హైదరాబాద్: ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబునాయుడు సైబర్ క్రైమ్‌కు పాల్పడినట్టుగా వైసీపీ చీఫ్  వైఎస్ జగన్ ఆరోపించారు.

బుధవారం నాడు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన తర్వాత వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు.త్వరలోనే కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను  కలవనున్నట్టు జగన్ చెప్పారు. ఏపీ రాష్ట్రంలో  సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి సైబర్ క్రైమ్‌కు పాల్పడితే దొంగతనం కాదా అని జగన్ ప్రశ్నించారు.

దేశ, రాష్ట్ర చరిత్రలో ఏపీలో జరిగినట్టుగా సైబర్ క్రైమ్‌ జరగలేదని జగన్  అభిప్రాయపడ్డారు. రెండేళ్ల నుండి పద్దతి ప్రకారంగా ఎన్నికలను మేనేజ్  చేసేందుకు వీలుగా సైబర్ క్రైమ్‌కు పాల్పడినట్టుగా జగన్ చెప్పారు.

ఐటీ గ్రిడ్‌ అనే కంపెనీపై సోదాలు జరిగాయి,  ఈ సోదాల్లో టీడీపీకి చెందిన సేవా మిత్ర యాప్ ను ఈ సంస్థను తయారు చేసిందని జగన్ చెప్పారు.సేవా మిత్ర యాప్‌లో ఆధార్ వివరాలు దొరికినట్టుగా ఆయన చెప్పారు. టీడీపీకి చెందిన సేవా మిత్ర యాప్‌లో ప్రజల ఆధార్ డేటాతో పాటు ఓటరు గుర్తింపు కార్డుల వివరాలను కూడ పొందుపర్చినట్టుగా ఉందన్నారు.

సేవా మిత్ర యాప్‌లో ఓటరు గుర్తింపు కార్డుల మాస్టర్ కాపీ డేటా ఎలా వచ్చిందని ఆయన ప్రశ్నించారు.  బ్యాంకు ఖాతాల సమాచారం కూడ ఉన్నాయని జగన్ చెప్పారు.ఏపీ ప్రజలకు సంబంధించిన సమాచారం సేవా మిత్రలో ఎలా దొరుకుతోందని  ఆయన ప్రశ్నించారు. 

సేవా మిత్ర యాప్ ద్వారా టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లను పద్దతి ప్రకారంగా తొలగిస్తున్నారని జగన్ ఆరోపించారు. టీడీపీకి అనుకూలంగా ఉన్న ఓట్లను  అదనంగా చేర్పిస్తున్నారని చెప్పారు.

రాష్ట్రంలో 56 లక్షల డూప్లికేట్  ఓట్లు ఉన్నట్టు గుర్తించి కోర్టులో  కేసు దాఖలు చేసినట్టుగా జగన్ చెప్పారు. ఈ విషయమై కేంద్ర ఎన్నికల సంఘానికి కూడ ఫిర్యాదు చేశామన్నారు. అయితే ఈ ఫిర్యాదు చేసిన తర్వాత 3 లక్షల ఓట్లు దొంగ ఓట్లకు పెరిగాయన్నారు.

రెండేళ్లుగా ప్రజలకు సంబంధించిన వివరాలను ప్రైవేట్ వ్యక్తులకు అందించిన చంద్రబాబుకు ఒక్క క్షణం కూడ ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదన్నారు. ఈ విషయాలన్నింటిని గవర్నర్ దృష్టికి తీసుకొచ్చినట్టు జగన్ చెప్పారు. డూప్లికేట్ ఓట్లను తొలగించాలని ఫామ్-7 అప్లికేషన్లు ఇవ్వడం తప్పు ఎలా అవుతోందని జగన్ ప్రశ్నించారు.