హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓట్ల తొలగింపు అంశంపై వైసీపీ చీఫ్ వైఎస్  జగన్‌ రాష్ట్ర గవర్నర్‌ను  బుధవారం నాడు కలిసి వినతిపత్రం సమర్పించారు.  ఇదే విషయమై బీజేపీ  నేతలు కూడ కలిసి గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. గంట వ్యవధిలోనే రెండు పార్టీలకు చెందిన ఫిర్యాదు చేయడం గమనార్హం.

ఏపీ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వైసీపీ సానుభూతిపరులు,టీడీపీకి ఓటు వేయరని నిర్ధారించుకొన్న ఓటర్ల పేర్లను జాబితా నుండి  ప్లాన్ ప్రకారంగా తొలగిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

వైసీపీకి చెందిన ఎమ్మెల్యేల ఓట్లను కూడ జాబితా నుండి తొలగించాలని ధరఖాస్తులు వస్తున్న విషయాన్ని వైసీపీ నేతలు  గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.
ఐటీ గ్రిడ్‌ పేరుతో ఏపీ ప్రజలకు సంబంధించిన డేటాను కూడ టీడీపీ నేతలు చోరీ చేస్తున్నారని వైసీపీ నేతలు  గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు.

అంతేకాదు ఐటీ గ్రిడ్ ద్వారా టీడీపీ నేతలు వ్యూహత్మకంగా టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారని వైసీపీ నేతలు వివరించారు. ఐటీ గ్రిడ్ కేసు విషయాన్ని కూడ జగన్  గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.అయితే  వైసీపీ నేతలు గవర్నర్ వద్దకు  వెళ్లడానికి ముందే  బీజేపీ నేతలు   గవర్నర్  వద్దకు వెళ్లి ఓట్ల తొలగింపుకు గురించి ఫిర్యాదు చేశారు. 

గంట వ్యవధిలోనే  డేటా చోరీ, ఓట్ల తొలగింపు విషయాలపై ఈ రెండు పార్టీలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశాయి. ఐటీ గ్రిడ్ , బ్లూ ఫ్రాగ్  సంస్థల సహాయంతో  ఏపీ ప్రజల డేటాను చోరీ చేశారని ఈ రెండు పార్టీలు గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్టుగా సమాచారం.