హైదరాబాద్: తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది అన్న చందంగా తయారైంది టీడీపీ నేత చంద్రబాబు నాయుడు పరిస్థితి. కడప జిల్లాకు చెందిన మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించి మైదుకూరు నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యించాలని ప్లాన్ వేశారు. 

అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మైదుకూరు టికెట్ ఆశిస్తున్న పుట్టా సుధాకర్ యాదవ్ ను బుజ్జగించడం కూడా చేసేశారు. డీఎల్ రవీంద్రారెడ్డి అయితే గెలవడం తథ్యమంటూ జిల్లాకు చెందిన మంత్రి ఆదినారాయణరెడ్డి సైతం మద్దతు పలికారు. 

అయితే చంద్రబాబు నాయుడు డీఎల్ రవీంద్రారెడ్డి విషయంలో ఒకటి తలిస్తే మాజీమంత్రి మరోకటి తలిచారు. మైదుకూరులో కార్యకర్తలతో సమావేశం అయిన డీఎల్ తాను ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో చేరబోనని షాక్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ పాలన అంతా అవినీతిమయం అంటూ ధ్వజమెత్తారు. 

టీడీపీని భూస్థాపితం చెయ్యడమే లక్ష్యంగా పనిచేస్తానంటూ చెప్పుకొచ్చారు. మరోవైపు వైసీపీని తిట్టి పోశారు. తాను వైసీపీలో కూడా చేరడం లేదని స్పష్టం చేశారు డీఎల్. ప్రజల కోసం తాను పోరాటం చేస్తానని తాను ప్రజల పక్షమని చెప్పుకొచ్చారు మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి. నిన్న మెన్నటి వరకు పార్టీలో చేరతారంటూ ఆశగా ఎదురుచూసిన చంద్రబాబుకు మాజీమంత్రి డీఎల్ ఇచ్చిన ఝలక్ తో ఖంగుతిన్నట్లైంది.