తుది జాబితా వేరే ఉంది.. అప్పటివరకు అందరూ సమన్వకర్తలే.. : వైవీ సుబ్బారెడ్డి సంచలనం
వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పటివరకు జాబితాల్లో పేరున్న అభ్యర్థుల్లో కొత్త కన్ ఫ్యూజన్ మొదలయ్యింది.
అమరావతి : ఇటీవల కాలంలో వై వి సుబ్బారెడ్డి తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సంచలనంగా మారుతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ అభ్యర్థుల గురించి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారాయన. ఇప్పటివరకు వైసీపీ ఏడు జాబితాలో విడుదల చేసి అభ్యర్థులను ప్రకటించినా.. వారంతా సమన్వయకర్తలు మాత్రమేనని… ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైనా దీనికిందికే వస్తారని అన్నారు. ఆఖరి సిద్ధం సభ తర్వాత అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేస్తామని ఆ జాబితాలో చోటు దక్కిన వాళ్ళు మాత్రమే అభ్యర్థులు అని తేల్చి చెప్పారు.
అభ్యర్థులను ప్రకటించడం కోసం చంద్రబాబు నాయుడు సుదీర్ఘ కసరత్తు చేయాల్సి వచ్చింది అంటేనే తమ వైసిపి అభ్యర్థులు ఎంత బలంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చంటూ మాట్లాడారు. ఇంకా 40 స్థానాల వరకు టీడీపీకి అభ్యర్థులు లేరని వారిని వెతుక్కునే పనిలో ఉన్నారని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోలేదని…కేవలం చంద్రబాబు కళ్ళల్లో బంగారు భవిష్యత్తు చూడడం కోసమే ఆలోచిస్తున్నాడని.. అందుకే కేవలం 24 సీట్లకే పరిమితమయ్యాడని.. వై వి సుబ్బారెడ్డి ఎద్దేవా చేశారు.
పావలా వంతుకు కూడా పనికిరావని తేల్చేసారు.. ఛీ - పవన్ కల్యాణ్ పై అంబటి సెటైర్లు..
వైసిపి ప్రభుత్వం వల్ల మేలు జరిగితేనే ఓటు వేయమని చెప్పే ధైర్యం వైయస్ జగన్ కు తప్ప వేరే వాళ్లకు లేదన్నారు. అరాచకంగా ఉండే అభ్యర్థులకు టికెట్ ఇచ్చే సంస్కృతి తమ పార్టీలో లేదని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్లో షర్మిల వచ్చిన తర్వాత కాంగ్రెస్లో కొత్త ఊపు వస్తుందని ప్రచారం చేశారని, కానీ, షర్మిల వచ్చినా.. రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసిన కాంగ్రెస్ ను ఎవ్వరూ పట్టించుకోరని చెప్పుకొచ్చారు. టిడిపి, జనసేన, బిజెపి, కాంగ్రెస్, వామపక్షాలు ఇలా ఎన్ని కూటములు వచ్చినప్పటికీ అంతిమ విజయం వైసీపీదేనంటూ చెప్పుకొచ్చారు.