ఒంగోలు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీఎంపీ వైవీ సుబ్బారెడ్డి అలకబూనారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఒంగోలు పార్లమెంట్ టికెట్ విషయంపై ఇద్దరు మధ్య చెడిందని అందువల్లే వైవీ సుబ్బారెడ్డి జగన్ కు దూరంగా ఉంటున్నారంటూ వార్తలు వెల్లువెత్తుతున్నాయి. 

గత కొంతకాలంగా వైవీ సుబ్బారెడ్డి వైఎస్‌ జగన్‌ కు దూరంగా ఉండటానికి కూడా కారణం అదేనని ప్రచారం జరుగుతుంది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆమంచి కృష్ణమోహన్ లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంలో కానీ, వైఎస్ జగన్ ను కలిసిన సందర్భంలో కానీ వైవీ కనబడకపోవడానికి కూడా కారణం అలకేనని తెలుస్తోంది. 

ఇకపోతే వైఎస్ జగన్ నూతన గృహ ప్రవేశానికి సైతం వైవీ సుబ్బారెడ్డి హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. అందరికీ ఆహ్వానం అందించిన వైవీ సుబ్బారెడ్డి ఆయన గైర్హాజరవ్వడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 

వైవీ సుబ్బారెడ్డి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాత్రమే కాదు వైఎస్ జగన్ కు స్వయానా చిన్నాన్న. వైఎస్ఆర్ కు తోడల్లుడు. జగన్ కుటుంబంలో వేడుకకు వైవీ సుబ్బారెడ్డి హాజరుకావాల్సింది పోయి దూరంగా ఉండటంతో అలకే కారణం అంటూ మరోసారి ప్రచారం గుప్పుమంది. 

అబ్బాయి జగన్‌పై బాబాయ్‌ వైవీ సుబ్బారెడ్డి అలక కారణంగానే గృహ ప్రవేశానికి కానీ, పార్టీ కార్యాయలం ఓపెనింగ్ కు కానీ హాజరు కాలేదంటున్నారు. ఒంగోలు పార్లమెంట్ టికెట్ టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి ఇస్తానని మాట ఇచ్చారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. 

అంతేకాదు వైవీ సుబ్బారెడ్డి సేవలను పూర్తిగా పార్టీకి ఉపయోగించాలని చూస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ పరిణామాలపై వైవీ సుబ్బారెడ్డి సైతం స్పందించారు. తాను ఒంగోలు నుంచే పోటీ చేస్తానని అందులో ఎలాంటి సందేహం లేదని తేల్చి చెప్పారు.