అమరావతి : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు ఏపీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ పై కుట్రలు కుతంత్రాలు జరిపేందుకు వైఎస్ జగన్ టీఆర్ఎస్ పార్టీతో జతకట్టారని ఆరోపించారు. 

జగన్‌తో కలిసి కేటీఆర్ తన అస్త్రాలను ప్రయోగిస్తున్నారంటూ మండిపడ్డారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన 18 నెలలు జైల్లో ఉన్నా సరే జగన్ మైండ్‌సెట్ ఏమాత్రం మారలేదన్నారు. జగన్ కు బుద్ధి రాదంటూ ధ్వజమెత్తారు. 

తమ పార్టీకి సంబంధించిన డేటా హైదరాబాద్‌లో ఉంచుకుంటే నేరమా అంటూ నిలదీశారు. టీడీపీ ఓట్లు తొలగించాలని వారు చేస్తోన్న కుట్రలు బయటపడ్డాయని చెప్పుకొచ్చారు. డేటా చోరి విషయంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీపీ సజ్జనార్, రాజేందర్ రెడ్డి బుర్ర ఉండే మాట్లాడుతున్నారా అంటూ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు.