అమరావతి: 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా తాను వైసీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. టికెట్‌ ఇచ్చినా ఇవ్వకపోయినా తాను మాత్రం జగన్‌ సైనికుడినేనని తెలిపారు. 

బుధవారం హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆర్కే తన సీటు విషయంలో జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. జగన్ సీటు ఇవ్వనన్నారని తాను అలిగి అజ్ఞాతంలోకి వెళ్లానంటు వచ్చిన వార్తలను ఆయన తప్పుబట్టారు. 

ఒక కేసు విషయంలో సాక్ష్యాలు సేకరించడానికి నాలుగు రోజులు అజ్ఞాతం‌లో ఉన్నానే తప్ప సీటు విషయం గురించి కాదన్నారు. తాను అజ్ఞాతంలో ఉన్నప్పుడు తన అనుచరులు లోటస్ పాండ్‌కు వచ్చి గొడవ చేశారన్న విషయం తనకు తెలియదన్నారు. కౌన్సిలర్ల రాజీనామాను వెనక్కి తీసుకోవాలని కోరినట్లు ఎమ్మెల్యే ఆర్కే తెలిపారు.  

మరోవైపు ఏపీ డీజీపీ ఆర్.పీ ఠాకూర్ పై విరుచుకుపడ్డారు. చట్టాలను పరిరక్షించాల్సిన డీజీపీయే వాటిని ఉల్లంఘిస్తూ భూకబ్జాలకు పాల్పడితే ఎలా అంటూ నిలదీశారు. ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ అక్రమంగా హైదరాబాద్‌లో ఇంటి నిర్మాణం చేపట్టారంటూ ఆర్కే హైకోర్టులో పిటిషన్‌ వేశారు. 

ఈ పిటిషన్‌ విచారించిన హైకోర్టు ధర్మాసనం జీహెచ్‌ఎంసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆక్రమణలు తొలిగించాలని ఆదేశించిందని తెలిపారు. ఏపీ డీజీపీ ఇంటి అక్రమనిర్మాణంపై హైకోర్టు తీర్పును వైసీపీ స్వాగతిస్తోందన్నారు. సీఎం చంద్రబాబు అండగా ఉన్నారన్నధైర్యంతో ఠాకుర్‌ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 

2010లో డీజీపీ ఠాకుర్‌ ప్లాన్‌ అనుమతికి దరఖాస్తు చేసుకున్నారని, జీహెచ్‌ఎంసీ పర్మిషన్‌ రాకున్నా ఇంటి నిర్మాణం చేపట్టారని ఆరోపించారు. అక్రమంగా నిర్మాణాలు చేపట్టడమే కాకుండా పార్క్‌ స్థలాన్ని కూడా ఆక్రమించారని తెలిపారు. భారీస్థాయిలో ఇంటి నిర్మాణం చేపట్టిన డీజీపీకి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

ఈ అక్రమ నిర్మాణం విషయంలో జీహెచ్‌ఎంసీ అధికారులు ఇప్పటికే 2 నోటీసులు ఇచ్చారని, ఆ నోటీసులను డీజీపీ ఉల్లంఘించారని తెలిపారు. డీజీపీనే చట్టాలను ఉల్లంఘిస్తే ఎవరికి చెప్పాలని ప్రశ్నించారు. పసిపిల్లలు ఆడుకునే పార్క్‌ను కూడా అడ్డంగా కబ్జా చేస్తారా అంటూ ప్రశ్నించారు. 

న్యాయాన్ని కాపాడుకునేందుకు తాము కోర్టుకు వెళ్లామని, చట్టాలను గౌరవించాల్సిన బాధ్యత ఓ డీజీపీగా ఠాకుర్‌ ఉందా లేదా అని నిలదీశారు. అవినీతి చేస్తూ చట్టాలను కాపాడతామని అబద్ధాలు చెబుతున్నారని, పోలీస్‌ బాస్‌ అయితే ఆక్రమణలు చెల్లుతాయా? అంటూ మండిపడ్డారు.