టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌ని వైసీపీకి చెందిన వాహనాలు వెంటాడాయి. ఉంగుటూరు నుంచి తాడేపల్లి గూడెం వరకు టీడీపీ అధినేత కాన్వాయ్‌ని ఈ వాహనాలు అనుసరించాయి.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భద్రత విషయంలో మరోసారి లోపాలు బయటపడ్డాయి. ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు తెలుగుదేశం పార్టీ చీఫ్ పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. అలాగే రైతులకు బాసటగా నిలిచేందుకు టీడీపీ ఈ నెల 12న ‘‘రైతు పోరుబాట’’ పేరుతో ఆయన పాదయాత్ర నిర్వహించనున్నారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం చంద్రబాబు ఉండవల్లి నుంచి తణుకు బయల్దేరారు. 

అయితే ఏలూరు జిల్లా ఉంగుటూరు సమీపంలో చంద్రబాబు కాన్వాయ్‌లోకి అనూహ్యంగా వైసీపీ వాహనాలు దూసుకొచ్చాయి. ఉంగుటూరు నుంచి తాడేపల్లి గూడెం వరకు టీడీపీ అధినేత కాన్వాయ్‌ని ఈ వాహనాలు అనుసరించాయి. అయితే వీటిని ఎస్కార్ట్ పోలీసులు ఏమాత్రం అడ్డుకోలేదు. తాడేపల్లిగూడెం దాటిన తర్వాత వైసీపీ వాహనాలు మరో మార్గం గుండా వెళ్లిపోయాయి. అయితే అంతసేపు చంద్రబాబు కాన్వాయ్‌లోనే అవి వుండటంతో ఆయన భద్రతపై తెలుగుదేశం శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.