Asianet News TeluguAsianet News Telugu

జగన్ ఆలోచన: వైవీ సుబ్బారెడ్డికి టికెట్ గల్లంతు

రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో అర్థం కాదు. గడిగడికి రాజకీయాల్లో అంచనాలు తారుమారవుతుంటాయి. టికెట్ ఆశించని వారికి ఆకస్మాత్తుగా టికెట్ వచ్చేయోచ్చు. ఎన్నాళ్లు నుంచో పార్టీని అంటిపెట్టుకున్న వారికి టికెట్ రాకపోవచ్చు. ఇవన్నీ రాజకీయాల్లో నిత్యం జరిగే పరిణామాలు. 

YV Subba Reddy may not get ticket in coming elections
Author
Ongole, First Published Nov 12, 2018, 2:41 PM IST

ప్రకాశం: రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో అర్థం కాదు. గడిగడికి రాజకీయాల్లో అంచనాలు తారుమారవుతుంటాయి. టికెట్ ఆశించని వారికి ఆకస్మాత్తుగా టికెట్ వచ్చేయోచ్చు. ఎన్నాళ్లు నుంచో పార్టీని అంటిపెట్టుకున్న వారికి టికెట్ రాకపోవచ్చు. ఇవన్నీ రాజకీయాల్లో నిత్యం జరిగే పరిణామాలు. 

ఆయా సామాజిక, ఆర్థిక, ప్రజా బలాలను బేరీజు వేసుకుని అభ్యర్థులను మార్చేస్తుంటారు. తాజాగా ఇదే కోవలో చేరిపోయారు వైసీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. వచ్చే ఎన్నికల్లో వైవీకి టిక్కెట్ కష్టమేనని తెలుస్తోంది. వైవీ సుబ్బారెడ్డిని ఇక పార్టీకే పరిమితం చెయ్యాలని జగన్ భావిస్తున్నారట. గత ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా గెలుపొందిన వైవీ సుబ్బారెడ్డి ప్రత్యేక హోదా పోరులో తన పదవికి రాజీనామా చేశారు. ప్రత్యేక హోదా కోసం తన పదవిని వదులుకుని మాజీ ఎంపీ అయ్యారు. 

ఇకపోతే వైవీ సుబ్బారెడ్డికి ఈసారి టికెట్ ఇచ్చే అవకాశం లేనట్లు పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన ఆయనకు ఈసారి జగన్ ఆయన్ను పార్టీకే పరిమితం చేయనున్నారు. వైవీ స్థానంలో టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ అవ్వబోతున్న మాగుంట శ్రీనివాసుల రెడ్డికి ఇచ్చేందుకు రెడీ అయ్యారు.    

వైవీ సుబ్బారెడ్డి స్థానంలో ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి త్వరలోనే వైసీపీలోకి జంప్ అవుతారనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో జగన్ వైవీని తప్పించి మాగుంట  శ్రీనివాసులరెడ్డికి ఎంపీ టికెట్ ఇస్తారని సమాచారం. మాగుంట కుటుంబ గత మూడు దశాబ్ధాలుగా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. 

కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగారు. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో మాగుంట శ్రీనివాసుల రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకుని ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. వైసీపీ అభ్యర్థి వైవీ సుబ్బారెడ్డి చేతిలో 13వేల ఓట్లతో పరాజయం పాలయ్యారు.

పార్లమెంట్ అభ్యర్థిగా ఓటమి చెందిన మాగుంట శ్రీనివాసుల రెడ్డిని సీఎం చంద్రబాబు ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించారు. చంద్రబాబు ఎమ్మెల్సీ ఇచ్చినా పార్టీలో మాగుంట ఇమడలేకపోతున్నారన్నది వాస్తవం. ఇకపోతే మాగుంట ఎమ్మెల్సీ అయిన తర్వాత ఏపీ కేబినేట్ లో తనకు మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు. అది నెరవేరలేదు. 

కనీసం టీటీడీ చైర్మన్ పదవి అయినా దక్కుతుందని ఆశించారు. అది నెరవేరలేదు. దీంతో ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అటు టీడీపీ నేతలు సైతం మాగుంటను అంతగా కలుపుకుపోవడం లేదని మనస్థాపానికి గురవుతున్నారట. పదవులిచ్చి గౌరవించినా కార్యకర్తలు తనను కలుపుకోకపోవడంతో ఆయన ఆందోళన చెందుతున్నారు. 

ఈ నేపథ్యంలో మాగుంట శ్రీనివాసుల రెడ్డి వైసీపీలో చేరేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ తో టచ్ లో ఉన్నట్లు సమాచారం. ఒకవేళ మాగుంట శ్రీనివాసుల రెడ్డి పార్టీలో చేరితో ఖచ్చితంగా ఆయనకు ఒంగోలు ఎంపీ టికెట్ ఇస్తారని ప్రచారం. 

మాగుంటకు ఒంగోలు ఎంపీ టిక్కెట్ ఇస్తే వైవీ సుబ్బారెడ్డి పరిస్థితి ఏంటనేది అందరీ ప్రశ్న. అయితే వైవీ సుబ్బారెడ్డికి పార్టీ కీలక బాధ్యతలు అప్పగించాలని జగన్ యోచిస్తున్నారట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న వైవీ సుబ్బారెడ్డి రాబోయే ఎన్నికల్లో ఎన్నికల మేనేజ్మెంట్ టీమ్ బాధ్యతలు నిర్వహించబోతున్నారని ప్రచారం. 

ఈ నేపథ్యంలో వైవీ సుబ్బారెడ్డి ప్రత్యక్ష ఎన్నికల్లో దిగితే ఆయన సేవలు ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి మాత్రమే పరిమితమవుతాయని అలా కానీ పక్షంలో ఆయన సేవలను రాష్ట్రమంతటా వినియోగించుకోవచ్చని వైసీపీ నాయకత్వం ఆలోచిస్తోంది. 

వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలో వైఎస్ జగన్ ఒక ఎన్నికల మేనేజ్ మెంట్ టీమ్ ను నియమించనుందని తెలుస్తోంది. ఆ బృందంలో వైవీతోపాటు విజయసాయిరెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ధర్మాన ప్రసాద్ రావు, అంబటి రాంబాబు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, పార్థసారథి వంటి వారిని నియమించనుంది.  

అయితే ఈ ఎన్నికల మేనేజ్మెంట్ టీమ్ లో కొందరికి టిక్కెట్లు ఇవ్వక తప్పని పరిస్థితి. అయితే వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు లాంటి నేతలను మాత్రం పార్టీ ప్రత్యేక గుర్తింపు నివ్వనున్నట్లు సమాచారం. వీరిని ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనకుండా నామినేటెడ్ పోస్టులు ఇచ్చి వారిని ప్రభుత్వంలో క్రియాశీలక పాత్ర పోషించేలా ప్లాన్ వేస్తున్నారట జగన్. 

ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మేకపాటి రాజమోహన్ రెడ్డిలు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉంటూ ఏయే నియోజకవర్గాల్లో పార్టీ బలంగా ఉంది బలహీనంగా ఉంది అభ్యర్థుల మార్పులు చేర్పులు, పార్టీ తీసుకోవాల్సిన కీలక నిర్ణయాలలో దిశానిర్దేశం చేయనున్నారు. 

ఆ నిర్ణయాలను అమలు చెయ్యడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించేలా వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డిలు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఉభయగోదావరి జిల్లాల ఇంచార్జ్ గా వైవీ సుబ్బారెడ్డి వ్యవహరిస్తున్నారు. అటు ఉత్తరాంధ్ర ముఖ్యంగా విశాఖపట్నంపై విజయసాయిరెడ్డి ప్రత్యేక దృష్టిసారించారు.  

అందువల్లే వైవీ సుబ్బారెడ్డికి పార్టీ టికెట్ ఈసారి కష్టమేనని తెలుస్తోంది. వైవీ సుబ్బారెడ్డి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించడంతోపాటు పార్టీని అధికారంలో తీసుకురావడంలో క్రియాశీలకంగా వ్యవహరించనున్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే ప్రభుత్వంలో కూడా ముఖ్యపాత్ర పోషించనున్నట్లు ఆ పార్టీ వర్గాల సమాచారం.

Follow Us:
Download App:
  • android
  • ios