వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి విజయమ్మ రాజీనామా.. కాసేపట్లో మీడియా ముందుకు షర్మిల
వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి వైఎస్ విజయమ్మ రాజీనామా చేసిన నేపథ్యంలో కాసేపట్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల మీడియా ముందుకు రానున్నారు. ఈ క్రమంలో ఆమె ఏం మాట్లాడతారోనన్న ఉత్కంఠ నెలకొంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (ysr congress party) గౌరవాధ్యక్షురాలిగా వైఎస్ విజయమ్మ (ys vijayamma) రాజీనామా చేయడంతో ఏపీ రాజకీయాల్లో కలకలం రేగింది. గుంటూరులో జరుగుతున్న వైసీపీ ప్లీనరీ (ysrcp plenary) వేదికపై నుంచే ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమవుతోంది. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు షర్మిల శ్రమిస్తున్నారని.. ఈ క్రమంలో తాను ఆమెతోనే వుండేందుకు నిర్ణయించుకున్నానని విజయమ్మ అన్నారు. ఈ నేపథ్యంలో మరికాసేపట్లో వైఎస్ షర్మిల మీడియా ముందుకు రానున్నారు. దీంతో ఆమె ఏం మాట్లాడతారోనన్న ఉత్కంఠ నెలకొంది.
అంతకుముందు వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ.. ఏపీలో మరోసారి జగన్ పార్టీని అధికారంలోకి వస్తాడని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ ఇద్దరి బిడ్డలకు తల్లిగా అండగా ఉంటానని చెప్పారు. వైఎస్ఆర్ భార్యగా రెండు రాష్ట్రాల్లో తాను ఎక్కడికి వెళ్లినా కూడా ప్రజలు తనను అంగీకరిస్తారన్నారు. వక్రీకరణలకు, కుటుంబ సభ్యుల మధ్య అంతరాలు ఉన్నాయనే ప్రచారానికి తావివ్వకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో తాను వైఎస్ఆర్‌సీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా ఆమె ప్రకటించారు.
తాను రాయని చేయని సంతకం పేరుతో సోషల్ మీడియాలో రాజీనామా లేఖ ప్రత్యక్షం కావడాన్ని ఆమె ప్రస్తావించారు.ఈ లేఖలో జగన్ కు వ్యతిరేకంగా ఉందన్నారు. ఈ లేఖలో పిచ్చి రాతలు రాశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ లేఖను చూస్తే వారి దిగజారుడుతనం కన్పిస్తుందన్నారు. ఈ లేఖను చూస్తే ఇంత దారుణంగా వ్యవహరిస్తారా అని కూడా అన్నించిందన్నారు.
Also Read:వైఎస్సార్ సీపి గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా: తేల్చేసిన వైఎస్ విజయమ్మ
ఈ లేఖను తాను చూసిన సమయంలో ఎంతో బాధ పడినట్టుగా ఆమె చెప్పారు. తల్లి, చెల్లి, అన్న, తమ్ముడు, ఆడ, మగ అనే తేడా లేకుండా నిందలు వేశారని ఆమె మండిపడ్డారు. తాను రాయని లేఖను సోషల్ మీడియాలో ఎలా విడుదల చేస్తారని ఆమె ప్రశ్నించారు. తాను వినకూడని మాటలు కూడా విన్నానని చెప్పారు.వైఎస్ఆర్‌సీపీ గౌరవ అధ్యక్షురాలి పదవి నుండి తప్పుకొంటున్నట్టుగా విజయమ్మ వివరించారు.ఈ సమయంలో ఆమె ఒకింత భావోద్వేగానికి గురయ్యారు.
తెలంగాణలో వైఎస్ షర్మిలమ్మ ఒంటరి పోరాటం చేస్తుందన్నారు. ఈ సమయంలో షర్మిలకు అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కష్టాల్లో ఉన్న సమయంలో తాను తన కొడుకుకు అండగా ఉన్నానని ఆమె గుర్తు చేసుకున్నారు. జగన్ సంతోషంగా ఉన్న సమయంలో తెలంగాణలో ఒంటరిగా ఉన్నషర్మిలకు అండగా నిలబడకపోతే ఆమెకు అన్యాయం చేసినట్టు అవుతుందని భావించి వైఎస్ఆర్‌సీపీ గౌరవ అధ్యక్షురాలి పదవి నుండి వైదొలుగుతున్నట్టుగా ఆమె వివరించారు.