Asianet News TeluguAsianet News Telugu

సూర్యగ్రహణం... ఈ రాశులవారికి శుభ ఫలితాలు

గ్రహణ సమయంలో ఇంట్లో నిల్వ పెట్టుకునే  తినే ఆహార పదార్ధాల మీద దర్భలు వేసుకోవడం మన భారతీయ సంస్కృతి, సాంప్రదాయం. గ్రహణ ఆరంభంలో స్నానం చేసి మీ యిష్ట దైవాన్ని స్మరిస్తూ గ్రహణ సమయంలో దైవ నామ స్మరణ చేసి, గ్రహణానంతరం ఇల్లు శుభ్రం చేసుకుని స్నానం చేసి పూజా మందిరము శుద్ధి చేసుకోవలెను.

Solar Eclipse June 2020 effects on Horoscope: Surya Grahan will negatively  and positively affect these zodiac signs
Author
Hyderabad, First Published Jun 20, 2020, 7:38 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

Solar Eclipse June 2020 effects on Horoscope: Surya Grahan will negatively  and positively affect these zodiac signs

సనాతన శాస్త్రీయ సాంప్రదాయలకు పుట్టినిల్లు మన దేశం. గ్రహణం అంటేనే ప్రకృతిలో మార్పు ఏర్పడుతుంది. ఖగోళం, భూగోళం మధ్య ఆకర్షణలతో భూమిలో, సముద్రంలో మార్పు ఏర్పడుతున్నది అనే విషయాన్ని అనాది కాలం నుండే గమనిస్తూనే ఉన్నాం. ఈ ప్రకృతిలో అనేక జీవజాలాలు జీవిస్తున్నాయి. అన్నింటి కంటే భిన్నంగా మానవుడు జీవిస్తున్నడు. ప్రకృతికి అనుగుణంగా వ్యవహరించడం లేదు. జీవనశైలిలో గాని ఆహార విషయంలో గాని ఇతర జీవులతో పోల్చుకుంటే చాలా వ్యత్యాసమే కనబడుతుంది. మిగితా జీవులు పకృతిలో దొరికిన ఆహార పదార్ధాలను సహజంగానే తిని జీవిస్తున్నాయి. 

కాని మానవుడు తన జిహ్వాచాపల్యం కొరకు తినే పదార్ధాలను మార్పు చేసుకుని తింటున్నాడు. మానవుని మనుగడకు అనుగుణంగా శాస్త్రం కొన్ని సూచనలు చేసింది. గ్రహణం తర్వాత ప్రకృతిలోని భూ, జల సంబంధమైన మార్పులు అనేవి వెంటనే చూపక పోయినప్పటికి  కొంత కాలానికైనా తప్పక ప్రభావ ఫలితాలు చూపిస్తాయి. వాటికి పరిహారంగా తమ తపోశక్తిని ధారపోసి అనుభవపూర్వకంగా పరిశోధనలు చేసిన మన ఋషులు మనకు సూచనలు చేసారు. భూమిపై ప్రభావం పడ్డట్టుగానే మనిషికి కూడ నక్షత్ర, రాశి ఆధారంగా ప్రభావం చూపెడుతుంది. అమావాస్య, పున్నమి రోజులలో సముద్ర అలలలో మార్పు ఆటుపోట్లు ఎలా చోటు చేసుకుంటున్నది అనేది మనకు సాక్షాత్కారంగా కనబడుతూనే ఉంది.  

21 జూన్ 2020 శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మఋతువు, జ్యేష్ఠ అమావాస్య, ఆదివారం, మృగశిర, ఆరుద్ర నక్షత్రాలు, మిధునరాశి, సింహ, కన్య, తులా లగ్నాల యందు గ్రహణం ఏర్పడుతుంది. హైదరాబాదు ప్రాంత సమయానికి  ఉదయం 10:15 నుండి మధ్యాహ్నం 1: 44 వరకు ఉంటుంది. ప్రాంతాల వారిగా సమయంలో వ్యత్యాసాలు ఉంటాయి. మొత్తం మూడున్నర గంటల పాటు గ్రహణం ఉంటుంది, ఈ గ్రహణం రాహుగ్రస్త చూడామణి నామ సూర్య గ్రహణం ఏర్పడనున్నది. 

సూర్యోదయం నుండి గ్రహణం పూర్తి అయ్యే వరకు ఉపాసకులు, మంత్రోపదేశం ఉన్నవారు, జపాలు చేసే వారికి మాత్రమే భోజనాదులు నిషేదం. శక్తి లేనివారు, వృద్ధులు, పిల్లలు, గర్భిణిలు , ఆనారోగ్యంతో ఉన్నవారికి ఈ నియమం వర్తించదు. శారీరక శక్తి లేనివారికి వర్తించదు. ఆబ్ధికములు గ్రహణం ముగిసిన తర్వతనే చేసుకోవాలని శాస్త్రంలో చెప్పబడినది. గర్భిణి స్త్రీలు, వృద్ధులు, పిల్లలు, ఆనారోగ్యంతో ఉన్నవారు, బిపి, షుగర్ మొదలగు పేషంట్లు ఉదయం 8 గంటలలోపు ఏదైనా తెలికైనా ఆహారం తీసుకోవాలి. గ్రహణం పూర్తీ అయిన తర్వాత ఇల్లు శుభ్రం చేసుకుని స్నానం చేసి కొత్తగా వంట చేసుకుని తినాలి. 

దేవాలయాలు సూర్యోదయ కాలంలో ప్రాతఃకాల పూజలుచేసి మూసివేస్తారు. గ్రహణానంతరం దేవాలయ సంప్రోక్షణ చేసి సూర్యాస్తమానంతరం భక్తులకు దర్శనార్థం తెరుస్తారు. మిథునరాశి, కర్కాటకరాశి వారు, గోచర గ్రహస్థితి అనుకూలంగా లేని రాశుల వారు దోష నివారణ శాంతి చేయించుకోవలెను. ప్రధానంగా మృగశిర, ఆరుద్ర నక్షత్రము వారు. మిగిలిన నక్షత్రముల వారు మీ మీ  రాశుల మొక్క గ్రహణ ప్రభావ ఫలితాల గురించి మీ జ్యోతిష గురువును సంప్రదించి వారికి దక్షిణ తాంభూలాదులు సమర్పించి వివరాలు తెలుసుకుని పాటించగలరు. ఎవరికీ రుణ గ్రస్తులు కాకండి. 

గ్రహణ సమయంలో ఇంట్లో నిల్వ పెట్టుకునే  తినే ఆహార పదార్ధాల మీద దర్భలు వేసుకోవడం మన భారతీయ సంస్కృతి, సాంప్రదాయం. గ్రహణ ఆరంభంలో స్నానం చేసి మీ యిష్ట దైవాన్ని స్మరిస్తూ గ్రహణ సమయంలో దైవ నామ స్మరణ చేసి, గ్రహణానంతరం ఇల్లు శుభ్రం చేసుకుని స్నానం చేసి పూజా మందిరము శుద్ధి చేసుకోవలెను.

గ్రహణ దానం, పరిహార మార్గాలు:- జపాలు చేయించుకునే ఆర్ధిక స్థోమత లేనివారు మాత్రం గోధుమలు, మినుములు, బియ్యం, బెల్లాన్ని  ఒక్కొక్కటి కిలోపావు చొప్పున తీసుకుని వాటిని ఆరటి లేదా మోదుగ విస్తరి ఆకులో పెట్టి అందులో రెండు తమలపాకులు, రెండు అరటి పండ్లు, రెండు ఎండు ఖర్జర పండ్లు, రెండు వక్కలు. కొంచెం గరిక వేసి గ్రహణానికి ముందు దేవుని గదిలో పెట్టి గ్రహణ పట్టు స్థానం చేసి మీకున్న ఉపదేశ మంత్రం కాని, విష్ణు సహస్ర నామం కాని, నవగ్రహ మంత్రం గాని లేదా మీకు నచ్చిన దేవుని మంత్రంతో జపం చేసుకుని గ్రహాణం విడిచిన తర్వాత పట్టు విడుపు స్నానం చేసి ఈ ధాన్యాన్ని భగవంతునికి అర్పితం చేసినట్లు భావించి సమస్త గ్రహ దోష నివారణ చేయమని నమస్కరించి ఆ ధాన్యం ఆవునకు తినిపించాలి, మీరు పెట్టిన దాన తింటున్నప్పుడు తప్పక గోమాతకు మూడు ప్రదక్షిణలు చేయాలి. లేదా ప్రవహించే నీళ్ళలో కానీ చెరువులో గాని వదిలివేయవచ్చును. 

దాన సంకల్పం :- మమ జన్మరాశి జన్మ నక్షత్రవశాద్యరిష్ట స్థాన స్థిత గ్రహణ సూచిత సర్వారిష్ట ప్రశాంతి పూర్వక ఏకాదశ స్థాన స్థిత గ్రహణ సూచిత శుభ ఫల ప్రాప్త్యర్థం గ్రహణ దోష నివారణార్ధం గో గ్రాసం తండులాన్ సహిత అనేక ద్రవ్యాని ఇష్టపూర్వక గూఢా దానం కరిష్యే”

దాత చదవవలసిన శ్లోకం :- తమో మయ మహాభీమ సోమ సూర్య విమర్దన హేమతారాప్రదానేన మమ శాంతి ప్రదోభవ విధుంతుద నమస్తుభ్యం సింహికా నందనాచ్యుత దానేన నాగస్య రక్షమాం వేధజాద్భయాత్.... ఎటువంటి దానం ఎప్పుడు ఇచ్చిననూ దానంతో పాటుగా గోమాతకు మూడు ప్రదక్షిణలు చేసి నమస్కారములు చేసుకుంటే శుభం కలుగుతుంది. గ్రహజపం వంటివి చేయించినా సరే గో మాతకు గ్రాస దానం తప్పక ఇవ్వండి.

గ్రహణశాంతి అనేది మహర్షులు గ్రంథస్థంగా చెప్పిన అంశము. దీనికి వైదీకాచారము జోడించి పెద్దలు చెప్పే విషయాలను మనం ఇక్కడ ప్రస్తావన చేసాము. సూర్య, చంద్రులను మనం ప్రత్యక్ష దైవాలుగా భావన చేసి నిత్యం దైవ సంబంధ కార్యములు చేస్తూ ఉంటాము. వారిరువురిలో ఏ ఒక్కరైనా ప్రత్యక్షంలో లేరు అంటే గ్రహణంగా భావన చేసి శాంతి పూజ చేయుట హిందు మతాచారము. ప్రతి అమావాస్య వెళ్ళిన మరుసటి రోజున, గ్రహణం మరుసటి రోజున, జాతాశౌచ, మృతాశౌచములకు మరుసటి రోజున దేవతా మందిరం అంతా కూడా శుభ్రం చేసి మరలా విగ్రహాలను కడిగి శుద్ధి చేసి దేవతా మందిరములో పెట్టి అర్చన చేయడం మన సనాతన సంప్రదాయంగా వస్తున్నది.  

ముఖ్య సమాచారం :- ఏ దోష నివారనకైన దాన ధర్మాలు చేసే విషయంలో గమనించ వలసిన విషయం ఏమనగా అభాగ్యులై ఆకలితో ఉన్న వారికి , అనారోగ్యం ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు వస్తు, ద్రవ్య, ధన రూపేణా దానం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. పశు, పక్ష్యాదులకు గ్రాసం ఇవ్వండి శుభం కలుగుతుంది. అన్ని విధములుగా శరీర సౌష్టవం ఉండి సంపాదించుకునే శక్తి  ఉన్న వారికి ముఖ్యంగా తెలిసిన వారికి దానం చేయడం వలన ఫలితం ఎంత మాత్రం లభించదు. 

ఆకలితో ఉన్న అన్నార్ధులకు దానం చేస్తే సాక్షాత్తు దైవాన్ని ఇంటికి పిలిచే మృష్టాన్న భోజనం పెట్టిన పుణ్యఫలం దక్కుతుంది, అందుకే వారిని దారిద్ర నారాయణులు అన్నారు,  దైవం వారి రూపంలో వచ్చి మీరిచ్చే దానాలు స్వీకరించి అభిష్ట ఫలసిద్ధిగావిస్తాడు. ఈ సూక్ష్మ శాస్త్ర సూత్రాన్ని గ్రహించి వ్యవహరించండి. ఇక దైవనామాన్ని చదవాల్సిన మంత్రం కుడా కఠినంగా ఉన్న శ్లోకాలు చదవాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు మీరు సులభంగా పలక గలిగే విధమైన పదాలు ఓం నమో నారాయణ అనండి, లేదా ఓం నమశ్శివాయ అని లేదా  మీకు నచ్చిన ఇష్టదైవం పేరు పలకండి చాలు ఫలితం దక్కుతుంది. 

చిత్తశుద్ధితో  ఏ పేరుతో పిలిచినా దైవం అంగీకరిస్తాడు, మంత్రమే  ప్రధానం కాదు అన్న పరమాత్మ సత్యాన్ని గ్రహించండి. ఇందులో ఎలాంటి సందేహం వద్దు. లేనిపోని మూఢ నమ్మకాలతో , అజ్ఞానంతో  ,అమాయకత్వంతో ఉండకూడదు. దేవుడు అనేవాడు రక్షకుడే కాని శిక్షకుడు కాదు. అందరిలో అన్ని చోట్ల ఉన్నాడు కాబట్టె దేవుడు అంటున్నాం. మన కర్మ ఫలితాన్ని బట్టి శుభాశుభ ఫలితాలు ఏర్పడతాయి.    
  
* శుభ ఫలితాలను పొందే రాశులు :-  జన్మరాశి నుండి  3, 6,10,11 రాశులు - 
   మేష (Aries) , మకర ( Capricorn) ,  కన్య ( Virgo), సింహరాశి (Leo) 

* మధ్యమ ఫలితాలను పొందే రాశులు :- జన్మరాశి నుండి 2, 5, 7, 9 రాశులు -
   వృషభ ( Taurus) , కుంభ ( Aquarius) , ధనుస్సు ( Sagittarius) , తులారాశి ( Libra)

* అశుభ ఫలితాలను పొందే రాశులు :- జన్మరాశి నుండి 1, 4, 8, 12 రాశులు - 
   మిధున ( Gemini) , మీన ( Pices), వృశ్చిక ( Scorpio) , కర్కాటక రాశి ( Cancer)

గమనిక :- ద్వాదశ రాశుల వారికి వ్యక్తీ గత జాతక ఆధారంగా పై ఫలితాలలో హెచ్చు తగ్గు ఫలితాలలో మార్పులు చోటుచేసుకుంటాయి. అనుభవజ్ఞులైన జ్యోతిష పండితుడిని సంప్రదించి మీ జాతక గోచార గ్రహ స్థితిని పరిశీలింపజేసుకుని వారిచ్చే సూచనలతో తగు పరిహార శాంతులు, రేమిడి పద్దతులు దోష నివారణా మార్గాలను తెలుసుకుని ఆచరించి ప్రశాంతమైన జీవితాన్ని గడపండి. శాస్త్రం అనేది నిఖచ్చిగా, కర్కశంగానే తెలియజేస్తుంది. పాటించడం, పాటించ పోవడం అనేది ఎవరి వ్యక్తీ గత అభిప్రాయంపై వారికి ఆయా ఫలితాలు ఆధారపడి ఉంటాయి.

శాస్త్రం అంటే పూర్వీకులైన ఋషుల యొక్క సాధనతో కూడిన అనుభవ ఫలితాలను తెలియజేస్తుంది. వాటిని అనుసరించే వారికి ఫలితాలు చీకటిలో దీపం వెలుగు వలే  దిశా నిర్దేశానికి ఉపయోగపడుతుంది. సన్మార్గ దిశవైపు ప్రయాణం చేసి పరమాత్మిక సౌఖ్యం పొందాలి. మన దేశం, ప్రపంచం సుభిక్షంగా ఉండాలని, సాటి జీవులు ఆకలితో అలమటించకుండా ఉండాలని కోరుకుంటూ భగవంతుడు ఇచ్చిన శక్తిలో మనకు చేతనైన సహాయం సాటి పేద వారికి చేద్దాం. ప్రతి ప్రాణీ సుఖ శాంతులతో ఉండాలనే సంకల్పంతో ధ్యానిద్దాం.

ప్రస్తుతకాలం కరోనా వ్యాది నివారణ కొరకు స్వీయ రక్షణ చేసుకుందాం. మన ఆరోగ్యం కంటే ఏది ముఖ్యం కాదు. ప్రభుత్వాలు సూచించిన పద్దతులతో బాధ్యతగా భౌతిక దూరాన్ని పాటిద్దాం.  సనాతన సాంప్రదాయాలను ఆచరిస్తూ ప్రపంచ దేశాలలో మన దేశాన్ని ఆదర్శంగా నిలబెడదాం. స్వదేశి వస్తువులను, ఉత్పత్తులను ప్రోత్సహిద్దాం. నీవు నీది అనుకున్నది ఏది నీ సొంతం, శాశ్వతం కాదు. కేవలం భగవంతుని అనుగ్రహం, మనం చేసిన పుణ్యఫలితం ఒక్కటే మన వెంట వస్తూ మనల్ని రక్షిస్తూ ఆపదల నుండి కాపాడుతూ ఉంటుంది  జై శ్రీమన్నారాయణ.    

Follow Us:
Download App:
  • android
  • ios