విజయవాడ: డేటా చోరీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన తెలుగు సినీ హీరో శివాజీపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి టీజెఆర్ సుధాకర్ బాబు తీవ్రంగా మండిపడ్డారు.  మరో 40 రోజుల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఓట్ల తొలగింపు వ్యవహారంపై విచారణ చేయాల్సిన ప్రభుత్వం యూటర్న్‌ తీసుకుని డ్రామాలాడుతోందని ఆయన అన్నారు. 

సినిమా అవకాశాలు లేని నటుడు శివాజీతో చంద్రబాబు నాయుడు వాజమ్మ ప్రకటనలు చేయిస్తున్నాడని సుధాకర్ శనివారం మీడియా సమావేశంలో అన్నారు. గతంలో గరుడపురాణం పేరుతో కథలు చెప్పిన శివాజీ డేటా చోరీ వ్యవహారంపై కూడా పిచ్చి కూతలు కూస్తున్నాడని అన్నారు. 

తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ కోసం కేసీఆర్‌ కుట్రలు చేస్తున్నట్లు శివాజీ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ఇలాంటి థర్డ్‌ గ్రేడ్‌ వ్యక్తులకు కీ ఇచ్చి చంద్రబాబు ఆడిస్తున్నారని అన్నారు.

నేరం చేయనప్పుడు ఐటీ గ్రిడ్స్‌ డైరెక్టర్‌ అశోక్‌ ఎందుకు పరారీలో ఉన్నాడని సుధాకర్‌ బాబు ప్రశ్నించారు. ఎందుకు హైకోర్టులో పిటిషన్‌ వేశాడని అడిగారు. పెయిడ్‌ ఆర్టిస్ట్‌ శివాజీ పనీ పాట లేని వ్యక్తి అని అన్నారు.  అందుకే గుంటూరు జిల్లాలోని గురజాలలో శివాజీని బహిష్కరించారని చెప్పారు.

 ఓట్ల తొలగింపు వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకే చంద్రబాబు శివాజీని తెరపైకి తెచ్చారని ఆయన విమర్శించారు. ప్రజల వ్యక్తిగత డేటాను బజార్లో పెట్టిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని, టీడీపీ గుర్తింపును రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

సంబంధిత వార్తలు

కేసీఆర్ పని ఇదీ: డేటా చోరీపై హీరో శివాజీ సంచలన వ్యాఖ్యలు

కేసీఆర్ అంటే భయం, నా భార్య చేతులు పట్టుకుని ఏడ్చింది: హీరో శివాజీ