గుంటూరు జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. శనివారం సాయంత్రం స్కూలు ముగించుకుని స్నేహితులతో కలిసి కృష్ణా నదీ తీరంలో  సరదాగా గడపడానికి వెళ్లిన ఇద్దరు విద్యార్థులు ప్రమావశాత్తు మృత్యువాతపడ్డారు. స్నేహితులతో కలిసి నదీ స్నానానికి దిగి బాగా లోతులోకి వెళ్లడంతో ఇద్దరు విద్యార్థులు నీటమునిగారు. వీరిద్దరికి ఈత రాకపోవడంతో నీటిలో మునిగి ప్రాణాలు వదిలారు. 

ఈ విషాద సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా రేపల్లె మండలం కుమ్మరికుంట గ్రామానికి చెందిన ప్రణతయ్, నిజాంపట్నం మండలం తోటకూరవారిపాలెం గ్రామానికి చెందిన నరసింహలు పట్టణంలోని నారాయణ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నారు. అయితే త్వరలో స్కూలు వార్షికోత్సవం వుండటంతో వీరిద్దరు స్నేహితులతో కలిసి కల్చరల్ యాక్టివిటీస్ కోసం ప్రాక్టిస్ చేస్తూ సాయంత్రం వరకు స్కూల్లోనే వున్నారు. తర్వాత ఆదివారం సెలవురోజు కావడంతో స్నేహితులంతా కలిసి సమీపంలోని కృష్ణానదీ తీరంలో సరదాగ గడపడానికి వెళ్లారు. వీరితో పాటే ఈ ఇద్దరు కూడా వెళ్లారు. 

ఈ క్రమంలోనే  అక్కడ విద్యార్ధులంతా కలిసి కృష్ణా నదిలో స్నానానికి దిగారు. అయితే ప్రణతయ్, నరసింహాలు మాత్రం కాస్త లోతులోకి వెళ్లడంతో ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. వారిని కాపాడేందుకు మిగతా విద్యార్థులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. అయిదే కొద్దిసేపటి తర్వాత అక్కడికి వచ్చిన జాలర్లు నీటమునిగిన విద్యార్థులిద్దరిని బయటకు తీశారు. అప్పటికే ప్రణతయ్ మృతిచెందగా నరసింహ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. దీంతో వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా నరసింహ కూడా ప్రాణాలు వదిలాడు. 

స్థానిక పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. స్కూల్ కు వెళ్లిన కన్న కొడుకులు ఇలా శవాలుగా తిరిగిరావడంతో తల్లిందండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తారు.