హైదరాబాద్: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ ఎంపీ, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ను లోటస్ పాండ్ లోని ఆయన నివాసంలో కలిశారు. 

గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన వైఎస్ జగన్ ను కలవడంపై రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి అత్యంత సన్నిహితులలలో ఒకరు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్. బుధవారం దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీ కండువా కప్పుకున్నారు. 

దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీ పంచన చేరి 24 గంటలు గడవకముందే ఆయన మిత్రుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ వైఎస్ జగన్ ను కలవడంపై జోరుగా చర్చజరుగుతోంది. అయితే ఒక పుస్తకం విషయంలో జగన్ తో మాట్లాడేందుకు మాత్రమే వచ్చానని తమ భేటీలో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని తెలిపారు. తనకు రాజకీయాలతో సంబంధం లేదని చెప్పారు.

గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో తెలుగుభాష అభివృద్ధి కోసం ఆయన పోరాటం చేస్తున్నారు. వారం రోజుల క్రితం రాజమహేంద్రవరంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలుగుభాష కోసం చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని ఆరోపించారు. రాజమహేంద్రవరం ప్రజలకు చంద్రబాబు నాయుడు వెన్నపోటు పొడిచారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్.