వెనుకబడిన వర్గానికి చెందిన బిసిలకు ఏపి ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని..వారికి అండగా వుంటానని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ ప్రకటించిన విషయం తెలసిందే. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని బిసి లందరిని ఒక్కచోటికి చేర్చి గుంటూరులో ఓ బహిరంగ నిర్వహించడానికి తలసాని పూనుకున్నారు. ఈ నేపథ్యంలో మార్చి 3 న ఈ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించి...అందుకు ప్రభుత్వం నుండి అనుమతిని కోరారు. అయితే ఇప్పటివరకు ఆ సభకు ఎలాంటి అనుమతులు రాకపోవడంపై తలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

గుంటూరు బిసి సభపై పోలీస్ శాఖ నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో స్థానిక  డీఎస్పీని ఫోన్ ద్వారా సంప్రదించినట్లు తలసాని తెలిపారు. అయితే  ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సభకు అనుమతించడం లేదని చెప్పారని తలసాని పేర్కొన్నారు. శాంతియుతంగా బిసిల సమస్యలు, రాజకీయ చైతన్యం కోసం చేపట్టిన బహిరంగ సభకు ఇలా ముఖ్యమంత్రి అడ్డుతగలడం మంచిది కాదని తలసాని సూచించారు. 

గతంలో తెలంగాణలో సభలు పెడితే తాము అనుమతించలేదా? అని చంద్రబాబును తలసాని ప్రశ్నించారు. ఇండియాలో ఆంధ్ర ప్రదేశ్ భాగం కాదన్నట్లు చంద్రబాబు వ్యవహరిస్తున్నారని తలసాని మండిపడ్డారు. 

బిసి సభకు ప్రభుత్వం అనుమతించకుంటే కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకుంటామని తలసాని ప్రకటించారు. ఆ దిశగా కూడా చర్యలు ప్రారంభించినట్లు తలసాని వెల్లడించారు.