ఐటీ గ్రిడ్ సంస్థ వ్యవహారం ఇపుడు ఇరు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. తమ ప్రభుత్వ వ్యవహారాల్లో తెలంగాణ ప్రభుత్వం తలదూర్చుతోందంటూ చంద్రబాబు...చట్ట ప్రకారమే డాటా చోరీపై చర్యలు తీసుకుంటున్నట్లు టీఆర్ఎస్ ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో ఐటీ గ్రిడ్ కంపనీ సీఈవో అశోక్ కుమార్ ఈ కేసులో కీలకంగా మారారు. అయితే ఈ వ్యవహారానికి సంబంధించిన అసలు నిజాలను త్వరలో అశోక్ కుమార్ ప్రజలకు వివరించనున్నాడని చంద్రబాబు తాజాగా ప్రకటించారు. 

ఐటీ గ్రిడ్ వ్యవహారంపై చంద్రబాబు మాట్లాడుతూ...అశోక్ అనే ఓ సాధారణ వ్యక్తి 10 సంవత్సరాలు కష్టపడి ఓ ఐటీ కంపనీని వృద్దిలోకి తెచ్చాడని అన్నారు. కానీ టిడిపి ఐటీ వ్యవహారాల్లో ఔట్ సోర్సింగ్ పద్దతిలో సహకారం అందిస్తోందన్ని ఒకే ఒక్క కారణంతో ఈయనకు సంబంధించిన ఐటీ గ్రిడ్ కంపనీపై దాడులు జరిగాయని ఆరోపించారు. ఏకంగా అతను పారిపోయాడని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. సరైన సమయంలో అశోక్ ఈ మొత్తం కుట్రకు సంబంధించిన అసలు నిజాలను బయటపెడతాడని చంద్రబాబు అన్నారు. 

ఇలా తమ డాటాను చోరి చేసిన తెలంగాణ ప్రభుత్వం రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష వైఎస్సార్‌సిపితో కలిసి కుట్రలు పన్నుతోందన్నారు. ఏపీలో జరిగే ఎన్నికలు టిడిపి వర్సెస్ టీఆర్ఎస్ మధ్య జరగనున్నాయని పేర్కొన్నారు. ఆంధ్ర ప్రజలను అవమానించిన కేసీఆర్ పంచన చేరి జగన్ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఇలాంటి కుట్రలను తిప్పికొట్టడానికి ఏపి ప్రజలు సిద్దంగా లేరని చంద్రబాబు పేర్కొన్నారు.