కుప్పంలో టీడీపీ నేత ఇంటిపై మద్యం బాటిళ్లు, రాళ్లతో దాడి.. వైసీపీ కార్యకర్తల పనే..
కుప్పంలో వైసీపీ కార్యకర్తలు తెగబడ్డారు. టీడీపీ నేత ఇంటిమీద దాడికి దిగారు. మద్యం బాటిళ్లు, రాళ్లతో దాడి చేశారు.
కుప్పం : చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో టీడీపీ సీనియర్ నేత, గంగమ్మ గుడి మాజీ చైర్మన్ ఆర్ఆర్ రవి ఇంటిపై సోమవారం అర్ధరాత్రి వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. రాళ్లు, మద్యం బాటిళ్లతో దాడి చేశారు. కుప్పం శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ ఆలయానికి సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లు ఇవ్వాలంటూ రెస్కో చైర్మన్, వైసిపి నేత సెంథిల్ సోమవారం రాత్రి 10.45 గంటల సమయంలో రవికి ఫోన్ చేయగా అవి తన వద్ద లేవని.. దేవాదాయ శాఖ అధికారులకు అప్పగించామని ఆయన తెలిపారు. దీంతో వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
ఈ నేపథ్యంలో అర్ధరాత్రి కొంతమంది వైసీపీ కార్యకర్తలు కుప్పం నేతాజీ రోడ్డులోని రవి ఇంటిపై మద్యం బాటిళ్లు, రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనను స్థానిక టీడీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. టిడిపి హయాంలో గంగమ్మ గుడికి సంబంధించి రూ. తొంబై ఆరులక్షలు వివిధ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. ఆ బాండ్లు ఇవ్వాలంటూ వారం రోజులుగా వైసీపీ నేతలు రవిని అడుగుతున్నారు. అవి తన వద్ద లేవని చెప్పినా వినిపించుకోకుండా ఆయన ఇంటిపై దాడికి పాల్పడ్డారు.
ఇదిలా ఉండగా, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సొంత ఇల్లు నిర్మించుకుంటే చూడాలన్న నియోజకవర్గ ప్రజల కల త్వరలోనే తీరనుంది. మే 13న కుప్పంలో దీనికి అవసరమైన ప్లేస్ రిజిస్ట్రేషన్ కోసం సంబంధిత పత్రాలపై ఆయన సంతకం కూడా అయిపోయింది. పార్టీ వర్గాల నుంచి సేకరించిన వివరాల ప్రకారం... కుప్పం-పలమనేరు జాతీయ రహదారి సమీపంలో శాంతిపురం మండల పరిధిలోని కడపల్లె, కనమలదొడ్డి గ్రామాల మధ్య శివపురం ఎదురుగా 2.10 ఎకరాల స్థలాన్ని చంద్రబాబు సొంత ఇల్లు నిర్మాణం కోసం కొనాలని నిర్ణయించారు.
కుప్పం పర్యటనకు వచ్చిన చంద్రబాబు ఆరోజు ఉదయం ఆ స్థలం రిజిస్ట్రేషన్ పత్రాలపై సంతకాలు చేసి వేలిముద్రలు వేశారు. మే నెల 29న స్థలానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. జూన్ 5న చంద్రబాబు, తన సతీమణి భువనేశ్వరితో కుప్పం వచ్చి ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. ఇక్కడ గృహంతో పాటు పార్టీ సమావేశాల కోసం ప్రత్యేకంగా కార్యాలయం భవనం కూడా నిర్మించనున్నారు.