పావలా వంతుకు కూడా పనికిరావని తేల్చేసారు.. ఛీ - పవన్ కల్యాణ్ పై అంబటి సెటైర్లు..
టీడీపీ -జనసేన పార్టీలు శనివారం ఉమ్మడి అభ్యర్థుల జాబితాను విడుదల చేశాయి. ఇందులో టీడీపీకి స్థానాలు ఉండగా.. జనసేనకు 24 స్థానాలు మాత్రమే ఉన్నాయి. దీంతో పవన్ కల్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దాని కోసం ఏపీలోని అన్ని ప్రధాన పార్టీలు సన్నదమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డాయి. ఎప్పటికే వైసీపీ మూడు జాబితాలుగా ఆయా నియోజకవర్గాలకు ఇంఛార్జ్ లను ప్రకటించాయి. తాజాగా తెలుగుదేశం, జనసేన పార్టీలు మొదటి ఉమ్మడి జాబితాను ప్రకటించాయి.
ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు కలిసి ఉమ్మడి అభ్యర్థుల జాబితాను నేటి (శనివారం) విడుదల చేశారు. మొత్తంగా 118 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో టీడీపీ నుంచి 94 మంది అభ్యర్థులు ఉండగా.. జనసేన నుంచి 24 మంది అభ్యర్థులు ఉన్నారు. బీజేపీతో పొత్తు అంశం తేలిన తరువాత మిగిలిన సీట్ల విషయంలో అభ్యర్థులను ప్రకటించనున్నారు.
అయితే జనసేనకు 24 సీట్లు మాత్రమే కేటాయించడంపై వైసీపీ నాయకుడు, మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) హ్యాండిల్ లో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘పల్లకి మోయడానికి తప్ప
పావలా వంతుకు కూడా పనికిరావని తేల్చేసారు.... ఛీ’’ అని సెటైర్లు వేస్తూ పవన్ కల్యాణ్ ను ట్యాగ్ చేశారు.
మరో వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పవన్ కల్యాణ్ పై విమర్శలు చేశారు. జనసేనకు 24 స్థానాలు మాత్రమే కేటాయించడంపై ఆయన స్పందిస్తూ.. పవన్ కల్యాణ్ తనకు బలం లేదని ఒప్పుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు జనసేనను మింగేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ అనుబంధ విభాగంగా జనసేన మారిందని విమర్శించారు. జనసేన అభ్యర్థులుగా ఎవరు ఉండాలనే విషయం కూడా టీడీపీ అధినేత నిర్ణయిస్తున్నారని ఆరోపించారు. పవన్ కల్యాణ్ టీడీపీకి ఉపాధ్యక్షుడిగా మారితే బాగుంటుందని విమర్శలు గుప్పించారు.