అమరావతి : తెలుగుదేశం పార్టీ వీడతారంటూ గత కొద్దిరోజులుగా వస్తున్న ప్రచారంపై గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తెరదించనున్నారా....? దాదాపు 6 నెలలుగా ఆయన పార్టీ వీడతారంటూ వస్తున్న ప్రచారంపై ఖండించడం కానీ అవునని కానీ ఏమీ స్పష్టం చెయ్యలేదు. 

వైసీపీలోకి వలసలు ప్రారంభమైన సందర్భంలో మోదుగుల పార్టీ వీడతారంటూ మళ్లీ రగడ మెుదలైంది. అప్పుడు కూడా మోదుగుల స్పందించలేదు. తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరిన నేతలపై టీడీపీ తీవ్ర వ్యాఖ్యలు చేస్తోంది. చంద్రబాబు సైతం పార్టీ వీడిన వారిపై అంతెత్తున ఎగిసిపడుతున్నారు. 

ఇలాంటి తరుణంలో తాను పార్టీ వీడేదాని కన్నా పార్టీ నుంచి వెళ్లిపోయే పరిస్థితులు కోసం ఎదురుచూశారు. మోదుగుల అనుకున్నట్లుగానే ఆయన ప్లాన్ వర్కవుట్ అయ్యింది. తెలుగుదేశం పార్టీ పొమ్మనకుండానే పొగబెట్టేసింది. 

గుంటూరు పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికలో గుంటూరు పశ్చిమనియోజకవర్గం అభ్యర్థుల పరిశీలనలో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పేరు లేకపోవడంతో ఆయన ఇక టీడీపీని వీడేందుకు రెడీ అవుతున్నారట.  గతంలో పార్టీ వీడితే ఏం చెప్పాలో అన్న పరిస్థితి నుంచి ఇప్పుడు ఎందుకు వీడాల్సి వస్తుందో, పార్టీ వీడేందుకు గలకారణాలు స్పష్టంగా ప్రజలకు వివరించే అవకాశం దొరికిందని మోదుగుల వర్గం అభిప్రాయపడుతోంది. 

ఇకపోతే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి 2009లో నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి గెలుపొందారు. 2014 ఎన్నికల సమయంలో మాజీమంత్రి గల్లా అరుణకుమారి కుటుంబం సైకిలెక్కింది. ఈ పరిణామాల నేపథ్యంలో గల్లా అరుణ కుమారి తనయుడు గల్లా జయదేవ్ కు గుంటూరు పార్లమెంట్ సీటు, గుంటూరు ఎంపీగా గతంలో గెలుపొందిన రాయపాటి సాంబశివరావును నరసరావుపేటకు పంపించారు చంద్రబాబు. 

ఈ పరిణామాల నేపథ్యంలో మోదుగులను పార్లమెంట్ కు కాకుండా అసెంబ్లీకి పంపించారు. 2014 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ టికెట్ కేటాయించారు చంద్రబాబు. ఆ ఎన్నికల్లో గెలుపొందిన మోదుగుల ఆది నుంచి అసంతృప్తి వెళ్లగక్కుతూనే ఉన్నారు. ఎంపీగా ఉన్న వ్యక్తిని తీసుకువచ్చి అసెంబ్లీలో కూర్చోబెట్టారంటూ గుర్రుగా ఉండేవారు. 

అయితే దాదాపు ఏడాది కాలంగా ఆయన టీడీపీ వీడతారంటూ ప్రచారం మెుదలైంది. ఇక గత 6నెలల నుంచి అయితే అదిగో చేరిపోతున్నారు ఇదిగో చేరిపోతున్నారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మెుదలైంది. అయితే పార్టీవీడే అంశంపై ఎలాంటి వ్యాఖ్యలు చెయ్యని మోదుగుల వేణుగోపాల్ రెడ్డి సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు వైఖరినే విమర్శించేవారు. 

దీంతో ఆయన పార్టీ వీడటం ఖాయమనే టీడీపీలో కూడా మెుదలైంది. తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు వైసీపీ గూటికి చేరడంతో మోదుగుల కూడా చేరతారని భావించిన టీడీపీ అధిష్టానం మోదుగులకు వ్యతిరేకంగా ర్యాలీలు, ధర్నాలు చేపట్టాలని సూచించింది. 

అధిష్టానం పిలుపుతో మోదుగుల తీరును నిరసిస్తూ టీడీపీ నేతలు నిరసనకు దిగారు. అయినా మోదుగుల అటు ఇటు ఎటూ కదలకుండా చూస్తూ మిన్నకుండిపోయారు. ఎన్నికలు సమీపిస్తున్నాయి. అభ్యర్థుల కేటాయింపులపై సీఎం చంద్రబాబు నాయుడు కసరత్తు ప్రారంభించారు. 

గుంటూరు జిల్లా గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని అభ్యర్థుల ఎంపికపై ఆదివారం చంద్రబాబు నాయుడు కసరత్తు చేపట్టారు. అందులో భాగంగా పలువురు నేతలతో సమావేశం అయ్యారు. అయితే గుంటూరు పశ్చిమ స్థానం అభ్యర్థి పరిశీలనలో తన పేరు లేకపోవడంతో అమీతుమీ తేల్చుకునేందుకు మోదుగుల సిద్ధమైనట్లు తెలుస్తోంది. 

గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థుల జాబితాలో కోవెలమూడి రవీంద్ర, మన్నవ మోహన్‌ కృష్ణ, చందు సాంబశివరావు పేర్లు ఉన్నాయే తప్ప తన పేరు లేకపోవడంతో ఆయన ఆగ్రహంతో రగిలిపోతున్నారట. దాదాపు గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో అభ్యర్థుల ఎంపిక పూర్తవ్వడంతో గుంటూరు ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు కీలక నేతలతో సమావేశం నిర్వహించారు. 

ఆ సమావేశంలో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పార్టీ వీడటం దాదాపు ఖరారైనట్లేనని చెప్పుకొచ్చారు. పార్టీ ఎమ్మెల్యే కావటంతో మోదుగుల వైఖరిని సహించాల్సి వచ్చిందని వివరించారు గల్లా జయదేవ్. చంద్రబాబు నేతృత్వంలో ఇటీవల జరిగిన పార్లమెంటరీ నియోజకవర్గ సమీక్షకు సైతం మోదుగుల డుమ్మాకొట్టడంతో ఇక ఆయన పార్టీ వీడటంపై క్లారిటీ వచ్చేసిందని గల్లా కార్యకర్తలతో చెప్పుకొచ్చారట. 

రాబోయే ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గంలో అందరిని కలుపుకొనిపోయే అభ్యర్థినే అధిష్టానం ప్రకటిస్తుందని స్పష్టం చేశారు. ఇకపోతే మోదుగులకు టికెట్ లేదని పరోక్షంగా చంద్రబాబు నాయుడు చెప్పెయ్యడంతో ఆయన వైసీపీలో చేరేందుకు ముహూర్తం చూసుకుంటున్నట్లు తెలుస్తోంది.