వైసీపీ అధినేత జగన్  ఇటీవల ఏపీలో నూతన గృహప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. కాగా.. దీనిపై  ఏపీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ముందుగా జగన్ కి శుభాకాంక్షలు తెలిపిన లోకేష్.. ఆ వెంటనే సెటైర్లు వేశారు. నూతన గృహ ప్రవేశం చేసి.. ఒక్క రోజు కూడా అమరావతిలో ఉండకుండానే లోటస్ పాండ్ కి వెళ్లిపోయారని విమర్శించారు.

జగన్ గృహప్రవేశం చేసిన వెంటనే ఏపీకి రైల్వే జోన్ వచ్చిందని.. ఏపీకి అన్నీ శుభపరిణామాలేనంటూ వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని కూడా లోకేష్ ట్విట్టర్ వేదికగా తిప్పి కొట్టారు.

‘‘మీరు అడుగుపెట్టగానే రైల్వేజోన్ వచ్చింది అని వైకాపా నాయకులు స్వీట్లు పంచుకున్నారు. మీ గృహ‌ప్ర‌వేశానికి మోడీ గారు  రైల్వేజోన్ కానుక‌గా ఇచ్చారని  సంబురాలు చేసుకుంటున్నారు.’’ అని లోకేష్ ట్వీట్ చేశారు. 

‘‘మీ గృహ‌ప్ర‌వేశం సంద‌ర్భంగా.. ఏడాదికి రూ.6500 కోట్లు ఆదాయం తెచ్చే వాల్తేరు డివిజ‌న్‌ని ఒడిశాకి మోడీ గారు కానుకగా ఇచ్చి రాష్ట్రానికి అన్యాయం చేసారు. మోడీ గారితో జోడి కట్టి రైల్వేజోన్ కుట్రలో మీరు భాగస్వామ్యం అయ్యారు అని తేలిపోయింది.’’ అని మరో ట్వీట్ చేశారు.