ఎన్నికలు సమీపిస్తున్నవేళ.. జంప్ జలానీల సంఖ్య పెరిగిపోయింది. తాజాగా.. వైసీపీ మహిళా రాష్ట్ర విభాగం మాజీ అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి.. టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి లోకేష్ ఆమెకు పార్టీ కండువా కప్పి.. పార్టీలోకి ఆహ్వానించారు.

శనివారం ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో ఆమె పార్టీలో చేరారు. నిర్మ‌లాకుమారితోపాటు తూర్పుగోదావ‌రి జిల్లా కొత్త‌పేట నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన వైసీపీ నేత‌లూ టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె తన ఆవేదనను వ్యక్తం చేశారు.

వైసీపీలో తాను చాలా అవమానాలు భరించానని ఆమె చెప్పారు. ఇక వాటిని భరించలేక.. టీడీపీలో  చేరుతున్నట్లు ఆమె తెలిపారు. ఒక మ‌హిళ ఎన్నో త్యాగాలు చేస్తేగానీ, రాజ‌కీయాల‌లో ఎద‌గ‌లేద‌ని ఆమె అభిప్రాయపడ్డారు.

ఎన్నో క‌ష్ట‌న‌ష్టాల‌ కోర్చి పార్టీకి సేవ‌లు అందిస్తే నా ఆత్మాభిమానం దెబ్బ‌తీసేలా వైసీపీ అధిష్టానం వ్య‌వ‌హ‌రించిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ మ‌హిళా విభాగం రాష్ట్ర విభాగం అధ్య‌క్షురాలిగా, కృష్ణా-గుంటూరు జిల్లాల రీజిన‌ల్‌ కోఆర్డినేట‌ర్‌గా ప‌నిచేసిన తనకే ఇంత అవ‌మానం జ‌రిగితే వైసీపీలో సామాన్యుల ప‌రిస్థితి ఇంకెంత ద‌య‌నీయంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చని నిర్మలా కుమారి అన్నారు. 

 వైసీపీలో మ‌హిళ‌ల‌కు జ‌రుగుతున్న అన్యాయాల‌ను నిర‌సిస్తూ అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం రోజునే పార్టీకి రాజీనామా చేసినట్లు వివరించారు. తన   ఆత్మ‌గౌర‌వానికి ఎటువంటి ఇబ్బంది రానివ్వ‌ర‌నే ధీమాతో తెలుగుదేశం పార్టీలో చేరినట్లు చెప్పారు.