినాయక  వ్రతం. వ్రతాలను దీక్షతో, నియమ నిష్ఠలతో చేస్తారు. మనం దీనిని పండుగగా జరుపుకుంటన్నాం. పండుగ జరుపుకునే సందర్భంలో ఇష్టమైన పదార్థాలు పిండివంటలు చేసుకుని తింరు. ఈరోజున చేసే పూజలోను, తీసుకునే ఆహారంలోను జాగ్రత్తలు ఉంటాయి .

21 రకాల పత్రులతో పూజిస్తారు. ఆ పత్రుల వాసన వల్ల, స్పర్శల వల్ల శారీరకమైన ఆరోగ్యం చేకూరుతుంది. అదేవిధంగా పిండివంటలు కూడా నూనె పదార్థాలు ఎక్కువగా స్వీకరించరు. ఉడకబెట్టిన  పిండిని ఉండ్రాళ్ళుగా కుడుములుగా మాత్రమే ఆహారంగా స్వీకరిస్తారు. దీనివల్లకూడా అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయి . మహారాష్ట్ర ప్రాంతం అటువైపు ఈ వినాయకవ్రతం రోజున పప్పును కూడా ఆహారంలో స్వీకరించక కేవలం కాయగూరలు మాత్రమే ఎక్కువగా తీసుకుంటారు. అంటే అన్ని రకాలుగా కూడా శరీరంలో, మనస్సులో అనారోగ్య సమస్యలు ఉండకూడదు. బలమైన శక్తి మాత్రమే ఉండాలి. ఆ చైతన్యమే అన్నిని ముందుకు నడిపిస్తుంది. చైతన్యం లేకపోతే ఏ పని చేయలేరు. కావున ఆ చైతన్య స్వరూపుడికి వందనమర్పిస్తూ.. మనందరికీ ఆ రకమైన చైతన్యాన్ని అందించమని వేడుకుందాం..

డా|| ఎస్‌. ప్రతిభ