తిరుపతి: ఒంగోలు మాజీ పార్లమెంటు సభ్యుడు, బాబాయ్ వై.వి. సుబ్బారెడ్డికి కీలకమైన పదవిని అప్పగించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధపడినట్లు చెబుతున్నారు.  ఆయనకు ఒంగోలు లోకసభ సీటును వైఎస్ జగన్ నిరాకరించారు. అయితే, ఆయనకు సముచితమైన స్థానం కల్పించాలనే ఆలోచనలో ఉన్నారు.

కీలకమైన పదవిని కట్టబెట్టి రాష్ట్ర వ్యవహారాలకు వైవీ సుబ్బారెడ్డిని వాడుకోవాలని జగన్ ఆలోచిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలిని రద్దు చేయాలని ముఖ్యమంత్రి అనుకుంటున్నారు. పాలక మండలిని రద్దు చేసి వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్ గా నియమించే ఆలోచనలో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు.
 
ఈసారి ఎన్నికల్లో ఆయనను తప్పించి మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఒంగోలు లోక్‌సభ నుంచి పోటీ చేసే అవకాశాన్ని జగన్ కల్పించారు. దాంతో వైవీ అలక వహించారు. అయితే, ఆ తర్వాతి కాలంలో చురుగ్గా పనిచేయడం ప్రారంభించారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు జగన్‌ బాలినేని శ్రీనివాసరెడ్డికి మంత్రి పదవి ఇవ్వనున్నారు. 

వైవీని రాజ్యసభకు ఎంపిక చేసి కేంద్రంలో అవసరమైన విధంగా వినియోగించుకుంటారని భావించారు. కానీ ఆ విషయంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర పరిధిలోని వ్యవహారాలన్నీ విజయసాయిరెడ్డి చూస్తున్నారు. ఆయనకు మరొకరిని పోటీగా దించడం కన్నా వైవీ సుబ్బారెడ్డికి రాష్ట్రస్థాయిలోనే మంచి పదవిని ఇచ్చి రాష్ట్ర వ్యవహారాల్లోనే వినియోగించుకోవాలనే ఆలోచనకు జగన్ వచ్చినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే వైవీని టీటీడీ చైర్మన్ గా నియమించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
 
ప్రస్తుత టీటీడీ ఛైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ రాజీనామా చేయడానికి నిరాకరిస్తున్నారు. కావాలంటే, ప్రభుత్వం పాలక మండలిని రద్దు చేసుకోవచ్చునని ఆయన అన్నారు. దీంతో పాలక మండలిని రద్దు చేసేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధమైంది. మరో రెండు మూడు రోజుల్లో టిటిడీ పాలకమండలిని తొలగించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.