హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఏదో జరుగుతోందని అసలు విషయాన్ని పక్కదారి పట్టించేందుకు చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్  ఆరోపించారు. ఐటీ గ్రిడ్ విషయం నుండి ప్రజల దృష్టిని మరల్చేందుకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సమస్యగా మార్చుతున్నారన్నారు.

బుధవారం నాడు రాజ్‌భవన్‌లో జగన్ గవర్నర్ నరసింహాన్‌ను కలిసిన తర్వాత  మీడియాతో మాట్లాడారు. ఐటీ గ్రిడ్ సంస్థ హైద్రాబాద్ కేంద్రంగా కార్యక్రమాలను నిర్వహిస్తోందని  జగన్ గుర్తు చేశారు. అందుకే హైద్రాబాద్‌లోనే ఫిర్యాదు చేసినట్టుగా ఆయన గుర్తు చేశారు.  

దొంగతనం ఎక్కడ జరిగితే అక్కడే ఫిర్యాదులు చేస్తారు కదా అంటూ జగన్ చెప్పారు. దొంగతనం ఒక్క చోట జరిగితే మరో చోట ఫిర్యాదు ఇస్తే కేసు నమోదు చేస్తారా అని  జగన్ ప్రశ్నించారు.

హైద్రాబాద్‌లో కేసు పెట్టడాన్ని చంద్రబాబునాయుడు రాద్దాంతం చేస్తున్నారని జగన్ విమర్శించారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య ఏదో జరిగిపోతోందని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.ఐటీ గ్రిడ్ కేసు విషయమై ప్రజల దృష్టిని మరల్చేందుకు రెండు రాష్ట్రాల మధ్య ఏదో జరుగుతున్నట్టుగా క్రియేట్ చేస్తున్నారని జగన్ బాబుపై విరుచుకుపడ్డారు.