Asianet News TeluguAsianet News Telugu

సూర్య గ్రహణం ద్వాదశ రాశుల వారికి ఫలితాలు

ఈ గ్రహణం భారతదేశముతో పాటు ఆసియా , ఉత్తర ఆస్ట్రేలియా, పాకిస్తాన్, శ్రీలంక , ఆఫ్రికా మొదలగు ప్రాంతములయందు కనిపించును. చాలా ప్రాంతములలో పాక్షికముగా కనిపించును, డెహ్రాడూన్ ( ఉత్తరాఖండ్ ) లో సంపూర్ణంగా కనిపించును .

lunar eclipse 2020 effect on horoscope
Author
Hyderabad, First Published Jun 17, 2020, 11:11 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

lunar eclipse 2020 effect on horoscope
 
ఈ ఏడాది తొలి సూర్య గ్రహణం తేదీ 21 జూన్ 2020  ఉదయం 11: 58  శ్రీ శార్వరినామ సంవత్సరం జ్యేష్ఠ అమావాస్య ఆదివారం, మృగశిర - 4 , ఆరుద్ర -1 పాదాలు మిథున రాశి, సింహ, కన్య, తులా లగ్నాలలో రాహుగ్రస్త అంగుళ్యాకారంలో చూడామణి నామ సూర్యగ్రహణం సంభవించనున్నది.

ఈ గ్రహణం భారతదేశముతో పాటు ఆసియా , ఉత్తర ఆస్ట్రేలియా, పాకిస్తాన్, శ్రీలంక , ఆఫ్రికా మొదలగు ప్రాంతములయందు కనిపించును. చాలా ప్రాంతములలో పాక్షికముగా కనిపించును, డెహ్రాడూన్ ( ఉత్తరాఖండ్ ) లో సంపూర్ణంగా కనిపించును .
మృగశిర, ఆరుద్ర, పునర్వసు నక్షత్రములవారు, మిథునరాశి వారు ఈ గ్రహణం చూడరాదు.

తెలంగాణ రాష్ట్రానికి
గ్రహణ ఆరంభకాలం : ఉదయం  10:14
గ్రహణ మధ్యకాలం : ఉదయం 11: 55 
గ్రహణ అంత్యకాలం : మధ్యహ్నం 1: 44 
గ్రహణ ఆద్యంతం పుణ్య కాలం 3 గంటల 30 నిమిషాలు.

ఆంధ్ర రాష్ట్రానికి
గ్రహణ ఆరంభకాలం : ఉదయం 10: 23 
గ్రహణ మధ్యకాలం : మధ్యహ్నం 12: 05
గ్రహణ అంత్యకాలం : మధ్యహ్నం 1: 51
గ్రహణ ఆద్యంతం పుణ్య కాలం 3 గంటల 28 నిమిషాలు
గ్రహణ నియమాలు.  

కరోనా సమయంలో సూర్య గ్రహణం పైగా 1. బుధుడు, 2. గురువు, 3. శుక్రుడు, 4. శని, 5. రాహువు,  6. కేతువు ఈ ఆరు గ్రహాలు అపసవ్యదిశలో ప్రయాణం చేస్తున్న కాలంలో ఈ గ్రహణం సంభవించడం వలన  ప్రపంచ వ్యాప్తంగా ఎలా ఉండబోతుంది. మన దేశంలో ఎలాంటి పరిస్థితులు సంభవించనున్నాయి అనే విషయంగా పంచాంగ ఆధారంగా ఫలితాలు ఏం సూచిస్తున్నాయో చూద్దాం.

ఆదివారం గ్రహణం సంభవించడం అంటే మాహా విశేషం ఆలాగే అంతే ప్రమాదం కుడానూ, ఏ సంవత్సరంలోనైనా చెత్రమాసం మొదలుకుని మల్లి చైత్ర మాసం వరకు ఐదు గ్రహాణాలు ఏర్పడతాయో ఆ సంవత్సరం ప్రకృతి విపత్తులు అనేవి సంభవిస్తాయి. ఇలా మనకు 2011లో వచ్చింది అలాగే ఈ సంవత్సరం సంభవించనున్నది. ఈ శార్వరి నామ సంవత్సరం ఉగాది పంచాంగ శ్రవణ ఫలితాలలో ఈ సంవత్సరం దేశంలో మరియు ప్రపంచ వ్యాప్తంగా అనేక సమస్యలతో ఇబ్బందులు ఉత్పన్నం అవుతాయి అని క్లుప్తంగా తెలియజేయడం జరిగింది. 

ఈ సూర్య గ్రహణం మిధునరాశి, సింహలగ్నంలో గ్రహణం ప్రారంభం అవుతుంది. మిధునరాశిలో సూర్యుడు, చంద్రుడు, బుధుడు, రాహువు కలిసి ఉన్నారు. నాలుగు గ్రహాలు ఒకే రాశిలో ఉండటం వలన ఒక్కొక్క గ్రహతత్త్వం ఎలా ఉంటుందో గమనిద్దాం. చంద్రుడు జలతత్త్వం కాబట్టి సునామీ లేదా అధిక వర్షాలు కలిగిస్తాడు, జల ప్రళయాలు వచ్చుటకూ కారణం అవుతుంది. బుధుడు భూమికి కారకుడు కాబట్టి భూ కంపాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక రాహువు అనగా యుద్దానికి కారకుడు, సూర్యుడు అంటే యుద్ధం ఈ రెండు గ్రహాలు యుద్దానికి సంకేతం.

ఇది ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా భారతదేశం, పాకిస్తాను, చైనా, ఆఫ్రికా దేశాలలో ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ప్రాంతీయ విభేదాలు, మత ఘర్షణలు, సరిహద్దుల వివాదాలు, సైబర్ మోసాలు, దొంగతనాలు, దోపిడులు, అనారోగ్యం, కొత్త రోగాలు, ఆర్ధిక మాంద్యం. రాజకీయ ప్రముఖులకు ఇబ్బందులు. ఊహించని ప్రమాదాలు, విస్పోటాలు. ఎక్కువ శాతం జనాలు అభద్రతా భావంతో జీవించడం. ఈ ప్రభావ ఫలితం దేశాలతో పాటు ద్వాదశ రాశుల వారికి కూడా ఉంటుంది. దీని ప్రభావం సుమారు రెండు నెలల కాలం ఎక్కువగా ఉంటుంది. 

శుభ ఫలితాలను పొందే రాశులు :-  జన్మరాశి నుండి  3, 6,10,11 రాశులు - 
మేష (Aries) , మకర ( Capricorn) ,  కన్య ( Virgo), సింహరాశి (Leo) 

మధ్యమ ఫలితాలను పొందే రాశులు :- జన్మరాశి నుండి 2, 5, 7, 9 రాశులు -
వృషభ ( Taurus) , కుంభ ( Aquarius) , ధనుస్సు ( Sagittarius) , తులారాశి ( Libra)

అశుభ ఫలితాలను పొందే రాశులు :- జన్మరాశి నుండి 1, 4, 8, 12 రాశులు - 
మిధున ( Gemini) , మీన ( Pices), వృశ్చిక ( Scorpio) , కర్కాటక రాశి ( Cancer)

మేషరాశి (Aries) వారికి :- మేషరాశి నుండి మూడవ రాశిలో గ్రహణం సంభవించడం వలన శుభ ఫలితాలను కలిగిస్తాయి. కుటుంబ స్థానం కాబట్టి ఇంటికి దూరం అయిన వారు తిరిగి కలుస్తారు, కుటుంబ సభ్యులు అనుకూలంగా వ్యవహరిస్తారు. పిత్రార్జితం లభిస్తుంది. కుటుంబ కలహాలు తొలగిపోతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. అన్ని రకాలుగా కుటుంబం నుండి  కలిసి వస్తుంది. సామాజిక సంబంధాలు బలపడతాయి. అన్నింటిలో సహారం లభిస్తుంది. మొత్తానికి లాభసాటిగా ఉంటుంది.

వృషరాశి ( Taurus) వారికి :- మధ్యమ ఫలితం ఉంటాయి. పెట్టిన పెట్టుబడులకు మధ్యస్తమైన లాభాలు నామ మాత్రంగా దక్కుతాయి. రావలసిన డబ్బులు చేతికి అందడానికి కొంత వ్యయ ప్రయాసలు పడ్డ తర్వాత చేతికి అందుతాయి. ఆర్ధిక పరంగా మాములుగా ఫలితాలు కనబడతాయి. బ్యాంకు లోన్ కొంత ఆలస్యంగా మంజూర్ అవుతుంది. భాగస్వామ్య వ్యాపారాలలో కొంత జాగ్రత్తలు అవసరం. సుమారు మూడు నెలల వరకు పెట్టుబడులు పెట్టక పోవడం మంచిది. శ్రమతో కూడుకున్న పనులు, ఉద్యోగంలో, వ్యవహారంలో ఎక్కువగా శ్రమించి ఫలితాలు పొందాల్సి ఉంటుంది.  

మిధునరాశి ( Gemini) వారికి :-  ఈ రాశిలోనే గ్రహణం సంభవించడం వలన కొంత ఎక్కువ చెడు ప్రభావాలు ఎదుర్కోవలసి వస్తుంది. మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. శారీరక ఆరోగ్య పరమైన ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. చిత్త చాంచల్యం పెరుగుతుంది, తొందరపాటు తనం అధికమౌతుంది. మానసిక ఒత్తిడిలు, అఘాయిత్యాలపై మనస్సు దొర్లడం సంభవించే సూచనలు మెండుగా ఉన్నాయి. ఇంటికి దూరంగా ఉండే అవకాశం. ఊహించని అనారోగ్యాలు ఇబ్బంది పెడతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తికాక ఇబ్బంది కలిగిస్తాయి. అన్నింట్లో ఎదురు దెబ్బలు చూడటం వలన పిరికితనం, అతి కోపం, ఉన్మాద ప్రవర్తన చోటు చేసుకుంటుంది.    

కర్కాటకరాశి ( Cancer) వారికి :- శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ అవుతుంది. ప్రతి దానిలో నష్టం సంభవించే అవకాశాలు ఎక్కవగా గోచరిస్తున్నాయి. వస్తువులు పోగొట్టుకోవడం, లేదా దొంగతనాలు జరగడం. ఆత్మీయులు దూరం కావడం మొదలగునవి సూచిస్తున్నాయి, మీరు కష్టపడ్డ ఫలితం వేరే వారికి దక్కడం. నష్టాలు చవి చూడటం. మానసిక స్థితి సరిగా లేక సమయస్పూర్తి పాటించ లేకపోవడం జరుగుతుంది. సుఖం కరువవుతుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. 

సింహరాశి (Leo)  వారికి :-  ఎక్కువ శుభ ఫలితాలను పొందుతారు. ఆర్ధికంగా అనుకూలతలు. మానసిక తృప్తి. ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్నది ఇప్పుడు అనుకూలంగా జరుగుతాయి. రావలసిన డబ్బులు వస్తాయి. వ్యాపార, వ్యవసాయ, రియల్ ఎస్టేట్, భూ సంబధించిన వ్యాపారాలు అనుకూలంగా మారుతాయి. పట్టిందల్లా బంగారం అన్నట్టుగా అన్ని విధాలుగా కలిసి వస్తుంది. సామాజిక సంబందాలు బలపడతాయి, కుటుంబంలో మరియు  సమాజం నుండి  సహకారం లభిస్తుంది. ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్లు, ఆర్ధికంగా అనుకూలతలు అనుకున్న పనులను పూర్తిచేసుకోగాలుగుతారు. 

కన్యరాశి ( Virgo) వారికి :-  శుభ ఫలితాలను పొందుతారు. ఉద్యోగ ప్రాప్తి. ఉపాధ్యాయ రంగంలో ఉన్న వారికి విశేషంగా కలిసి వస్తుంది. విద్యార్ధులకు  పరీక్షలలో ఉత్తమ ఉత్తీర్ణత ఫలితాలు పొందుతారు. ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయి. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. కుటుంబంలో మరియు  సమాజం నుండి  సహకారం లభిస్తుంది. ఉద్యోగ ప్రాప్తి, రాజకీయ ప్రమోషన్లు, ఆర్ధికంగా అనుకూలతలు అనుకున్న పనులను పూర్తిచేసుకోగాలుగుతారు. 

తులారాశి ( Libra) వారికి :-  మధ్యమ ఫలితాలు కారణంగా తండ్రి కొడుకుల మధ్య సఖ్యత లేకపోవడం, విభేదాలు తలెత్తడం జరుగుతుంది. పిత్రార్జిత మూలక గొడవలు సంభవిస్తాయి. బంధువుల విరోధం. తండ్రికి ఆరోగ్య సమస్యలు మొదలైనవి సంభవించే అవకాశం ఉంటుంది. వాహణ ప్రమాదాలు పొంచి ఉంటాయి జాగ్రత్త. మానసిక ప్రశాంత లోపిస్తుంది, వ్యయ ప్రయాసలతో విజయం సాధిస్తారు. విజయం సాధించాలి అంటే రాజీ పడటం నేర్చుకోవాలి, శ్రమ ఎక్కువ పడాలి. ధర్మ బద్దంగా వ్యవహరించండి. అన్యాయ పరులకు దూరంగా ఉండండి. 

వృశ్చికరాశి ( Scorpio) వారికి :- అష్టమ స్థానంలో గ్రహణం కారణంగా అనారోగ్యం బాధలు, దాంపత్య జీవితంలో గొడవలకు చోటు అవుతుంది. దంపతులు ఇద్దరు ఒకే సారి ప్రయాణం చేయకూడదు. కనీసం మూడు నెలలు కలిసి ప్రయాణం చేయకూడదు. విడి విడిగా చేయవచ్చును. వాహాణాలతో దూరంగా ఉండండి. మృత్యు గండాలు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త. అలాగే అపవాదులు చోటుచేసుకోనున్నాయి, ఆ పేరు రాకుండా జాగ్రత్త పడండి. చెయ్యని నేరానికి మీ పేరు రావడం, నమ్మక ద్రోహం, ఉద్యోగ చిక్కులు ఉంటాయి. భార్య భర్తల మధ్య ఎడబాటు. ఆత్మీయుల మరణం, అనుకోని సంఘటనలు ఎక్కువ జరగటం జరుగుతుంది. 

ధనుస్సురాశి  ( Sagittarius) వారికి :- సప్తమ ' దాంపత్య' స్థానంలో గ్రహణం ఏర్పడటం వలన దాంపత్య జీవితంలో మధ్యమ ఫలితాలు ఉంటాయి. చిన్న చిన్న గొడవలు ఉన్ననూ విడిపోయిన దంపతులు, ప్రేమికులు తిరిగి కలుసుకుంటారు. అవివాహితులకు వివాహాలు జరుగుతాయి. ఉద్యోగంలో ఉన్న భార్య భర్తలు గతంలో ఉద్యోగ రిత్య దూర దూర ప్రాంతాలలో ఉంటే ఇప్పుడు ఒకే చోట కలిసి ఉండే అవకాశం దక్కుతుంది. శుభకార్యాలు కొంత ఇబ్బంది పెట్టిన అవుతాయి. కుంటుంబంలో  చిన్న చిన్న ఇబ్బందులు ఉన్న సమసిపోతాయి. స్వంత నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా గురువుల సలహాతో వ్యవహరించండి శుభం కలుగుతుంది. 

మకరరాశి ( Capricorn) వారికి :- శుభఫలితాలు కలుగుతాయి. శత్రువులు అనుకూలంగా మారుతారు. దీర్ఘకాలిక అనారోగ్యాలు కుదుట పడుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు దక్కుతాయి. పదవి, ప్రమోషన్లు లభిస్తాయి. రాజకీయంగా అనుకూలంగా ఉంటుంది. శత్రుల  మూలకంగా లాభాలు దక్కించుకుంటారు. ఎంతో కాలం నుండి అనుకున్న పనులు జరగనివి జరుగుతాయి. పెద్ద పెద్ద వ్యక్తులతో కలయికతో లాభాలుపడతారు. మీకంటు ఓ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. చట్టరిత్య ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. అంతా మంచి జరుగుతుంది. 

కుంభరాశి  ( Aquarius) వారికి :- పంచమ స్థానంలో గ్రహణం సంభవించడం వలన మధ్యమ ఫలితాలు దక్కుతాయి. సంతానం లేని దంపతులకు సంతానం కలుగుతుంది. పిల్లల నుండి ఆశించిన ఫలితాలు మధ్యస్తంగా ఉంటాయి. విద్యార్ధులకు ఉన్నతంగా కాకపోయినను శుభ ఫలితాలు దక్కుతాయి. ఉన్నతమైన చదువులకు సీటు లభిస్తుంది. ఉన్నతమైన ఫలితాలు కావాలంటే ఎక్కువ శ్రమ ఒడ్డాల్సి ఉంటుంది. భూమి, ఇల్లు మొదలగు ఆలోచనలు కొంచం ఎక్కువ చొరవ చూపితే లాభిస్తుంది. ఎన్నో రోజుల నుండి స్థలం అమ్మలనుకున్న వారికి గట్టి ప్రయత్నం చేయడం వలన అమ్ముడు పోతాయి. లక్ష్య సాధనకు జాతక గోచార స్థితికి అనుగుణంగా వ్యవహరించండి. 

మీనరాశి ( Pices) వారికి :-  చతుర్ధ స్థానంలో గ్రహణం ఏర్పడటం వలన అశుభ ఫలితాలు కలుగుతాయి. కొంచెం ఎక్కువ జాగ్రత్తలు పాటించాలి. ఆస్తులు పోగొట్టుకుంటారు. కష్టపడి సంపాదించుకున్న వాటికి నష్టం సంభవించే అవకాశాలు ఎక్కువ. నమ్మక ద్రోహం జరుగుతుంది. మీరు ఎక్కువగా నమ్మిన వారితో ద్రోహం సంభవిస్తుంది. కుటుంబం నుండి విడిపోవటం. మానసిక ప్రశాంతత లోపించడం జరుగుతుంది. తల్లికి సంబంధించిన అనారోగ్య సూచనలున్నాయి. విద్యాపరంగా ఏవేవో అంచానాలు వేసుకున్నవి తారుమారు అయ్యే అవకాశం ఉంది. మిత్రులు శత్రువులుగా మారుతారు. భూ సంభందిత పెట్టుబడులు కుదేల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అనారోగ్యసూచనలున్నాయి. కష్టపడ్డ సొత్తు పరుల పాలు కాకుండా జాగ్రత్త పడండి.

పరిహార మార్గాలు:- గోధుమలు, మినుములు, బెల్లంను మూడు ఒక్కొక్కటి కిలోపావు చొప్పున తీసుకుని వాటిని ఆరటి లేదా విస్తరి ఆకులో పెట్టి అందులో రెండు తమలపాకులు, రెండు అరటి పండ్లు, రెండు ఎండు ఖర్జర పండ్లు, రెండు వక్కలు. కొంచెం గరిక వేసి గ్రహణానికి ముందు దేవుని గదిలో పెట్టి గ్రహణ పట్టు స్థానం చేసి మీకున్న ఉపదేశ మంత్రం కాని, విష్ణు సహస్ర నామం కాని, నవగ్రహ మత్రంగాని లేదా మీకు నచ్చిన దేవుని మంత్రంతో జపం చేసుకుని గ్రహాణం విడిచిన తర్వాత పట్టు విడుపు స్నానం చేసి ఈ ధాన్యం భగవంతునికి అర్పితం చేసినట్లు భావించి సమస్త గ్రహ దోష నివారణ చేయమని నమస్కరించి ఆ ధాన్యం ఆవునకు తినిపించాలి, గోమాతకు మూడు ప్రదక్షిణలు చేయాలు. లేదా ప్రవహించే నీళ్ళలో కాని చెరువులో గాని వదిలివేయాలి. 

గమనిక :- ద్వాదశ రాశుల వారికి వ్యక్తీ గత జాతక ఆధారంగా పై ఫలితాలలో హెచ్చు తగ్గు మార్పులు చోటుచేసుకుంటాయి. అనుభవజ్ఞులైన జ్యోతిష పండితుడిని సంప్రదించి మీ జాతక గోచార గ్రహ స్థితిని పరిశీలింపజేసుకుని వారిచ్చే సూచనలతో తగు పరిహార శాంతులు, రేమిడి పద్దతులు దోష నివారణా మార్గాలను తెలుసుకుని ఆచరించి ప్రశాంత జీవితాలను గడపండి. శాస్త్రం అనేది నిఖచ్చిగా, కర్కశంగానే తెలియజేస్తుంది. పాటించడం, పాటించ పోవడం అనేది వ్యక్తీ గత అభిప్రాయంపై ఆధారపడి ఉంటుంది.

శాస్త్రం అనేది తలిదండ్రులు, గురువు లాంటిది సదా మేలునే కోరుతుంది. ఉన్నదది ఉన్నట్టుగా తెలియజేస్తుంది. వాటిని అనుసరించే వారికి ఫలితాలు చద్దన్నంలాగా ఉపయోగ పడుతాయి. సన్మార్గ ప్రయాణంలో ధన్యజీవులం అవుదాము. దేశం, ప్రపంచం సుభిక్షంగా ప్రతి ప్రాణి సుఖ శాంతులతో ఉండాలనే సంకల్పంతో ధ్యానిద్దాం. బాధ్యతగా భౌతిక దూరాన్ని పాటిద్దాం. సనాతన సాంప్రదాయాలను ఆచరించి ఆదర్శంగా నిలబడదాం. తక్షణ కర్తవ్యం పూర్తి చేస్తేనే తదుపరి కరత్వం ఏమిటో స్పష్టంగా తెలిసిపోతుంది.      

  

Follow Us:
Download App:
  • android
  • ios