కృత్తికా నక్షత్రం పౌర్ణమినాడు వచ్చే మాసాన్ని కార్తీకమాసం అంటారు. ఈ సం||రం కార్తీక మాసం 29.10.2019 నుంచి 26.11.2019 వరకు ఉంటుంది.

కార్తీకమాసంలో 3 రకాల ఉపవాస నియమాలు ఉంటాయి. అవి 1. ఏకభుక్తం. 2. నక్తవ్రతం, 3. ఉపవాసం. ఈ పద్ధతుల్లో ఎవరికి తోచిన పద్ధతిని వారు పాటించవచ్చు. మొదటినుంచీ ఈ మాసం అంతా ఒకే రీతిగా ఉండాలి.

ఏకభుక్తం అనగా ఉదయం భోజనం చేసి రాత్రికి టిఫిన్‌లాటివి ఏమీ చేయకుండా ఉండడం, నక్తం అనగా పగలంతా ఏమీ తినకుండా ఉండి సాయంకాలం పూజ చేసి నక్షత్ర దర్శనం చేసాక భోజనం చేయడం. ఉపవాసం అనగా ఉడికినవి తినకుండా, ఉప్పుకారాలు లేకుండా, నూనె వాడకుండా తినగలిగేవి మాత్రమే తింటూ ఉండడం. ఇలా చేయలేని వారు సోమవారాలు, ఏకాదశి, పౌర్ణమి, మాస శివరాత్రి, అమావాస్య మొదలైన రోజుల్లో ఉపవాసం ఉండి ఈ దీక్షను పూర్తి చేస్తారు. ఈ మాసంలో ఉల్లి, వెల్లుల్లి, దుంపలు, ముల్లంగి మొదలైనవి తినకూడదు. బయటి  పదార్థాలు కూడా వీలైనంత తక్కువ తినాలి. పూర్తిగా తినకుండా ఉండడం మంచిది. పితృ తిథులు చేసేవారు భోజనం చేయడం మానకూడదు. ప్రతినిత్యం శివారాధన, కేశవారాధన తప్పనిసరిగా చేస్తూఉండాలి. చలిమిడి పెసరపప్పు, పానకం, కొబ్బరి తీసుకోవచ్చు. కార్తీక మాసంలో సూర్యోదయానికి పూర్వం స్నానం, దీపారాధన, ధ్యానం, జపం, దానం, భూ శయనం తప్పనిసరిగా చేయాల్సిన నియమాలు. అనగా ఈ మాసంలో సుఖపడడానికి దూరంగా ఉండాలి అని అర్థం. శరీరాన్ని మనస్సును బాగా కష్టపడాల్సిన మాసం.

ఈ మాసంలో శివపురాణంకాని, రామాయణ, భారత, భాగవతాలు తప్పనిసరిగా చదువాల్సిన గ్రంథాలు. దానాలు చేయడానికి కూడా తాము కష్టపడిన సొమ్మును మాత్రమే వాడాలి. అయాచితంగా వచ్చిన దానిని దాన ధర్మాలకు వినియోగించకూడదు. దీపారాధన చేయడం ఎంత ముఖ్యమో ఎవరైనా వెలిగించిన దీపం తాము చూస్తూ ఉన్నప్పుడు కొండెక్కుతూ ఉంటే దానిలో కాస్త నూనె పోసి కాసేపు వెలిగెలా చేయడం కూడా ముఖ్యమే. అలాగే నూనె ఉండి ఒత్తి సరిగా లేకపోతే కూడా వత్తిని సరిచేయడం కూడా తప్పనిసరి. నాకెందుకులే అనే ఆలోచనలు రాకుండా చూసుకోవాలి.

దానాలు ఎవరికి తోచినవి వారు చేస్తూ ఉంఆలి. తేనె, నెయ్యి, ఆవుపాలు, పెరుగు, బెల్లం, చెరుకు, గోదానం, భూ దానం, సువర్ణం, వెండి, వస్త్రాలు, ఆభరణాలు ఎవరికి చేతనైనంత వారు చేస్తూ ఉండాలి. పేద సాదలకు సహాయం చేయడం మొదలైన మంచి పనులు అన్నీ ఈ మాసంలో చేయడం మొదలు ప్టిె వాటిని ఆపకుండా నిరంతరం చేస్తూ ఉండాలి.

ఏ పని చేసినా భక్తి శ్రద్ధలతో తప్పనిసరిగా చేయాలి. ఇతరుల ధనాన్ని ఏమాత్రం ఆశించకుండా సేవ చేయాలి. మానవ సేవయే మాధవ సేవ. దేవ ఋణం, పితృ ఋణం, ఋషి ఋణం తీర్చుకోవడానికి అనువైన మాసం ఈ కార్తీక మాసం.

కార్తీకంలో మనస్సు, పంచేంద్రియాలు, సప్తధాతువులతో నిర్మితమైన ఈ దేహంతో ఎన్ని మంచి పనులు చేయ గలిగితే అన్ని మంచి పనులు చేయడానికి పూనుకోవాలి. ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు అన్నీ తప్పనిసరిగా చేయాలి. అప్పుడు మాత్రమే శివ కేశవుల అనుగ్రహానికి పాత్రులు అవుతారు.