డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

"నక్షత్రాణి రూపం  - అశ్వినౌ వ్యాప్తం"
అహోరాత్రే  పార్శ్వే ,.. .. .. ( పురుష సూక్తం)

అన్న వేద మంత్రాలతో సూర్య చంద్ర గతుల వలన పూర్ణిమ, అమావాస్యలు ఏర్పడుతున్నాయి.

అమావాస్య రోజు సూర్యుడు, చంద్రుడు ఆకాశంలో ఒకే చోట సమీపంగా చేరినప్పుడు ( భూమి నుండి చూస్తే ) అమావాస్య ఏర్పడుతుంది. తర్వాత సూర్యుని నుండి చంద్రుడు ప్రతి దినం తూర్పువైపు కదులుతాడు. ఈ చంద్రగతి ఆధారంగా చంద్రామానం ఏర్పడుతుంది. సూర్యుని నుండి చంద్రుడు 12 డిగ్రీలు నడిస్తే ఒక తిధి అవుతుంది. ఇలాగ ఒక అమావాస్య నుండి ఇంకో అమావాస్య వరకు 29 రోజుల 44  నిమిషాల 2.87 సెకండ్ల కాలం జరుగునని వేద జ్యోతిషం తెలుపుతుంది. ఈ అమావాస్యకు పితృ దేవతలు అదిపతులుగా ఉంటారు. 

సోమవతీ అమావాస్య అంటే :-  సోమవారం నాడు వచ్చే అమావాస్యను సోమతి అమావాస్య అంటారు, ఈ  అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత వుంది. సోమవతీ అమావాస్య రోజున ఉపవాసం చేసి రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే జాతకంలో వుండే సకల దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. కోటి సూర్యగ్రహణములతో సమానమైనది అమావాస్య, సోమవతీ అమావాస్య రోజున శివారాధన చేసి రావిచెట్టుకు ప్రదక్షిణలు చేసి సోమవతీ కథను ఒకసారి గుర్తు చేసుకుని ఉపవాస దీక్షను తీసుకుంటే జాతక దోషాలు తొలగిపోతాయి.

సోమవతీ కథ:- ఒకానొక ఊరిలో ఓ సాధువు ఓ వ్యాపారి ఇంటికి వస్తూ వుండేవాడు. ఆయన ఒకనాడు వచ్చినప్పుడు ఆ ఇంట్లోని పెళ్లికాని ఓ కన్యను ముఖం చూసి దీవించకుండానే వెళ్లిపోయాడు. సాధువు దీవించకుండా వెళ్లడానికి కారణం తెలియక ఆ కుటుంబం జ్యోతిష్యుడిని సంప్రదిస్తుంది. ఈ క్రమంలో ఆ కన్య జాతకం చూసిన జ్యోతిష్యుడు ఈమెకు వివాహం జరిగితే భర్త అనతి కాలంలోనే మరణిస్తాడు. ఆమెకు వైధవ్యం ప్రాప్తిస్తుందని చెప్పాడు. అది విని దిగ్భ్రాంతి చెందిన కుటుంబీకులకు ఆ జ్యోతిష్యుడు పరిష్కారం కూడా చెప్తాడు.

సింఘాల్ ప్రాంతంలోని ఓ చాకలి స్త్రీ వద్ద కుంకుమ అడిగి నుదుటన ధరిస్తే కన్యకు దోషం పోతుందంటాడు. ఇదే తరహాలో చాకలి స్త్రీ వద్దకు చేరుకున్న ఆ కన్య సోమావతి అమావాస్య రోజున ఆమె వద్ద కుంకుమ పొందుతుంది. ఆపై రావిచెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేసింది. ఆమె జాతక దోషం కూడా అంతటితో తొలగిపోతుంది. అందుకే సోమావతి అమావాస్య రోజున శివాలయాల్లో వుండే రావిచెట్టు వెంట 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే జాతక దోషాలుండవు.

అంతేగాకుండా పితృదేవతలకు ఈ రోజున పిండప్రదానం చేయడం చేస్తే సంతృప్తి చెందుతారని, తద్వారా మనకు మంచి చేస్తారని విశ్వాసం. ఈ రోజు సోమవతీ అమావాస్య . ఈ రోజున వివాహితులు, అవివాహితులు రావిచెట్టును 108 సార్లు  ప్రదక్షిణలు చేయడం ద్వారా కోరుకున్న కోరికలు తీరతాయి.

చుక్కల అమావాస్య :- ఆషాఢమాసంలోని చివరి రోజైన అమావాస్యను చుక్కల అమావాస్య అంటారు, దీని గురించి ఆధునిక కాల యువతకు అంతగా తెలిసి ఉండదు. ఈ  రోజున పితృదేవతలను స్మరించుకున్నా, గౌరీవ్రతం చేసినా, దీపపూజ నిర్వహించినా గొప్ప ఫలితం దక్కుతుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. పంచాంగ ప్రకారం జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో, జులై మాసంలో వచ్చే కర్కాటక సంక్రాంతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలైతే, కర్కటక సంక్రాంతికి దక్షిణాయణం మొదలవుతుంది.

దక్షిణాయణ కాలంలో పితృ దేవతలు మనకు సమీపంలోనే ఉంటారని చెబుతారు. అందుకనే దక్షిణాయణంలో వచ్చే తొలి అమావాస్య రోజున వారికి ఆహ్వానం పలుకుతూ తర్పణాలను విడిస్తే మంచిదని సూచిస్తారు. అదే చుక్కల అమావాస్య. ఇక ఆషాఢమాసంలో చేసే జపతపాలకు, దానధర్మాలకు విశేషమైన ఫలితం లభిస్తుందని కూడా పెద్దల మాట. కాబట్టి ఈ రోజున పెద్దలని తల్చుకుంటూ పితృకర్మలు నిర్వహించి వారి పేరున పేదలకు దానధర్మాలు చేసినా పెద్దల ఆత్మశాంతిస్తుంది. 
 
ఆషాఢ అమావాస్య రోజున గౌరీ పూజ చేయడం కూడా మంచిది. ఆషాఢ అమావాస్య మరుసటి రోజు నుండి శ్రావణమాసం మొదలవుతుంది. శ్రావణ మాసం అంటే పెళ్లిళ్ళు, అనేక శుభకార్యా ముహూర్తాలు మొదలయ్యే కాలం. కాబట్టి ఈ శ్రావణంలో అవివాహితులు మంచి పెళ్లి సంబంధం కుదరాలని కోరుకుంటూ మాసానికి ముందు రోజున కన్నెపిల్లలు గౌరీ దేవిని పూజిస్తారు. పసుపు ముద్దని గౌరీదేవిగా భావించి కొలుచుకుంటారు. బియ్యపు పిండితో చేసిన కుడుములను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ రోజు గౌరీపూజ చేసుకుని అమ్మవారి  రక్షా కంకణాన్ని ధరించిన అవివాహితులు తమకు త్వరలోనే వివాహం జరుగుతుందని విశ్వాసం పొందుతారు.
 
ఈ అమావాస్య రోజున అవివాహితలే కాదు కొత్త కోడళ్లు కూడా ‘చుక్కల అమావాస్య’ పేరుతో ఒక నోముని నోచుకుంటారు. గౌరీపూజని చేసి సాయం సంధ్య వేళ వరకు నిష్టగా ఉపవాసాన్ని ఆచరిస్తారు. అమ్మవారి ముందు వంద చుక్కలు పెట్టి వాటి మీద వంద దారపు పోగులను పెడతారు. ఆ దారపు పోగులను ఒక దండగా అల్లుకుని మర్నాటి వరకూ ధరిస్తారు. స్తోమత ఉన్నవారు నోము సందర్భంగా బంగారపు చుక్కలను కూడా పూర్వకాలంలో దానం చేసేవారట. దక్షిణాయనం ఖగోళానికి సంబంధించిన పండుగ కాబట్టి ఆకాశంలో చుక్కలను సూచిస్తూ ఈ నోము ఆచారంగా మొదలై ఉండవచ్చును. తమ మాంగళ్యం కలకాలం క్షేమంగా ఉండాలన్నదే ముత్తయిదువుల కోరిక. 
 
అషాఢమాసంతో సూర్యుడు దక్షిణాయనానికి మరలుతాడు. రాత్రివేళలు పెరుగుతాయి, చలి మొదలవుతుంది. చలి, చీకటి అనేవి అజ్ఞానానికి, బద్ధకానికీ, అనారోగ్యానికీ చిహ్నాలు. వాటిని పారద్రోలి వెలుగుని, వేడిని ఇచ్చేవి దీపాలు. అందుకు సూచనగా దీపపూజని చేస్తారు. ఇందుకోసం పీటలు లేదా చెక్కపలకలని శుభ్రంగా అలికి, వాటి మీద ముగ్గులు వేస్తారు. ఆ పలకల మీద ఇంట్లో ఉన్న దీపస్తంభాలు లేదా కుందులను పెడతారు. ఆ దీపాలకు పసుపు, కుంకుమలతో అలంకరించి వెలిగిస్తారు. మనం చుక్కల అమావాస్య పరమార్ధం ఏమిటో మన పూర్వీకులు దీనిని ఎందుకు ఆచరించారో తెలుసుకున్నాం కనుక మన సనాతన సాంప్రదాయ పద్దతులను గౌరవిస్తూ ఆచరిద్దాం.