Asianet News TeluguAsianet News Telugu

వైఎస్సార్ తోడల్లుడు కావడం వల్లే ఇరికించారు.. ఆ కేసును కొట్టివేయండి: హైకోర్టును కోరిన వైవీ సుబ్బారెడ్డి

ఇందూ ప్రాజెక్ట్స్‌కు ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డు భూముల కేటాయింపులకు సంబంధించిన సీబీఐ ఛార్జిషీట్‌లో వైవీ సుబ్బారెడ్డిని నిందితుడిగా చేర్చారు. అయితే సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ వైవీ సుబ్బారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ విచారించారు. 

yv Subba Reddy urges telnagna HC Quash CBI case against him
Author
First Published Aug 28, 2022, 11:36 AM IST

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో తనపై ఉన్న కేసును రద్దు చేయాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలంగాణ హైకోర్టును కోరారు. ఇందు శ్యామ్ ప్రసాద్ రెడ్డికి చెందిన ఇందూ ప్రాజెక్ట్స్‌కు ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డు భూముల కేటాయింపులకు సంబంధించిన సీబీఐ ఛార్జిషీట్‌లో వైవీ సుబ్బారెడ్డిని నిందితుడిగా చేర్చారు. అయితే సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ వైవీ సుబ్బారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ విచారించారు. 

దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఇందు శ్యామ్ ప్రసాద్ రెడ్డికి హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో 70 ఎకరాల భూమిని ఏపీహెచ్‌బీ ఇచ్చిందని సీబీఐ న్యాయవాది కోర్టుకు నివేదించారు. ‘‘విల్లాలు, మధ్యతరహా, తక్కువ ఆదాయ వర్గాలకు చెందిన గృహాల‌తో పాటు అనేక రకాల గృహాలను నిర్మించడానికి ఈ భూములకు అనుమతి ఇవ్వబడింది. ఇందూ ప్రాజెక్ట్స్ ప్రమోటర్ అయిన శ్యామ్ ప్రసాద్ రెడ్డి.. ఇందూ ప్రాజెక్ట్‌లకు అర్హతలు లేకపోయినా హౌసింగ్ ప్రాజెక్ట్‌లను పొందేందుకు వసంత కృష్ణ ప్రసాద్ వసంత ప్రాజెక్ట్‌లను స్పెషల్ పర్పస్ వెహికల్‌గా ఉపయోగించారు’’ అని సీబీఐ పేర్కొంది.గచ్చిబౌలి సైట్‌లో నిర్మించిన విల్లాలను కృష్ణప్రసాద్, సుబ్బారెడ్డి తమ కుటుంబాలకు తక్కువ ధరకే ఇచ్చారని సీబీఐ న్యాయవాది ఆరోపించారు. 

సీబీఐ ప్రకారం.. ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వ భూమిని స్వీకరించడానికి బదులుగా వైఎస్ జగన్ వ్యాపారానికి శ్యామ్ ప్రసాద్ రెడ్డి 70 కోట్ల రూపాయలను అందించారు. వసంత్ ప్రాజెక్ట్స్ గచ్చిబౌలి సైట్‌లో తన వాటాను వైవీ సుబ్బారెడ్డికి బదిలీ చేసిందని ఆరోపించింది. కూకట్‌పల్లిలో వసంత్‌ ప్రాజెక్ట్స్‌కు మరో హౌసింగ్‌ ప్రాజెక్ట్‌ కేటాయింపునకు ఈ బదిలీ క్విడ్‌ ప్రోకో అని ఆరోపిస్తూ వైవీ సుబ్బారెడ్డిపై సీబీఐ కేసు నమోదు చేసింది.

అయితే  ఈ కేసులో సీబీఐ వాదనలను వైవీ సుబ్బారెడ్డి తరఫు న్యాయవాది వివేక్ రెడ్డి తోసిపుచ్చారు. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తోడల్లుడు కాబట్టే తన క్లయింట్‌పై సీబీఐ కేసు నమోదు చేసిందని వాదనలు వినిపించారు. వైవీ సుబ్బారెడ్డిని సీబీఐ తప్పుగా ఇరికించిందని అన్నారు. వివిధ కారణాల వల్ల ప్రాజెక్ట్ ఆగిపోవడంతో కొనసాగించడం సాధ్యం కాదని భావించిన వసంత్ ప్రాజెక్ట్స్ తన వాటాను విక్రయించిందని వాదనలు వినిపించారు. ప్రతిఫలంగానే ఇందూకు కూకట్ పల్లిలో అదనంగా 15 ఎకరాలు కేటాయించటానికి ఒత్తిడి తెచ్చరనే వాదనలో వాస్తవం లేదని చెప్పారు. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. తదుపరి విచారణను సెప్టెంబర్ 8కి వాయిదా వేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios