విజయవాడ: డేటా చోరీ వ్యవహారంపై సినీనటుడు శివాజీ కీలక వ్యాఖ్యలు చేశారు. డేటా చోరీ వ్యవహారం ఏదో అంతర్జాతీయ సమస్యలా, భారతదేశంలో తొలిసారిగా జరిగినట్లు రాజకీయ పార్టీలు ప్రచారం చేసుకుంటున్నాయని ఆరోపించారు. 

విజయవాడలో మీడియాతో మాట్లాడిన శివాజీ రాష్ట్ర విభజన అనంతరం ఓట్లపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ కు ఫోన్ చేసి వివరాలు సేకరించారని ఆరోపించారు. 2015 ఆగస్టు 8న ఈసీ సుమిత్ ముఖర్జీకి తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ లేఖ రాశారని గుర్తు చేశారు. 

ఓటర్ కి ఆధార్ నంబర్ లింక్ చేసే అంశంపై ఈసీకి భన్వర్ లాల్ లేఖ రాశారని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాలలో ఉన్న ఓట్లవివరాలపై ఎన్నికల ప్రధాన అధికారికి కేసీఆర్ ఫోన్ చేశారని ఆరోపించారు. 

జీహెచ్ఎంసీ పరిధిలో 40 లక్షల మంది సెటిలర్స్ ఉన్నారని తెలిపారు. ఈసికి, తెలంగాణ ప్రభుత్వానికి ఒప్పందంతోనే ఆధార్ నంబర్ లింక్ చేశారంటూ ఆరోపించారు హీరో శివాజీ. సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా ఓటర్లను తొలగించేందుకు కుట్ర చేశారంటూ ఆరోపించారు.

సమగ్ర కుటుంబ సర్వేను ఆధారంగా చేసుకుని ఓట్లు తొలగించారన్నారు. ఓట్లు తొలగించాలంటే ఎన్నికల సంఘం నుంచి అనుమతి తీసుకోవాలి కాబట్టే సమగ్ర కుటుంబ సర్వే, ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన డేటా బేస్ ను ఆధారంగా చేసుకుని ఓట్లు తొలగించే కుట్ర చేశారని శివాజీ ఆరోపించారు. 

సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించి ఫామ్ ప్రైవేట్ కంపెనీ డిజైన్ చెయ్యడమే అందుకు నాంది పలకడం జరిగిందని ఆరోపించారు. ఆ ప్రైవేట్ కంపెనీకి డేటా అంతా అందజేసి ఓట్ల కుంభకోణానికి పాల్పడింది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా అంటూ శివాజీ ప్రశ్నించారు. కేసీఆర్ కుట్రలను కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి ప్రశ్నించారని చెప్పుకొచ్చారు.  

ఐటీ గ్రిడ్ అనేది ప్రజల డేటా చోర్యం చెయ్యాలి అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు కేంద్రంగా చేసుకుంటారని ప్రశ్నించారు. ఓటుకు నోటు తర్వాత తెలంగాణలో ఇలాంటి ఓట్లు తొలగింపు ప్రక్రియకు తెరలేపే అవకాశం లేదన్నారు.