కేసీఆర్ గారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రుడన్నారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. జగన్ అక్రమాస్తుల వ్యవహారంపై ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ... విజయసాయిరెడ్డి, జగన్ తోడుదొంగలన్నారు.

విజయసాయిరెడ్డి దొంగతనం ఎలా చేయాలో ప్లాన్ గీస్తే జగన్ దానిని పక్కాగా ఫాలో అవుతారని బుద్దా ఫైరయ్యారు. జగన్‌ను కాపాడాల్సిందిగా సీబీఐ ప్రధాని నరేంద్ర మోడీ కార్యాలయం నుంచి హుకుం జారీ అయ్యిందని వెంకన్న ఆరోపించారు.

దానితో పాటు జగన్ ఏది చెబితే అది చేయమని కూడా సీబీఐని ప్రధాని ఆదేశించారని విమర్శించారు. అందుకు తగ్గట్టుగానే తెలుగుదేశం పార్టీ నేతలు, సానుభూతిపరులపై సీబీఐ దాడులు జరుగుతున్నాయని బుద్దా మండిపడ్డారు.

హిందూజా కంపెనీ భూములు జగన్‌ అండ్ కోకు కట్టబెట్టినట్లు సాక్ష్యాధారాలున్నాయని దీనిపై సమాధానం చెప్పాల్సిందిగా విజయసాయిరెడ్డికి వెంకన్న సవాల్ విసిరారు. లోటస్‌పాండ్‌లో ఇవాళ ఉదయం టిక్కెట్లు ప్రకటించాల్సిన కార్యక్రమాన్ని 16వ తేదీకి మార్చడానికి అసలు కారణం దొంగతనం బయటపడటమేనన్నారు.

దేశానికి నేను కాపలాదారుడినని మోడీ అంటున్నారని.. అయితే ఆయన దేశానికి కాపలాదారు కాదని జగన్ అవినీతికి కాపలాదారుడని వెంకన్న ఫైర్ అయ్యారు. జగన్ మోహన్‌రెడ్డి దగ్గర నుంచి ఎంత ముడుపులు తీసుకున్నారని ప్రధానిని ప్రశ్నించారు.

వైసీపీ నేతలు లోటస్‌పాండ్‌లో గజగజ వణుకుతున్నారని బుద్ధా తెలిపారు. జగన్‌ని వైసీపీని ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని బుద్ధా వెంకన్న ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. దోచుకోవాలన్నా, దోచుకున్నది జాగ్రత్తగా దాచుకోవాలన్నా వైసీపీలో చేరాలనుకుంటున్నారన్నారు.