Asianet News TeluguAsianet News Telugu

కోవిడ్‌పై పోరాటం: ఏపీకి 10 అంబులెన్స్‌లు, 4 వేల పీపీఈ కిట్లు అందించిన జీ ఎంటర్‌టైన్‌మెంట్స్

జీ మీడియా – ఎంటర్టైన్మెంట్ పవర్‌హౌస్‌ జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ (జీ) , కోవిడ్‌–19కు వ్యతిరేకంగా తమ జాతీయ కార్పోరేట్‌ సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా అధికారికంగా 10 అంబులెన్సులు, 4,000 పీపీఈ కిట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందజేసింది

ZEE Fights Covid-19: Zee Group donates 10 ambulances, 4k PPE kits for AP Govt KSP
Author
Vijayawada, First Published Oct 14, 2020, 5:44 PM IST

జీ మీడియా – ఎంటర్టైన్మెంట్ పవర్‌హౌస్‌ జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ (జీ) , కోవిడ్‌–19కు వ్యతిరేకంగా తమ జాతీయ కార్పోరేట్‌ సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా అధికారికంగా 10 అంబులెన్సులు, 4,000 పీపీఈ కిట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందజేసింది.

ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని,  ఏపీఐఐసీ చైర్మన్ ఆర్. కే. రోజా , వైయస్ఆర్ ఆరోగ్య శ్రీ హెల్త్ ట్రస్ట్ సీఈవో డాక్టర్ మల్లికార్జున, అదనపు సీఈవో బి. రాజశేఖర్ రెడ్డి సమక్షంలో అంబులెన్స్‌లను, సామాగ్రిని అందించింది. జీ మీడీయా సంస్థ కేటాయించుకున్న సీఎస్‌ఆర్‌ బడ్జెట్‌ (కోవిడ్‌–19తో పోరాటం చేసేందుకు) నుంచి ఏపీకి ఈ సామాగ్రిని అందజేసింది.

దీనిపై సంస్థ సీఈవో, ఎండీ పునీత్‌ గోయెంకా మాట్లాడుతూ ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంపై దృష్టి కేంద్రీకరించి, కోవిడ్‌–19తో జరుగుతున్న పోరాటంలో ఏపీ ప్రభుత్వానికి బలమైన మద్దతునందించడానికి జీ కట్టుబడి ఉందన్నారు.

 

ZEE Fights Covid-19: Zee Group donates 10 ambulances, 4k PPE kits for AP Govt KSP

 

ఈ మహమ్మారి వేళ రాష్ట్రానికి ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించడంలో తామందించే ఆరోగ్య సంరక్షణ పరికరాలు ఆరోగ్య పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి మరింత దోహదపడతాయని తాము ఆశిస్తున్నామని అన్నారు.

మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు అంబులెన్సులు, పీపీఈ కిట్లను అందించిన జీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేశారు. కోవిడ్ - 19 కు వ్యతిరేకంగా వారి పోరాటాన్ని బలోపేతం చేయడంలో వారు భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు సహాయం చేశారని ఆయన కొనియాడారు. ఇలాంటి కార్యక్రమం చేపట్టిన జీ నెట్‌వర్క్ ఎండీ పునీత్ గోయెంకాను పేర్నీ నాని ప్రశంసించారు. 

ఏపీఐఐసీ చైర్మన్ ఆర్. కే. రోజా మాట్లాడుతూ రాష్ట్రంలో కోవిడ్ -19 ఉపశమనం కోసం ప్రయతిస్తున్న ఈ సమయంలో తమకు అండగా నిలిచిన పునిత్ గోయెంకా, జీ ఎంటర్టైన్మెంట్ కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా చేస్తున్న ఈ యుద్ధంలో త్వరలోనే అందరం గెలవాలని రోజా ఆకాంక్షించారు.

కోవిడ్‌–19కు వ్యతిరేకంగా దేశంలో ఆరోగ్య సంరక్షణ మౌలికవసతులను మెరుగుపరిచేందుకు తమ దేశవ్యాప్త సీఎస్‌ఆర్‌ డ్రైవ్‌లో భాగంగా, 240కు పైగా అంబులెన్సులు, 46 వేల పీపీఈ కిట్లు, 90కు పైగా ఆక్సిజన్‌ హ్యుమిడిఫయర్లు, 6 లక్షలకు పైగా రోజువారీ భోజనాలను అందించడానికి జీ కట్టుబడింది.

ఈ విరాళాన్ని ఈ జాతీయ స్థాయి సీఎస్‌ఆర్‌ డ్రైవ్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు అందించారు. జాతీయ స్ధాయిలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కంపెనీలో పనిచేస్తున్న 5వేల మంది రోజువారీ కూలీలకు కంపెనీ ఆర్థికంగా మద్దతునందించింది. అంతేకాకుండా, 3400 మందికి పైగా ఉద్యోగులు పీఎం కేర్స్‌ ఫండ్‌కు తమ వంతు తోడ్పాటునందించారు.

ఉద్యోగులు అందించిన మొత్తాలకు సమానమైన మొత్తాన్ని జీ సంస్థ జత చేసి దానిని పీఎం కేర్స్‌ ఫండ్‌కు విరాళంగా అందించింది. బాధ్యతాయుతమైన మీడియా మరియు ఎంటర్టైన్మెంట్ సంస్ధగా, కోవిడ్‌–19తో పోరాటాన్ని తీవ్రతరం చేయడానికి అవసరమైన బలమైన చర్యలను కొనసాగిస్తామని జీ స్పష్టం చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios