Asianet News TeluguAsianet News Telugu

క్రాస్ ఓటింగ్ దెబ్బ.. వైసీపీ ఏడుగురు అభ్యర్థుల్లో ఒకరి ఓటమి.. టీడీపీకి అనుకూలంగా ఓటేసింది ఎవరు..?

ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో అధికార వైసీపీకి భారీ షాక్ తగిలింది. మొత్తం 7 స్థానాల్లో విజయం సాధించాలనే వైసీపీ ఆశలపై క్రాస్‌ ఓటింగ్‌ నీళ్లు చల్లింది.

YSRCP win only 6 seats in MLA Quota MLC Elections due to cross voting ksm
Author
First Published Mar 23, 2023, 8:00 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో అధికార వైసీపీకి భారీ షాక్ తగిలింది. మొత్తం 7 స్థానాల్లో విజయం సాధించాలనే వైసీపీ ఆశలపై క్రాస్‌ ఓటింగ్‌ నీళ్లు చల్లింది. వైసీపీ నుంచి మొత్తంగా నలుగురు టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు క్రాస్ ఓటింగ్ చేయడంతో.. ఆమె విజయం సాధించారు. ఇక, వైసీపీ నుంచి బరిలో నిలిచిన ఏడుగురిలో ఆరుగురు విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థులు పెనుమత్స సూర్యనారాయణ రాజు,  ఇజ్రాయిల్, మ‌ర్రి రాజశేఖర్, పోతుల సునీత, చంద్రగిరి యేసురత్నంలు మొదటి ప్రాధాన్యత ఓట్లతో(వారికి 22 చొప్పున ఓట్లు వచ్చాయి)  విజయం సాధించారు. కోలా గురువులు, జయమంగళం వెంకట రమణలకు 21 చొప్పున మొదటి ప్రాధాన్యత ఓట్లు రాగా.. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత జయమంగళ వెంకట రమణను విజయం వరించింది. కోలా గురువులు ఓడిపోయారు. అయితే వైసీపీ నుంచి టీడీపీ అభ్యర్థికి  క్రాస్ ఓటింగ్ ఎవరు చేశారనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

అసెంబ్లీలో సాంకేతికంగా వైసీపీకి 151 మంది ప్రజాప్రతినిధులు, టీడీపీకి 23 మంది, జనసేన పార్టీకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. అయితే టీడీపీ నుంచి విజయం సాధించిన నలుగురు ఎమ్మెల్యేలు..  వల్లభనేని వంశీమోహన్, మద్దాలి గిరి, కరణం బలరాం, వాసుపల్లి గణేష్‌లు వైసీపీకి మద్దతు తెలిపారు. జనసేన నుంచి గెలుపొందిన రాపాక కూడా వైసీపీకి అనుకూలంగా మారారు. దీంతో వైసీపీ బలం 156కి చేరింది. దీంతో టీడీపీ బలం 19కే పరిమితం అయింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 7 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంతా భావించారు. కానీ చంద్రబాబు మాత్రం టీడీపీ తరఫున బీసీ సామాజిక వర్గానికి చెందిన పంచుమర్తి అనురాధను బరిలో దింపారు. 

దీంతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక అనివార్యం అయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాలంటే.. అభ్యర్థికి 22 మొదటి ప్రాధాన్యత ఓట్లు అవసరం పడింది. మరోవైపు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాలు వైసీపీకి చేదు అనుభవం ఎదురుకావడంతో.. సీఎం జగన్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై మరింత ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే అధికార పార్టీ మొత్తం 154 ఓట్లు(156- ఇద్దరు వైసీపీ రెబల్స్) చేజారకుండా పలు జాగ్రత్తలు తీసుకుంది. అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలపై నిఘా కూడా పెట్టింది. 22 మంది ఎమ్మెల్యేలను ఒక్కో గ్రూప్‌గా విభజించి.. పక్కా స్కెచ్ వేసింది. 

22 మంది ఎమ్మెల్యేల చొప్పున ఏడు గ్రూపులుగా విభజించి..  ఒక్కో గ్రూప్‌కు ఒక్కో ఇంచార్జ్‌ను నియమించింది. అలాగే ప్రతి గ్రూప్‌లోని మరో ముగ్గురు నేతలకు వారిచేత ఓట్లు సక్రమంగా వేయించే బాధ్యతలను అప్పగించింది. ఇందుకోసం మూడు, నాలుగుసార్లు మాక్ పోలింగ్ నిర్వహించారు. విజయవాడలో బుధవారం రాత్రి గ్రూప్‌ల వారీగా ఎమ్మ్యల్యేలతో విందు రాజకీయం నిర్వహించారు. 

అయితే వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. క్రాస్ ఓటింగ్ జరగకుండా విఫలం అయ్యారు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలుగా ఉన్న  ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిల ఓటుపై వైసీపీ ఆశలు వదిలేసుకోవడంతో.. ఆ ఇద్దరు కాకుండా క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన మరో ఇద్దరు ఎవరనేది అధికార పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కోలా గురువులు, జయమంగళ వెంకట రమణలకు 21 చొప్పున మొదటి ప్రాధాన్యత  ఓట్లు పోలు కావడంతో.. వారికి ఓటు వేసేందుకు కేటాయించిన గ్రూప్‌లలోని సభ్యుల నుంచి ఒక్కొక్కరు చొప్పున క్రాస్‌ ఓటింగ్ జరిగినట్టుగా తెలుస్తోంది. 

దీంతో క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడింది ఎవరనేదానిపై వైసీపీ అధిష్టానం ఆరా తీస్తుంది. అయితే తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవితో పాటు, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి‌లు ఎమ్మెల్యే క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్టుగా వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios