Asianet News TeluguAsianet News Telugu

ఈ ఏకాదశినాడు ఏం చేయాలి..?

హిందువుల తొలి పండుగగా ప్రఖ్యాతి చెందిన తొలి ఏకాదశికి హైందవ సంస్కృతిలో విశేష స్థానమున్నది. 

special article on ekadasi
Author
Hyderabad, First Published Jul 12, 2019, 9:37 AM IST

హిందువుల తొలి పండుగగా ప్రఖ్యాతి చెందిన తొలి ఏకాదశికి హైందవ సంస్కృతిలో విశేష స్థానమున్నది. ఒక సంవత్సరంలో వచ్చే మొత్తం 24 ఏకాదశుల్లో ఆషాఢశుద్ధ ఏకాదిని తొలి ఏకాదశిగా పిలుస్తారు. దీనికే శయనైకాదశి అని, హరి వాసరమని, పేలాల పండుగ అని పేరు. పురాణాలను అనుసరించి శ్రీ మహావిష్ణువు  క్షీరసాగరంలో శేషతల్పంపై పడుకుంటాడు. అలా నాలుగు నెలలపాటు ఆయన పడుకుని అక్టోబర్‌ లేదా నవంబర్‌లో వచ్చే ప్రబోధినీ ఏకాదశినాడు తిరిగి నిద్రనుంచి మేల్కొంటాడు. 

ఈ నాలుగు నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు. ఈ రోజునుంచి నాలుగు నెలల పాటు చాతుర్మాస దీక్షను ఆచరిస్తారు.  ఉత్తరాయణం కంటే దక్షిణాయనంలో పండుగులు పర్వదినాలు ఎక్కువగావస్తాయి. వాతావరణంలో మార్పులు అధికంగా సంభవిస్తాయి కాబట్టి ఈ కాలంలో ఆరోగ్య రక్షణకోసం నియమాలు ఎక్కువగా పాటించాలని ఈ కాలంలో వ్రతాలు, ఉత్సవాలు, నోములు ఎక్కువగా పెట్టారు. 

ఏకాదశి తిథి : కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను, రుషులను హింసించడంతో శ్రీ మహావిష్ణువు అతనితో వెయ్యి సంవత్సరాలు పోరాడి అలసిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటాడు. శ్రీహరి శరీరం నుంచి ఓ కన్య ఉద్భవించింది. రాక్షసుణ్ణి అంతం చేసిందట. ఇందుకు సంతోషించి శ్రీహరి ఆమెను వరం కోరుకోమన్నాడట. ఆ కన్య తాను విష్ణుప్రియగా లోకంలో అందరిచేత పూజింపబడాలని కోరుకున్నదట. అప్పినుంచి ఆమె ఏకాదశి తిథిగా వ్యవహారంలోకి వచ్చింది. అప్పినుంచి సాధువులు, ఋషులు, మునులు అందరూ ఏకాదశి వ్రతం ఆచరించి విష్ణుసాయుజ్యం పొందారని ప్రతీతి.

ఈ ఏకాదశినాడు ఏం చేయాలి?
ఉపవాసం ఉండి, రాత్రి అంతా జాగరణ చేయాలి. రాత్రిపూట విష్ణుభజన, కీర్తనలు, భాగవతాది పురాణ వ్రచనం చదువుకోవాలి. విష్ణుసహస్రనామ పారాయణం చేయాలి. మర్నాడు ద్వాదశినాడు దేవాలయానికి వెళ్ళి ఉపవాస దీక్ష విరమించాలి.  ఏకాదశి ఆవులను పూజించాలి. విష్ణుమూర్తికి అత్యంత ఇష్టమైనరోజు కనుక ఈ రోజున గో పూజ చేయాలి. దాని వలన విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది.

పేలాల పిండి ఎందుకు తినాలి?
పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అందువల్ల మనకు జన్మనిచ్చిన పూర్వీకులను ఈ రోజు గుర్తు చేసుకోవడం మన బాధ్యత. అలాగే ఆరోగ్యపరంగా బయటి ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష రుతువు ప్రారంభమయ్యే కాలం కావున శరీరానికి పేలా పిండి వేడిని కలుగ జేస్తుంది. అందువల్ల ఈ రోజున దేవాలయాల్లోనూ, ఇళ్ళల్లోనూ పేలాల పిండిని ప్రసాదంగా పంచుతారు.

సంవత్సరం మొత్తంలో వచ్చే ఇరవైనాలుగు ఏకాదశు  లు ఉపవాసం ఉండడం లేకపోయినా ఈ చాతుర్మాస్యాల్లో వచ్చే ఎనిమిది ఏకాదశులైనా ఉపవాసం ఉండడం మంచిది. ఈ ఎనిమిది ఏకాదశులలో వంకాయ, కరుబూజ, రేగి మున్నగునవి తినకూడదని చెప్తారు.

ఈ రోజునుంచే చాతుర్మాస వ్రత దీక్ష ప్రారంభం అవుతుంది. వీరు ఈ నాలుగు మాసాల్లో ఒక్కో మాసాంలో ఒక్కో రకమైన వాటిని వదిలి పెడతారు. మొదటి నెలలో కూరలు, రెండవ నెలలు పెరుగూ, మూడవ నెలలో పాలు, నాల్గవ నెలలో ద్విదళ (రెండాకులుండే) వాటితో చేసే ఆకు కూరలను వదిలిపెట్టాలి. ఈ మొత్తం వ్రతం అయ్యే వరకు నిమ్మపళ్ళు, అలసందలు, ముల్లంగి, గుమ్మడికాయ, చెరుకుగడలు, తినకూడదని శాస్త్రం చెపుతుంది. అందరూ కనీసం ఈ ఒక్కరోజైనా ఉపవాసం చేసి ఎప్పుడూ భగవంతుని దగ్గరగా ఉండాలని ఆశిస్తూ....

---డా|| ఎస్‌. ప్రతిభ

Follow Us:
Download App:
  • android
  • ios