గృహప్రవేశ విధి :- ఇల్లు సమస్త శుభవాస్తు ప్రకారం గృహ నిర్మాణం పూర్తైన తర్వాత మంచి పాండిత్యం శాస్త్ర పరిజ్ఞానం కలిగిన అనుభవజ్ఞులైన పండితుడిని సంప్రదించి మీ పేరు బలంతో గృహప్రవేశ ముహూర్తం పెట్టించుకోవాలి. మీ వ్యక్తీ గత వెసులుబాటు కొరకు ఆదివారం ముహూర్తం కావాలని ఇంకా మీకు అనుకూలంగా ఉండే సెలవు రోజులలో ముహూర్తం కావాలని పండితుడిని ఒత్తిడి చేయకూడదు. మీ పేరు బలంతో పంచాంగా రిత్య మంచి ముహూర్తం ఎప్పుడు నిర్ణయం అవుతుందో దానికే ప్రాధాన్యతను ఇవ్వాలి.

click here: మీ జాతకం గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా!

మత్స్యయంత్ర స్థాపన :- గృహ ఆరంభ ముహూర్తం చేసిన తర్వాత ఇల్లు కట్టుట ప్రారంభించినపుడు ఇంటికి నాలుగు దిక్కులలో   "పంచ లోహం"తో చేయించిన మత్స్యయంత్రాలకు శాస్త్రోక్త విధి విధానాలతో ప్రాణ ప్రతిష్ట చేయించి గృహ ప్రవేశానికి ముందే సమస్త వాస్తు దోషాలను తొలగించే శక్తివంతమైన నాలుగు మత్స్యయంత్రాలు, నవరత్నాలు భూ స్థాపితం చేయించాలి. ఆర్ధిక స్థోమత లేని వారు ఈశాన్యంలో స్థాపించు కోవాలి. కొంత ఖర్చుతో కూడుకున్నదైనను నాలుగు వైపులా యంత్ర స్థాపితం చేయించుకుంటే శల్య దోషాలు, వాస్తు దోషాలు, వీధి పోటు దోషాలు, గ్రహదోషాలు, నరదృష్టి దోషాలు మొదలగునవి  నివారింపబడుతాయి. మత్స్యయంత్రాలు స్థాపించిన ఇంట్లో నివసించే వారికి మానసిక తృప్తితో పాటు ఆరోగ్య , ఆర్ధిక , కుటుంబ అన్యోన్యతలను  కాపాడేందుకు సహకరిస్తుంది.     

today astrology: 06 జనవరి 2020 సోమవారం రాశిఫలాలు...

 

గృహ నిర్మాణం పూర్తి అయిన తర్వాత జ్యోతిషులు నిర్ణయించిన శుభముహూర్తంలో ధర్మపత్ని సమేతంగా బంధువులు, మిత్రులతో సహా గృహప్రవేశం చేయవలెను. గృహ యజమాని దంపతులు పట్టు వస్త్రాలు ధరించి తమకు ముందు లేగదూడ కలిగిన ఆవును, నిండు బిందె నీళ్ళు ముతైదువులు పట్టుకుని స్థపతి , శిల్పి , మంగళ వాయిద్యాల శబ్దంతో పురోహితుడు నడుస్తున్నది అనుసరించి పూర్ణ కలశంతో ఈశాన్యం వైపు నుండి ప్రారంభించి గృహ ప్రదక్షిణ చేయాలి. ఇలా ప్రదక్షిణలు చేస్తున్న సమయంలోనే ఎనిమిది దిక్కులలో ఉండే వారిని క్రింద  తెలియజేయబడినది.
 
1. ఈశాన్యము  - చరకీ దేవత. 
2. తూర్పు        - సర్వస్కంధ. 
3. ఆగ్నేయం   - విదారికా. 
4. దక్షిణం       - ఆర్యమ. 
5. నైఋతి       - పూతన. 
6. పడమర       - జంభక. 
7. వాయువ్యం  - పాపరాక్షసి. 
8. ఉత్తరం        - పిలిపింఛక 

అను దిక్పాలకు పెసర పప్పు, బియ్యం, పసుపు, సున్నం కలిపి వండిన అన్నం వెలగకాయంత ముద్దలు చేసి అన్ని దిక్కులలో అరటిఆకులో కానీ విస్తరి ఆకులో కాని బలి పెట్టవలెను, ఎర్రని అక్షితలు , నవధాన్యాలు, కొబ్బరికాయ సమర్పరిస్తూ వాస్తుపద బాహ్యదేవతలకు వాస్తు బలులు సమర్పించాలి.

ప్రదక్షిణలు పూర్తి చేసిన తర్వత నిర్ణయించుకున్న సుముహూర్తమునకు గృహ సింహ ద్వారం నుండి దూడతో ఉన్న ఆవును ముందుగా పూజించి దానికి ఇష్టమైన ఆహారమును పెట్టవలెను. గుమ్మానికి  గుమ్మడికాయ బలిహారం ఇవ్వాలి. ముందుగా ఆవును ద్వారం దాటించి పూర్ణకుంభంలతో దేవుని పటము చేతబట్టుకుని యాజమాని తాంబాళములో బియ్యం పోసి అందులో దేవతల విగ్రహాలు మంగళ హారతి చేత పట్టుకుని సింహాద్వారంనకు మనస్సుతో నమస్కరించుకుని కుడికాలు ముందు పెట్టి గృహప్రవేశం చేయాలి, వారి వెనక ఇతర ముత్తైదువలు నిండు నీళ్ళ బిందె,హారతులు మొదలగు వాటితో ప్రవేశం చేయాలి. 

గమనిక :- గృహ ప్రవేశానికి ముందు ఇంట్లో ఎలాంటి వస్తువులు పెట్టకూడదు. గృహ ప్రవేశం తర్వాతనే సామాగ్రి ఇంట్లోకి తీసుకువెళ్ళాలి. గృహ ప్రవేశానికి ముందు ఇల్లు శుభ్రం చేసిన తర్వాత దర్వాజాలు మూసి ఉండాలి. కొన్ని సందర్బాలలో నిర్మాణం పూర్తిగాక ముహూర్తాలు దాటి పోతున్నాయి మళ్లి చాలా కాలం వరకు ముహూర్తాలు లేవు అని తెలిసినప్పుడు ముహూర్తం సమయానికి ఇంట్లో చేయించాల్సిన పని కరంటు ,ప్లంబింగ్, ఉడ్ వర్కు మొదలగునవి ఇంకా కొంత పని బాకీ ఉన్నను వాటిని తర్వత కూడా చేయించుకోవచ్చును. కాని ఇంటికి డోర్లు అమర్చనిదే గృహ ప్రవేశం చేయకూడదు. 

కొన్ని ప్రాంతాలలో గృహ ప్రవేశానికి ముందుగా ఇంట్లో జంతు బలులు ఇవ్వడం , వంటలు చేసి భోజనాలు పెట్టడం మొదలగునవి చేస్తుంటారు. శాస్త్ర ప్రకారం గృహప్రవేశంలో పండితుల వేద మంత్రోచ్చారణతో బలిహారం పెట్టేవరకు నూతన గృహంలో అంతకు ముందు నిప్పు వెలగ కూడదు, ఏ వంట చేయరాదు. కొంత మంది మూఢ నమ్మకాలతో లేదా శాస్త్ర పరిజ్ఞానం లేని వాళ్ళ మాటలు నమ్మి చాలా పొరపాట్లు చేస్తున్నారు. ఆలా చేస్తే శాస్త్ర విరుద్ధం అవుతుంది. 

 

యజమాని గృహ ప్రవేశ భాగంలో ఇంట్లో గణపతి పూజ , పుణ్యాహవాచనము, వాస్తు మండపారాధన, అగ్ని ప్రతిష్ట, పాలు పొంగించి క్షీరాన్నం వండి పూజలో నివేదన చేయాలి. ఊర్ద్వ పురుషునికి బియ్యం పిండితో చేసిన ఉండ్రాళ్ళు, బెల్లం, నవధా న్యాలు మొదలగునవి ఇంటి పై కప్పులో బలిహారం ఇవ్వాలి, వాస్తు ( గణపతి ) హోమం, నవగ్రహ పూజ, అష్ట దిక్పాలకుల పూజ , గృహ కళ్యాణం, సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించుకున్న తర్వాత స్థపతిని, శిల్పిని , పురోహితున్ని యాధాశక్తి గా నూతన వస్త్ర తాంభూలాదులను ఇచ్చి వారిని  సత్కరించి సంతృప్తి పరచి వారి ఆశీర్వాదములు తీసుకుకోవాలి. 

తమ శక్తి కొలది బంధు, మిత్రులకు శాఖాహార భోజనాలు  "అన్నశాంతి" కార్యక్రమాలు చేయవలెను. మూడు రోజులు ఉభయ సంధ్యలలో ఇంట్లో దేవుని మందిరంలో దీపారాధన చేయాలి యజమాని కుటుంబం తప్పక మూడు నిద్రలు వరుసగా గృహ ప్రవేశ అనంతరం చేయాలి. ఈ విధంగా  శాస్త్రోక్త విధిగా  గృహ ప్రవేశ కార్యక్రమం జరిపించుకుంటే కర్త సమస్త సుఖ సౌఖ్యములు పొంది ఆనందమైన జీవితాన్ని అనుభవించును.        

గృహ ప్రవేశానికి అనుకూలమైన మాసాలు :- వైశాఖం , జ్యేష్ట , శ్రావణం , కార్తీకం , మాఘ , ఫాల్గుణ మాసాలు శుభ ప్రదం.

శుభ వారం :- సోమ , బుధ, గురు, శుక్ర వారాలు.

శుభ తిధులు :- విదియ , తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి, పౌర్ణమి, 

శుభ నక్షత్రాలు :- రోహిణి , మృగశిర , ఉత్తర, చిత్త , అనురాధ, ఉత్తరాషాఢ , ధనిష్ఠ, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతి .

శుభ లగ్నాలు :- వృషభ, మిధున, కన్య, ధనుస్సు , కుంభ, మీన లగ్నాలు శుభం.

శుద్ధి :- లగ్నమునకు చతుర్ధ  స్థానం, అష్టమ స్థానం, ద్వాదశ స్థానాల శుద్ధి ఉండాలి, ఈ స్థానాలలో ఏ గ్రహము ఉండరాదు.

శుభ గ్రహ స్థానాలు :- కేంద్రాలు  ( 4, 7, 10 ) కోణాలు ( 1, 5, 9  ) లలో శుభ గ్రహాలు ఉన్నను, ఆ స్థానాలను చూడ బడిన లగ్నంలో గృహ ప్రవేశం చేసిన పుత్రపౌత్రాభి వృద్ధి ,సంపద కలుగుతుంది.    


ప్రతికూలమైన నక్షత్రాలు :-  అశ్విని , పునర్వసు, హస్త, స్వాతి, శ్రవణ నక్షత్రాలలో ప్రవేశించిన ఆ గృహం అన్యాక్రాంతం అవుతుంది. మిగిలిన నక్షత్రాలలో ప్రవేశం చేస్తే దుఃఖకరము అవుతుంది.

అనుకూలం కాని మాసాలు :- చైత్రం            -  ధనహాని ,
           ఆషాడం         -   పశుహాని 
           భాద్రపదం     -  ప్రజాపీడ
           ఆశ్వీయుజం  -  కలహాలు 
           మార్గశిరం       -  మహాభయం 
           పుష్యమి          -  అగ్ని భయాలు 
    
గమనిక :- సూర్యుడు కృత్తికా, విశాఖ నక్షత్రం సంచారంలో ఉండగా ఇంటి ముహూర్తములు చేయకూడదు. గృహ ప్రవేశ ముహూర్తం నిర్ణయించిన పండితుడికి దక్షిణ తాంభులం ఇచ్చి వారి ఆశీస్సులు తీసుకోవాలి. ఉచితంగా ముహూర్తము పెట్టించుకుంటే ఋణ శేషం పెంచుకున్న వాళ్ళు అవుతారు. యదేశ్చగా గృహ ప్రవేశం చేస్తే శుభఫలితాలు కనబడవు. ఎన్నో వ్యయప్రయాసలు పడి ఎన్నో లక్షలు, కోట్లు ఖర్చు పెట్టి స్వంతింటి కల నెరవేర్చుకుంటాము, అంతే ఆరాటంతో శాస్త్రోక్తకంగా గృహ ప్రవేశం చేసుకుంటే వచ్చే ఫలితం అనుభవిస్తే కాని అర్ధం కాదు. అందుకే పెద్దలు అన్నారు గృహమే కధ స్వర్గసీమ అని జై శ్రీమన్నారాయణ.

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151